మీ ఇంటిని మేం సర్దిపెడతాం...

నచ్చి కొనుక్కున్న డ్రెస్‌... సమయానికి కనిపించదు. అర్జెంటుగా కావాల్సిన ఫైల్‌ ఎంత వెతికినా దొరకదు... వంటిల్లేమో ఎంత సర్దినా అంతే! పిల్లల బొమ్మల సంగతి సరే సరి.

Published : 21 Feb 2023 00:24 IST

నచ్చి కొనుక్కున్న డ్రెస్‌... సమయానికి కనిపించదు. అర్జెంటుగా కావాల్సిన ఫైల్‌ ఎంత వెతికినా దొరకదు... వంటిల్లేమో ఎంత సర్దినా అంతే! పిల్లల బొమ్మల సంగతి సరే సరి...ఇది ప్రతి మహిళకూ అనుభవమే. ఇక, ముందు వీటి గురించి పెద్దగా ఆలోచించకండి...ఆ పని మాకప్పగిస్తే చాలు... అందంగా, సౌకర్యవంతంగా మార్చేస్తాం అంటున్నారు ‘అరేంజ్‌ ఇట్‌ ఆల్‌’ నిర్వాహకురాలు ఆంచల్‌ కేజ్రీవాల్‌.

‘చేసే పనిని ప్రేమిస్తే చాలు...అదే మీకు సంతృప్తినీ, ఉన్నత స్థాయినీ’ అందిస్తుందని చెబుతారు చెన్నైకి చెందిన ఆంచల్‌ కేజ్రీవాల్‌. అలాంటి ప్రేమతోనే ‘అరేంజ్‌ ఇట్‌ ఆల్‌’ పేరుతో డీక్లట్టరింగ్‌ సర్వీస్‌ని నిర్వహిస్తున్నారు. చక్కగా చదువుకుని చెత్తను శుభ్రం చేసే పనేంటని ఎందరు విమర్శించినా... ఆధునిక ప్రపంచ అవసరాలకు తగ్గట్లు మార్కెట్‌ని సృష్టించుకోవడమే నయా వ్యాపారమంత్రం అంటారామె. ఎంబీఏ పూర్తిచేసిన ఆంచల్‌ మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో కొన్నాళ్లు పనిచేశారు. అయితే, ఆ ఉద్యోగాలు తనకు సంతృప్తిన్వివ్వకపోవడంతో కొన్నాళ్లు  కెరియర్‌ బ్రేక్‌ తీసుకోవాలనుకున్నారు. ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యతలు తీసుకున్నారు. ఆంచల్‌ ఇద్దరు పిల్లలకు తల్లి. ఇంటిని అందంగా సర్దుకోవడం ఓ కళ. దానిపై ఆంచల్‌కీ మొదటి నుంచీ ఆసక్తి ఎక్కువే. చిన్న చిన్న చిట్కాలతో ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దుకోవడం, వివిధ రకాల ఆర్గనైజర్లు వాడి పని సౌకర్యంగా నడిచేలా చూసుకోవడం ఆమెకు ఇష్టం. ఆ పనితీరుకి అందరి నుంచీ ప్రశంసలు అందేవి.

కరోనా తర్వాత... కొవిడ్‌ విజృంభణతో...అందరి జీవితాలూ, జీవనశైలి మారిపోయాయి. ముఖ్యంగా పనిచేసే తల్లులు ఇంటి పనులు చక్కబెట్టుకోవడంలో ఒత్తిడికి గురయ్యేవారు. అది చూశాకే...డీక్లట్టరింగ్‌, ఆర్గనైజింగ్‌ల ప్రాధాన్యం ఆమెకు అర్థమైంది. అందుకే, ఇంటిని క్లట్టర్‌ ఫ్రీజోన్‌గా మార్చడాన్నే వ్యాపార ఆలోచగా ఎంచుకుని తన ప్రయాణ దిశను మార్చుకున్నారు ఆంచల్‌. ఇందుకోసం ఆ రంగంలో ప్రత్యేక కోర్సులు పూర్తి చేసి...2021లో ఐఐఎమ్‌ బెంగళూరు (ఇంక్యుబేషన్‌)లో అరేంజింగ్‌ స్పేస్‌, డీక్లట్టరింగ్‌ సేవలను అందించేందుకు ‘అరేంజ్‌ ఇట్‌ ఆల్‌’ ప్రారంభించారు. వ్యక్తుల అవసరం ఏంటో తెలుసుకుని, బడ్జెట్‌ ఆధారంగా ఆరు గంటల నుంచి నాలుగు రోజుల సమయంతో ఈ పనులు చేసిస్తారు. ఆంచల్‌ బృందం... కేవలం ఇల్లు సర్ది, చెత్త ఏరేసి వెళ్లిపోదు. తర్వాత ప్రతి వస్తువునీ శుభ్రంగా, పద్ధతిగా ఎలా ఉంచుకోవాలో అవగాహనా తరగతులూ నిర్వహిస్తారు. తమ సేవల్ని చిల్డ్రన్స్‌, కార్పొరేట్‌, హోం మాడ్యూల్స్‌గా విభజించుకుని వినియోగదారులకు వర్క్‌షాపులు,  పిల్లల కోసం ప్రత్యేక తరగతులూ తీసుకుంటున్నారు. బొటిక్‌లూ, ఇతర వ్యాపార సంస్థలను రీలొకేట్‌ చేస్తారు.


ఇబ్బందుల్ని దాటి... ‘వ్యాపారం అన్నాక లాభనష్టాలు తప్పవు. ముఖ్యంగా విదేశాల్లో ఈ తరహా వ్యాపారాలు ఉన్నప్పటికీ మన దగ్గర తక్కువే అందుకే దీనిపై అవగాహన కల్పించడం, మార్కెటింగ్‌ అవకాశాలను సృష్టించుకోవడం కాస్త కష్టమైన విషయం. పైగా నాకు వ్యాపార రంగంలో అనుభవం లేదు. అందుకే వేసిన ప్రతి అడుగులోనూ పాఠాలు నేర్చుకున్నా. మొదట్లో నామీద నాకు నమ్మకం లేక ఇతరుల సాయం అడిగా. ముందు మనల్ని మనం  నమ్మాలని తర్వాతే అర్థమైంది’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్