పెట్టుబడి రూ.5వేలు... లాభాలు రూ.8వేల కోట్లు

సాధారణ ఇల్లాలు... వ్యాపారం ఏం చేస్తుందని హేళన చేశారు.  మహిళలకు ఉపాధి కల్పిస్తే... వారిని పక్కదోవ పట్టిస్తుందని నిందించారు. అయినా సరే, ఆవిడ విమర్శలకి జడవలేదు.

Published : 20 Feb 2023 00:09 IST

సాధారణ ఇల్లాలు... వ్యాపారం ఏం చేస్తుందని హేళన చేశారు.  మహిళలకు ఉపాధి కల్పిస్తే... వారిని పక్కదోవ పట్టిస్తుందని నిందించారు. అయినా సరే, ఆవిడ విమర్శలకి జడవలేదు. సవాళ్లకు భయపడలేదు. దుస్తుల తయారీ, ఎగుమతుల సంస్థను ప్రారంభించి అహర్నిశలూ శ్రమపడ్డారు. వేలమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ని అందుకునే స్థాయికి సంస్థను చేర్చారు. ఆమే షాహీ సంస్థ ఫౌండర్‌ సరళా అహూజా. 

రళ అహూజాకు పదహారో ఏటే పెళైంది. దిల్లీకి చెందిన ఈమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో... ఉద్యోగంలో చేరాలనుకున్నారు. స్నేహితురాలి సాయంతో ఓ దుస్తుల తయారీ ఫ్యాక్టరీలో పనికి చేరారు. ఇంటి బాధ్యతలూ, ఆఫీసు పనులు ఒత్తిడితో... చేరిన ఏడాదిలోనే ఆ పని మానేయాల్సి వచ్చింది. కానీ, ఏదో చేయాలన్న తపన ఆమెను నిలవనిచ్చేది కాదు. ఆ ఆలోచనల్లోనే విదేశాలకు దుస్తులు ఎగుమతి చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు సరోజ.

అలా... 1970లో దిల్లీ రంజిత్‌నగర్‌లో ‘షాహీ ఎక్స్‌పోర్ట్స్‌’ మొదటి ప్రొడక్షన్‌ యూనిట్‌  రూ.5వేలు పెట్టుబడితో మొదలైంది.  ప్రారంభంలో రోజుకి 200 ఆర్డర్లు వచ్చేవి. క్రమంగా అమెరికా, యూరోప్‌  దేశాల నుంచి ఆర్డర్లను సంపాదించడానికి ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారామె. నాణ్యతలో రాజీ పడకపోవడం, సమయపాలన పాటించడం వంటి వాటివల్ల తక్కువ సమయంలోనే సంస్థకు మంచి పేరు వచ్చింది. ఆర్డర్లూ పెరిగాయి.

మహిళలకు ఉపాధి...

‘దిల్లీ వీధులు, మురికివాడల్లో నిలువ నీడలేని స్త్రీలెందరినో చూశా. ఇలాంటి వారికి పనిని నేర్పించడం, ఉపాధి కల్పించడం వల్ల వాళ్ల జీవితాలు బాగుంటాయి. సాధికారతా సాధ్యమవుతుందనే నమ్మకంతో ముందడుగు వేశా. అయితే,  సంస్థని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. మొదట ఇంటి నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేదాన్ని. ఆ సమయంలో మా దగ్గర పనిచేసే మహిళలు వచ్చి వెళ్తుండటం ఇరుగుపొరుగుకి నచ్చేది కాదు. దాంతో తలా ఒకమాట అనేవారు. మామూలు ఇల్లాలివి నీవల్ల వ్యాపారం అవుతుందా అని ఇంకొందరు హేళన చేసేవారు. ఆ మాటలు ఒత్తిడిని పెంచేవి. మరో పక్క నేనేంటో నిరూపించుకోవాలనే పట్టుదలా పెరిగింది. అదే ఈ రోజు పెద్ద పెద్ద బ్రాండ్‌లకు పనిచేసే అవకాశాన్ని కల్పించింది’ అంటారామె. షాహీ ఎక్స్‌పోర్ట్స్‌లో ప్రస్తుతం లక్ష మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 51 ఫ్యాక్టరీలున్నాయి. గతేడాది సంస్థ వార్షికాదాయం రూ.8,244 కోట్లకు పై మాటే. 

అహర్నిశలూ శ్రమించి...

షాహీ సంస్థ 75వేలమందికిపైగా మహిళలకు కమ్యూనికేషన్‌, సమయపాలన, ఆర్థిక వ్యవహారాలు వంటి అనేక అంశాలపై శిక్షణనందించి ఉపాధి కల్పించింది. సాధ్యం కాదన్నవారే శెభాష్‌  అనేలా చేసిన 86ఏళ్ల సరళ అహూజా మరెందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్