మసితో.. అందాన్ని కప్పేసి!

భారీ బడ్జెట్‌ సినిమా.. స్పెషల్‌ ఎఫెక్ట్‌లు.. ఇవి మనకు కొత్తేమీ కాదు. 1926 కాలంలో.. ఇలాంటి ప్రయోగాలు చేశారు ఫాతిమా బేగం.

Updated : 07 Mar 2023 00:21 IST

భారీ బడ్జెట్‌ సినిమా.. స్పెషల్‌ ఎఫెక్ట్‌లు.. ఇవి మనకు కొత్తేమీ కాదు. 1926 కాలంలో.. ఇలాంటి ప్రయోగాలు చేశారు ఫాతిమా బేగం. మగవారే మహిళా పాత్రలు వేస్తున్న సమయంలో సినిమాల్లోకి అడుగుపెట్టడమే కాదు.. దర్శకత్వమూ వహించారు. మనదేశంలో తొలి మహిళా దర్శకురాలు.. ఆవిడే!

పుట్టింది ఉర్దూ మాట్లాడే సంప్రదాయ ముస్లిం కుటుంబంలో! అయినా నటనమీద ఆసక్తితో పట్టుబట్టి శిక్షణ తీసుకున్నారు. 30 ఏళ్ల వయసులో సినిమాల్లో అడుగుపెట్టారు. ఇప్పట్లా కాదు. అప్పుడు అన్నీ మూకీ సినిమాలే. సంభాషణలుండేవి కాదు. పైగా మహిళలకు అవకాశమే ఉండేది కాదు. ఆడవాళ్ల పాత్రలనూ మగవాళ్లే చేసేవారు. అలాంటి సమయంలో పట్టుబట్టి అవకాశం దక్కించుకున్నారు ఫాతిమా. 1922లో వీర్‌ అభిమన్యుతో సినిమాల్లోకి వచ్చారు. ఆడవాళ్లకి ఇది అనువైనది కాదన్నా కొనసాగారు. తెల్లగా, మెరిసే మేనిఛాయ ఆమె సొంతం. అయినా బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్క్రీన్‌కి తగ్గట్టుగా ఉండాలని ముఖానికి మసి రాసేవారట. నటనకే పరిమితం అవ్వలేదావిడ. నాలుగేళ్లకే ‘ఫాతిమా ఫిల్మ్‌ కంపెనీ’ పేరుతో సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ ప్రారంభించారు. నటీమణులకు భవిష్యత్తు ఉండదన్న మాటలను పక్కకునెట్టి, ముగ్గురు కూతుళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. దర్శకురాలిగా తొలి సినిమా ‘బుల్‌బులే పరిస్థాన్‌’తోనే పరిచయం చేశారు. అది అప్పట్లో భారీ బడ్జెట్‌ సినిమా.. సంభాషణలను ప్రవేశపెట్టడమే కాదు.. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌నీ పరిచయం చేశారు. తన సంస్థ ద్వారా నిర్మాతగా, దర్శకురాలిగా, కథారచయితగా మారినా నటనను 16 ఏళ్లపాటు కొనసాగించారు. ఎందరినో మెప్పించిన ఆ చిత్రాలు ఇప్పుడు అందుబాటులో లేకపోయినా ఆమె స్ఫూర్తి మాత్రం ఎందరికో మార్గదర్శకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్