వంటింట్లోనూ రావాలి..ఐటీ చైతన్యం!

మార్పు మంచిదే.. ఆ మార్పు స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధిస్తే మరీ మంచిది. నేటి సాంకేతిక విప్లవం, ఆవిష్కరణలు ఈ విషయంలో మహిళలకు ఎంత వరకూ అండగా నిలబడుతున్నాయి? ఎలా ముందుకు నడిపిస్తాయి.

Updated : 08 Mar 2023 09:37 IST

మార్పు మంచిదే.. ఆ మార్పు స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధిస్తే మరీ మంచిది. నేటి సాంకేతిక విప్లవం, ఆవిష్కరణలు ఈ విషయంలో మహిళలకు ఎంత వరకూ అండగా నిలబడుతున్నాయి? ఎలా ముందుకు నడిపిస్తాయి... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఈ అంశం గురించి వసుంధర నిపుణులతో మాట్లాడింది. సూచనలే ఇవి...


సైబర్‌ సాంకేతికత పెరగాలి...
-దీప్తి రావుల, వీహబ్‌ సీఈవో

టా ఐరాస మహిళల హక్కులూ, అవసరాల్ని గుర్తిస్తూ ఒక్కో నినాదాన్ని ఎంచుకుంటోంది. ఈ ఏడు ఎంచుకున్న ‘డిజిట్ ఆల్‌: ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఈక్వాలిటీ’ ఇప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు, మహిళలకు ఆర్థిక, సామాజిక, విద్యా, వైద్యం వంటి అంశాల్లో తగిన సౌకర్యాలు, అవకాశాలు కల్పించేందుకు ఇచ్చిన పిలుపు. కొవిడ్‌లో ఎంతో మంది ఆడపిల్లలు చదువుకు దూరం కాకుండా డిజిటల్‌ లెర్నింగ్‌ అవకాశం కల్పించింది. వాస్తవానికి అది మాత్రమే సరిపోదు. ఆడపిల్లలు సామాజిక మాధ్యమాలూ, అంతర్జాల పోకడలకూ బాధితులుగా మారకుండా ఉండాలంటే సైబర్‌ సెక్యూరిటీలో మరిన్ని సాంకేతికతలూ, ఆవిష్కరణలూ అవసరం. వీహబ్‌ ఈ తరహా ఇన్నోవేషన్లకు ప్రోత్సాహం అందిస్తోంది. అయితే, మహిళల్లో మార్పు రావాలంటే...అక్షరాస్యత పెరగాలి. కేవలం సంతకం పెడితే అది సాధ్యపడదు. ఆ ప్రమాణాల స్థాయి పెరగాలి. అప్పుడే సాంకేతిక ఆవిష్కరణల్ని వంటింట్లో ఉండే సాధారణ మహిళలూ సులువుగా వినియోగించుకోగలరు. లింగ వ్యత్యాసమూ తగ్గుతుంది.


డిజిటల్‌ అక్షరాస్యత పెరగాలి
- లంకా రమాదేవి, డైరెక్టర్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ 

డవాళ్లు  సాంకేతిక ఫలాలను లింగభేదం లేకుండా అందుకోవాలంటే ముందు డిజిటల్‌ అక్షరాస్యత సాధించాలి. ఆడియో, వీడియో టూల్స్‌ వినియోగం, స్థానిక భాషల్ని సులువుగా వినియోగించే సాఫ్ట్‌వేర్లూ, యాప్‌లను తీసుకురావాలి. దురదృష్టవశాత్తూ సాఫ్ట్‌వేర్‌లు, ఏఐ పరిజ్ఞానం వంటివన్నీ మగవారి ఆలోచనా విధానాలూ, అభిప్రాయాలకు అనుగుణంగా తయారైనవే. కృత్రిమ మేధ వంటివి గతకాలపు డేటా ఆధారంగా మాత్రమే ఒక అభిప్రాయానికి వస్తాయి. అలాంటప్పుడు అవి మహిళా అభ్యర్థులను ఎలా ప్రోత్సహిస్తాయి. అందుకే కమ్యూనికేషన్‌, యాక్సెస్‌, సెక్యూరిటీ వంటి ఏ విషయంలోనైనా కావొచ్చు... ఆడపిల్లల్లో డిజిటల్‌ లిటరసీ పెరిగినప్పుడే స్త్రీ సాధికారత సాధ్యం అవుతుంది. టూల్స్‌ డిజైన్‌ చేసేప్పుడే అమ్మాయిల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే ఈ విషయంపై కొంత పరిశోధన చేసి యునిసెఫ్‌ ఓ టూల్‌కిట్‌ని సిద్ధం చేయడం కూడా మంచి మార్పు.


