ఫొటో స్టూడియోనే.. నాకు గుడి

వేలాదిమందిని స్మైల్‌ ప్లీజ్‌ అంటూ తన కెమెరాలో బంధించి క్లిక్‌మనిపించే ఈమె జీవితంలో పెను విషాదాలే ఎక్కువ. కెమెరా గురించి చాలామందికి అవగాహనలేని కాలంలోనే ఈమె కెమెరా చేత పట్టి పిల్లలను చదివించారు.

Updated : 19 Feb 2023 09:21 IST

వేలాదిమందిని స్మైల్‌ ప్లీజ్‌ అంటూ తన కెమెరాలో బంధించి క్లిక్‌మనిపించే ఈమె జీవితంలో పెను విషాదాలే ఎక్కువ. కెమెరా గురించి చాలామందికి అవగాహనలేని కాలంలోనే ఈమె కెమెరా చేత పట్టి పిల్లలను చదివించారు. కష్టాలెన్నెదురైనా ధైర్యంగా నిలబడి, మూడు దశాబ్దాలుగా ఫొటో స్డూడియో నిర్వహిస్తున్న నవనీతం స్ఫూర్తి కథనమిది.

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు నవనీతం. నర్సింగ్‌ చదివి సేవలందించాలని ఆమె కల. కుటుంబనేపథ్యంతో తన కల నెరవేరలేదు.  రైల్వే పరీక్షల్లో ర్యాంకు సాధించినా సంప్రదాయమంటూ ఇంట్లోవాళ్లు బయటికి అడుగువేయనివ్వలేదు. తమిళనాడులోని పెరంబూర్‌కు చెందిన  నవనీతానికి పెళ్లై ఇద్దరు మగపిల్లలు, కూతురు పుట్టారు. భర్త సంపాదనకు తోడుగా నిలవాలని అనుకునేవారీమె. అంతలోనే అనారోగ్యంతో భర్త చనిపోయాడు. దాంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ముగ్గురు పిల్లల చదువు కళ్ల ముందు కనిపించేది. దాంతో సోదరుడివద్ద ఫొటోస్టూడియోలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారీమె. సందేహాలను పెద్ద కొడుకువద్ద అడిగి తెలుసుకునేవారు. ఫొటోలు తీయడం, డెవలప్‌ చేయడం నేర్చుకొని, పెరంబూరులో 1991లో రెయిన్‌బో స్టూడియో ప్రారంభించారు. అప్పటికి పెద్దోడు డిగ్రీ రెండో ఏడాది చదువుతూ, వివాహాది శుభకార్యాలను షూట్‌ చేసి వచ్చేవాడు. అయితే అనుకోని సంఘటన ఆమె జీవితంలో మరోసారి పెను విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన కొడుకు ఓ నదిలో ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోయిన కొన్నాళ్లకే పెద్ద కొడుకు మరణం ఆమెను కుంగదీసింది. కొడుకు సాయం లేకపోయేసరికి ఇంటి అద్దె కట్టడానికీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఎలాగైనా కష్టాలను దాటి, మిగతా ఇద్దరినైనా చదివించాలనే లక్ష్యం ఆమెను తిరిగి స్టూడియో కొనసాగించేలా చేసింది.

సాంకేతికత నేర్చుకొని..

టెక్నాలజీ కొత్త పోకడలనూ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నారు నవనీతం. ‘నా చిన్నకొడుకు కొత్తగా వచ్చే టెక్నిక్స్‌ను నేర్పాడు. ఎప్పటికప్పుడు నన్ను నేను అప్‌డేట్‌ చేసుకొంటా. గతంలో రోల్‌ కెమెరాలో ఫొటోలు తీసినప్పుడు మొదట కడిగి ఆ తర్వాత ప్రింట్‌ తీయాలి. ఇప్పుడు డిజిటల్‌ కెమెరాతో తీసే ఫొటో ప్రింట్‌ చేసేముందు ఎడిట్‌ చేయాలి. కొత్తగా పెళ్లైనవారు వస్తే కొత్తకొత్త ఐడియాలతో ఫొటోలు తీస్తుంటా. అవి వారికి చాలా నచ్చుతాయి. 32 ఏళ్లుగా ఫొటోగ్రఫర్‌గా ఉంటూ చెన్నైలోనే ద ఓల్డెస్ట్‌ కెమెరా వుమెన్‌గా పేరు తెచ్చుకున్నా. నా వయసువారందరూ గుడి, గోపురం అంటూ పర్యటిస్తుంటారు. తెలిసినవారు కొందరు నన్ను దీంట్లోంచి బయటకు రావొచ్చు కదా అంటారు. ఈ స్టూడియో నాకు ఆలయంలాంటిది. ఉదయం 9.30కు తెరిస్తే రాత్రి 10 గంటలవరకు పని చేస్తుంటా. అత్యవసరానికి ఫొటో కావాలంటే రెయిన్‌బో స్టూడియో నిత్యం తెరిచే ఉంటుందనే నమ్మకం వినియోగదారులకుంటుంది. అలా అందరూ ప్రశంసిస్తుంటే సంతోషం అనిపిస్తుంది. నావద్ద ఫొటోలు తీసుకున్నవారు  పెళ్లైన తర్వాత, పిల్లలతో కలిసి మా స్టూడియోకు వస్తుంటారు. అలా దక్షిణ భారతదేశంలోని కేరళ, బెంగళూరు వంటి పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చినప్పుడల్లా నావద్దకొచ్చి ఫొటోలు తీయించుకుంటారు. ఇప్పటివరకు వేలాదిమందిని ఫొటోలు తీశా. కొత్తగా వచ్చినవారు స్టూడియోలో నన్ను చూసి మీరు ఫొటో తీయగలరా అని అనుమానంగా అడుగుతారు. తీసిన తర్వాత ఫొటో చూసి ప్రశంసించి మరీ వెళతారు’ అని అంటున్న 66ఏళ్ల నవనీతం నేటి తరానికి.. ‘కష్టాలెన్నెదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకొనే వరకు వెనకడుగేయొద్దు. ధైర్యం గా ముందడుగు వేయాల’ని సలహానిస్తారు. యువతతో పోటీపడుతోన్న నవనీతం కథ అందరికీ స్ఫూర్తిదాయకం కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్