మురికివాడల్లో చదువుల వెలుగులు...

వలసొచ్చిన కుటుంబాలకు నీడనిచ్చే బస్తీలవి... ఇక్కడ కనీస సౌకర్యాల సంగతి సరేసరి.  చాలామందికి సరైన ధ్రువీకరణ పత్రాలుండవు... ఆధార్‌ కార్డులంటే అసలే తెలియదు... దాంతో బడికి దూరమై, భవిష్యత్తు భారమై... సాగిపోతున్న బాలల్ని గుర్తించి చదువు బాట పట్టిస్తోంది చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ(క్రై) సంస్థ.

Published : 27 Feb 2023 00:26 IST

వలసొచ్చిన కుటుంబాలకు నీడనిచ్చే బస్తీలవి... ఇక్కడ కనీస సౌకర్యాల సంగతి సరేసరి.  చాలామందికి సరైన ధ్రువీకరణ పత్రాలుండవు... ఆధార్‌ కార్డులంటే అసలే తెలియదు... దాంతో బడికి దూరమై, భవిష్యత్తు భారమై... సాగిపోతున్న బాలల్ని గుర్తించి చదువు బాట పట్టిస్తోంది చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ(క్రై) సంస్థ.

ది హైదరాబాద్‌ గబ్బిలాలపేట బస్తీ. మొన్నటివరకూ అక్కడి పిల్లలు బడికెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. దాంతో చదువు ఆపేసి తల్లిదండ్రులతో పాటే పిల్లలూ చెత్త ఏరడానికి వెళ్లేవారు. ఆ పరిస్థితిని గుర్తించారు చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ(క్రై) సంస్థ వాలంటీర్లు హిమబిందు, మంజుల, సునీల్‌.. చిన్నారుల పరిస్థితిని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇరవై మూడేళ్ల తర్వాత అక్కడో పాఠశాలను ప్రారంభించేలా చేశారు.

ఉపాధి కోసం పక్క రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కుటుంబాలెన్నో హైదరాబాద్‌లోని గబ్బిలాలపేట, జవహర్‌నగర్‌, రాజీవ్‌గాంధీ నగర్‌, గిరిప్రసాద్‌ నగర్‌, శాంతి నగర్‌ వంటి మురికివాడల్లో నివసిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో పిల్లల సంఖ్య ఎక్కువే. వీరిలో చాలామంది పది పన్నెండేళ్లు నిండినా బడి మొహం చూసింది లేదు. ఆధార్‌తో సంబంధం లేకుండా స్కూల్‌ అడ్మిషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నా వారిని ఏ పాఠశాలా చేర్చుకోలేదు. ధ్రువపత్రాలూ, ఆధార్‌కార్డులూ లేకపోవడం వల్లే వారికి అడ్మిషన్‌ దొరకలేదని తెలిసి హిమ బృందం ఓ చిన్నపాటి సర్వే చేస్తే... అలాంటివారు చాలామందే ఉన్నట్లు తేలింది.  రోజు కూలీపై ఆధారపడేవారు... ఆఫీసుల చుట్టూ తిరగలేక వాటినే వద్దనుకోవడంతో వచ్చిందీ సమస్య అని గుర్తించి...అధికారుల సాయంతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు ఇప్పించారు. బస్తీ నుంచి ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు తిరిగేలా తోడ్పాటు అందించారు. ఈ చర్యల వల్ల బడిమానేసిన యాభై ఒక్కమంది చిన్నారులు మళ్లీ చదువుకోగలుగుతున్నారు. ఇది కేవలం ఒక బస్తీ కథ మాత్రమే. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో హిమబిందు లాంటి వాలంటీర్లు నలభై ఆరువేలమంది దేశవ్యాప్తంగా క్రై కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు.

పాలసీల రూపకల్పనలో...