పాఠశాల స్థాయి నుంచే మారాలి...  
- వినుత రాళ్లపల్లి, హెడ్‌, జీఎంఆర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

రంగం ఏదైనా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇది ఆవిష్కరణల రంగంలో కాస్త ఎక్కువ. ఆడపిల్లలు సాధారణంగా ఈకామర్స్‌, బ్యూటీ వంటివే ఎంచుకుంటారనే భావనలోనే ఎక్కువమంది ఇన్వెస్టర్లు ఉంటారు. అలా కాకుండా వాళ్లపై నమ్మకం ఉంచి డీప్‌ టెక్నాలజీలోకి రావాలనుకునే అమ్మాయిలకు తగిన ప్రోత్సాహం ఇస్తే... మహిళల కోసం కొత్త ఆవిష్కరణలెన్నో వస్తాయి. నాస్కామ్‌ చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఐటీ రంగంలో అమ్మాయిల సంఖ్య 34 శాతం ఉండగా, స్టార్టప్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో అది 17 శాతం మాత్రమే. సాంకేతిక విభాగంలో పూర్తిగా మగవారే ఉన్నా, వారి శాతం ఎక్కువగా ఉన్నా... అది ఆడవాళ్లకు ప్రయోజనం కలిగించదు. వాళ్లని అర్థం చేసుకొనే ఆవిష్కరణలు రావని బోస్టన్‌ కన్సల్టింగ్‌ చేసిన ఓ అధ్యయనం చెబుతోంది. ఆ నివేేదిక ప్రకారం... మహిళలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన కంపెనీలు, ఇతర సంస్థల కంటే ముందు వరుసలో ఉన్నాయి. లాభాల బాట పట్టాయి. ఈ సమతుల్యం సాధించడం ఒక్కరోజులో సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు బలమైన పునాది పాఠశాల స్థాయి నుంచి మొదలైతే భవిష్యత్తు అమ్మాయిలదే.


నాయకత్వం ఇస్తే సాధ్యం
- డా.శాంత తౌటం, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌, తెలంగాణ 

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల సంఖ్య పెరగాలి. అప్పుడే అమ్మాయిల భద్రతకూ, భవిష్యత్తుకీ భరోసా కల్పించే కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. మనం కోరుకున్నట్టుగా లింగ సమానత్వం వస్తుంది. కూరగాయలు కొనడం దగ్గర నుంచి బ్యాంకింగ్‌ వరకూ...అన్నీ డిజిటల్‌ రూపంలోకి మారాయి. అయితే, వీటిని వినియోగించే విషయంలో ముందుతరం వారు ఇప్పటికీ వెెనకబడే ఉన్నారు. కానీ, నేటి తరం మాత్రం శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వాలు కూడా నూతన ఆవిష్కరణలకూ, టెక్నాలజీ రంగాలకూ నాయకత్వం వహించే బాధ్యతను మహిళలకు అప్పగించడానికి వెనుకాడటం లేదు. నేర్చుకోవాలనే ఉత్సాహం, నైపుణ్యాలు మన సొంతం అయినప్పుడు ఎలాంటి సవాళ్లనైనా పరిష్కరించుకోవచ్చు. అందుకే ఆడపిల్లలు నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడొద్దు.


‘డిజిట్ ఆల్‌: ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఈక్వాలిటీ.. ఏ ఆవిష్కరణ అయినా, సాంకేతికతైనా స్త్రీ పురుష సమానత్వాన్ని చాటాలి. మరి ఈ దిశగా అడుగులు వేయాలంటే ఈ రంగాల్లో మహిళా నాయకత్వం పెరగాలి అంటున్నారీ నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్