మతిమరుపుపై పోరాటం

తానెంతగానో ప్రేమించే తండ్రి చివరి రోజుల్లో కుటుంబంలో ఎవరినీ గుర్తుపట్టకుండా మరణించడం ఆమెను కదిలించింది. ఈ పరిస్థితికి కారణం అల్జీమర్స్‌. తన తండ్రిలా మరెవరూ కాకూడదనుకొంది.

Published : 23 Feb 2023 00:05 IST

తానెంతగానో ప్రేమించే తండ్రి చివరి రోజుల్లో కుటుంబంలో ఎవరినీ గుర్తుపట్టకుండా మరణించడం ఆమెను కదిలించింది. ఈ పరిస్థితికి కారణం అల్జీమర్స్‌. తన తండ్రిలా మరెవరూ కాకూడదనుకొంది. అందరిలో ఈ వ్యాధిపట్ల అవగాహనతోపాటు మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుకొనే విధానాలను నేర్పుతున్నారు జ్యోతి గాంధీ.

డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు మెదడు పనితీరును క్షీణింపజేస్తాయి. ఈ సమస్యలున్న వారికి తమ ఎదుట ఏం జరుగుతోందనేది అవగాహన ఉండదు. జ్ఞాపకశక్తి దూరమవుతుంది. అత్యంత సన్నిహితులనూ మర్చిపోతుంటారు. ఏళ్ల తరబడి ఉన్న జ్ఞాపకాలు దూరమవుతాయి. ప్రస్తుతం 44 లక్షలమంది ఈ సమస్యకు గురైనవారిలో ఉండగా, మరో 28 సంవత్సరాలకు ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ అంశాలే జ్యోతిని కలవరపరిచాయి.

బ్రెయిన్‌ జిమ్‌..

మానసికారోగ్యంపై చాలామందికి అవగాహన లేకపోవడంతో ఈ తరహా అనారోగ్యాలు మరింత వేగంగా పెరుగుతున్నాయంటారు జ్యోతి. ‘మెదడుకు నిత్యం ఉత్తేజ పరిచే వ్యాయామాలివ్వాలి. లేదంటే దాని పనితీరు క్రమేపీ కుంటుపడుతుంది. దీన్నొక సాధనగా అందరూ పాటించాలి. ఈ రకమైన అనారోగ్యాలపై అందరిలో అవగాహన కల్పించాలి. మెదడుకు వ్యాయామాలు నేర్పించాలి. ఈ రెండు అంశాలే నా లక్ష్యాలు. నాన్న అల్జీమర్‌కు గురై, మా అందరినీ మర్చిపోయారు. ఆయన మెదడు నుంచి తుడిచిపెట్టినట్లు అన్నీ పోయాయి. ఆ తర్వాత తను మాకు శాశ్వతంగా దూరమయ్యారు.  తట్టుకోలేకపోయా. ఈ తరహా సమస్యను ముందుగానే  గుర్తించలేకపోతున్నారు.

అసలెందుకిలా జరుగుతోంది, ఎలా జరుగుతోందనేదానికి కారణాలు  తెలుసుకోవాలనిపించింది. అల్జీమర్స్‌పై పరిశోధన, ప్రారంభించా. దీనికి సంబంధించిన కొన్ని కోర్సులను పూర్తి చేసిన తర్వాత ఈ వ్యాధి గురించి అవగాహన వచ్చింది. నేను తెలుసుకున్న వివరాలను అందరికీ చెప్పాలనుకున్నా. అలా 2019లో ‘బ్రెయిన్‌ జిమ్‌’ ప్రారంభించా. వెబినార్స్‌, కన్సల్టేషన్ల ద్వారా అందరికీ అల్జీమర్‌ గురించి వివరిస్తున్నా. ఇప్పటివరకు దాదాపు 45వేలమందికి దీని గురించి పాఠాలు చెప్పగలిగా. కొన్నిచోట్ల నేను మాట్లాడే అంశానికి ప్రాముఖ్యతనిచ్చేవారు కాదు. దీని గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపేవారు కాదు. మరికొందరైతే తమకెటువంటి చెడు అలవాట్లు లేవు, మెరుగైన జీవనశైలి అనుసరిస్తున్నాం కాబట్టీ అల్జీమర్స్‌ వంటివి తమకు రావనే అపోహలో ఉండేవారు. శారీరకారోగ్యానికి సంబంధించింది కాదు, మానసికారోగ్యానికి సంబంధించింది. ఆందోళన, ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి’ అంటారామె.

సవాళ్లు..

కార్పొరేట్‌ కార్యాలయాలకు, పాఠశాలలకెళ్లి అల్జీమర్స్‌పై అవగాహన కలిగించి, మెదడుకు సంబంధించిన వ్యాయామాలను వివరించేవారీమె. మానసికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేవారు. అయితే కొవిడ్‌ తర్వాత అన్నీ మూతబడటంతో ఈ అవగాహనా కార్యక్రమాల నిర్వహణ వీలుకాలేదు. అంతేకాదు.. కొవిడ్‌ చాలామందిలో మానసికాందోళన పెంచింది. దాంతో గూగుల్‌ మీట్‌ను వేదికగా చేసుకొని ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించారు. ప్రస్తుతం పాఠశాలలు, కార్యాలయాల్లో బ్రెయిన్‌ జిమ్‌ తరగతులు నిర్వహిస్తూనే, మరోవైపు ‘టీచ్‌ ది ట్రైనర్స్‌’ పేరుతో కోర్సు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా దీనిద్వారా ఒక అతిపెద్ద బృందాన్ని తయారుచేస్తునారీమె. మానసికారోగ్యం ప్రాముఖ్యతపై ఈ బృందసభ్యులంతా బ్లాగర్స్‌, యూట్యూబర్స్‌గా అందరిలోనూ అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్