బాల్యవివాహలకు బలైపోతున్న బాలికల్నీ, బాలకార్మికులుగా బతుకీడుస్తున్న పసివాళ్లనీ, చెత్త కుప్పలమధ్యే జీవితాన్ని వెళ్లదీస్తున్న చిన్నారుల జీవితాల్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతోంది క్రై సంస్థ. ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే రిప్పన్‌ 1979లో తన ఆరుగురు స్నేహితులతో యాభై రూపాయల పెట్టుబడితో ఈ సంస్థని ప్రారంభించారు. క్రైకు గత పదేళ్లుగా పూజా మార్వా సీఈవో. ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో 102 స్థానిక ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోందీ సంస్థ. 1991లో ఈ సంస్థ కార్యకలాపాలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఇది బాలల హక్కులు- రక్షణకోసం పనిచేసే అంతర్జాతీయ సంస్థలతోనూ కలిసి నడుస్తోంది. ఉచిత నిర్బంధ విద్యను అందించే వాయిస్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కీలకభాగస్వామం తీసుకుంది. నీతి ఆయోగ్‌, చిన్న పిల్లల హక్కులు- రక్షణపై వేసిన సబ్‌కమిటీలోనూ, మరికొన్ని సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డుల్లోనూ పనిచేస్తూ... ప్రభుత్వాలు పిల్లలకోసం తీసుకొచ్చే పాలసీల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తోంది.

విజయగాథలెన్నో...

క్రై ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య వేలల్లో ఉంది. వారిలో కోల్‌కతాకు చెందిన పాయల్‌ ఒకరు. చదువు మధ్యలో మానేసిన ఆమెను బడిలో చేర్చడమే కాదు... తన ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించింది ఈ సంస్థ. అదే ఆమెను కుంగ్‌ఫూ ఛాంపియన్‌గా మార్చింది. ఆర్థిక పరిస్థితులు కుమార్‌ని చదువు మధ్యలో మానేసేలా చేస్తే క్రై సంస్థ ఇచ్చిన భరోసా మిలటరీ పోలీస్‌ క్యాడెట్‌గా ఎంపికయ్యేలా చేసింది. ఆడపిల్ల ఇంటికి భారమంటూ చదువు వద్దన్న తల్లిదండ్రులను ఒప్పించి ఆ అమ్మాయిని చదివించే బాధ్యత తీసుకుంది క్రై సంస్థ. అప్పటి ఆ చిన్నారి ఇప్పుడు ఏరోనాటికల్‌ ఇంజినీర్‌గా మరెంతో మందికి స్ఫూర్తినిస్తోంది. లాతూర్‌కి చెందిన చిన్నారి పెళ్లికూతురు ఆశ... క్రై ఇచ్చిన మద్దతుతో తనలాంటి బాలికా వధువు భవిష్యత్తుకి రక్షణ కల్పించే పోలీసుగా ఎంపికైంది. ఇలాంటి విజయగాథలెన్నో ఈ సంస్థ ఖాతాలో లెక్కలేనన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ చేయడానికి నిధులెలా అంటారా? ‘మంచి పని చేసేటప్పుడు అందరి మద్దతూ తప్పక ఉంటుందంటారు’ పూజ.

ప్రముఖ సంస్థలతో కలిసి

ఈ సేవా కార్యక్రమాల నిర్వహణ నిధులెలా అంటారా? ‘మంచి పని చేసేటప్పుడు అందరి మద్దతూ తప్పక ఉంటుందంటారు’ పూజ.  ప్రాంతాల వారీగా పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రాజెక్టులను రూపొందిస్తారు. ఈ కార్యక్రమాల అమలుకి అవసరమైన నిధుల సేకరణకోసం... ప్రముఖ ఏంజెల్‌ ఇన్వెస్టర్లూ, సోషల్‌ వెంచర్లూ, కార్పొరేట్‌ సంస్థల సాయం తీసుకుంటారు. అలా.. హీరో, హెచ్‌డీఎఫ్‌సీ, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.

- కాసాల ప్రశాంత్‌ గౌడ్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్