చీరకట్టి.. కెమెరా చేతపట్టి!

డాక్టర్‌ అవుతానందావిడ. ‘అమ్మో.. వేళ కాని వేళల్లో పని చేయాలి. రక్షణ భయం వద్దు’ అంది అమ్మ. చిన్నప్పట్నుంచీ దేనికీ అడ్డు చెప్పని అమ్మ.. తొలిసారి వద్దనేసరికి ఆమె మీద గౌరవంతో ఆర్ట్స్‌ ఎంచుకున్నారు.

Published : 08 Mar 2023 00:35 IST

డాక్టర్‌ అవుతానందావిడ. ‘అమ్మో.. వేళ కాని వేళల్లో పని చేయాలి. రక్షణ భయం వద్దు’ అంది అమ్మ. చిన్నప్పట్నుంచీ దేనికీ అడ్డు చెప్పని అమ్మ.. తొలిసారి వద్దనేసరికి ఆమె మీద గౌరవంతో ఆర్ట్స్‌ ఎంచుకున్నారు. ఫొటో జర్నలిస్ట్‌ అయ్యి.. నెహ్రూ నమ్మకాన్నీ చూరగొన్నారు. హోమై వ్యారవల్లా.. ఎవరీవిడ?

1913.. గుజరాత్‌లోని పార్శీ కుటుంబంలో పుట్టారు హోమై. అప్పట్లో అమ్మాయిలు చదువుకోవడమే గొప్ప. అలాంటిది పెళ్లయ్యాకా ఉద్యోగం పేరుతో కాలు బయటపెట్టారు. నాన్న థియేటర్‌ ఆర్టిస్ట్‌ కావడంతో దేశమంతా తిరిగారు. ఒకసారి ఓ చిన్నారి ఫొటో చూస్తున్నావిడకి అది తీసిందో మహిళని తెలిసి ఆశ్చర్యమేసింది. తర్వాత ఆ ఆసక్తే ఫొటోగ్రఫీ వైపు నడిపింది. భర్త ఫొటో జర్నలిస్ట్‌. ఆయన్నుంచే మెలకువలు నేర్చుకున్నారు. ‘బాంబే క్రానికల్‌’కి తొలిసారి ఫొటోలు పంపితే ప్రచురితం అయ్యాయి. అయితే ఆమె పేరిట కాదు. భర్త పేరిట! ఇదే కొనసాగడం నచ్చక దిల్లీ వెళ్లి బ్రిటిష్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌లో చేరారు. అప్పటికి విదేశీ, దేశీ ఫొటోగ్రాఫర్ల మధ్య పోటీ ఎక్కువే. ఒకే ఒక మహిళ కావడంతో ఈవిడని ఎవరూ పట్టించుకునేవారు కాదు. దాన్నీ స్వేచ్ఛలా భావించేవారామె. నిలబడితే తీసే ఫొటోల్లో జీవం ఉండదనే ఆవిడ.. క్యాండిడ్‌ ఫొటోలకే ప్రాధాన్యమిచ్చేవారు. అవే ఆమెకు ప్రత్యేకతను తెచ్చాయి. స్వాతంత్య్రం ముందు పరిస్థితులు, దేశరాజకీయాల్లో మార్పులు, ప్రధానిగా నెహ్రూ, ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలెన్నో క్లిక్‌ మనిపించారు. అలా ఆయన అభిమానాన్నీ చూరగొన్న ఆవిడ చీరకట్టు.. భుజానికి కెమెరాతో గుర్తింపు తెచ్చుకున్నారు. మన చరిత్రకు గుర్తులుగా మిగిలిన ఎన్నో ఫొటోలు ఆమె బంధించినవే! దాదాపు 5 దశాబ్దాలు సేవలందించిన హోమై.. దేశంలో మొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్