యుద్ధభూమిలో నాయకురాళ్లు!

దేశరక్షణకి గుండె ధైర్యం చాలు. దీనికి ఆడ, మగ తేడా లేదు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ దేశరక్షణలో భాగస్వాములవ్వడానికి ఏళ్లపాటు పోరాడాం.

Updated : 12 Mar 2023 07:48 IST

దేశరక్షణకి గుండె ధైర్యం చాలు. దీనికి ఆడ, మగ తేడా లేదు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ దేశరక్షణలో భాగస్వాములవ్వడానికి ఏళ్లపాటు పోరాడాం. చివరికి యుద్ధభూమిలో పోరాడే అవకాశాన్ని సాధించాం. సమానత్వ దిశగా సాగే క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. తొలిసారిగా సేనలను నడిపే నాయకత్వ హోదాలనూ అందుకున్నారు మన వీరమణులు. కెప్టెన్‌ శాలిజా దామీ, కల్నల్‌ గీతా రాణా.. వీరిని మీరూ కలుసుకోండి.


ప్రభుత్వపాఠశాలలో చదివి..

మహిళలు సాయుధ దళాల్లో సమర్థంగా సేవలు అందించకపోతే ఇంత పురోగతి సాధ్యమయ్యేది కాదనే కెప్టెన్‌ శాలిజా.. కృషి, అంకిత భావమే తనను వాయుసేన పోరాట విభాగానికి నాయకత్వం వహించే దిశగా నడిపించాయి అంటారు. పంజాబ్‌లోని సరభా గ్రామానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారీమె. తండ్రి హర్కేష్‌ దామీ పంజాబ్‌ రాష్ట్ర పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, తల్లి దేవ్‌కుమారి వాటర్‌ సప్లయి అండ్‌ శానిటేషన్‌ విభాగాల్లో పనిచేశారు. చుట్టుపక్కల అందరూ తమ పిల్లలను కాన్వెంట్‌లో చేరుస్తోంటే, శాలిజను మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎక్కడ చదివినా.. పట్టుదలతో ప్రయత్నిస్తే లక్ష్యాలను ఛేదించడం సులువనే అమ్మానాన్నల మాటలే ఆమెకు స్ఫూర్తి. వాళ్లు నేర్పిన క్రమశిక్షణే తనను ఉన్నత ఆశయాలవైపు నడిపించిందంటారు శాలిజా. మహిళా కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన మెంటర్‌ పీపీ సింగ్‌ స్ఫూర్తితో.. ఎన్‌సీసీలో చేరారు. ఇక్కడి అనుభవాలే ఈమెను ఐఏఎఫ్‌లోకి అడుగుపెట్టేలా చేశాయి. ‘17ఏళ్లకు పైగా అనుభవంలో నాలాంటి మహిళలనెందరినో చూశా. సాయుధ దళాల్లో మహిళలు సమర్థంగా సేవలందిస్తూ, పురోగతిని సాధిస్తున్నారు’ అని చెప్పే శాలిజా 2003లో ఐఏఎఫ్‌లో హెలికాప్టర్‌ పైలట్‌గా కెరియర్‌ ప్రారంభించారు. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్‌ విభాగానికి ఫ్లైట్‌ కమాండర్‌గా చేశారు. ఫ్రంట్‌లైన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ల విభాగంలో ఉన్న ఈమె, పశ్చిమ ప్రాంతంలో క్షిపణుల స్క్వాడ్రన్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈ అవకాశం అందుకున్న తొలి మహిళ ఈవిడ!


తొలి అడుగు
చైనా సరిహద్దులో..

లద్దాఖ్‌లో.. భారత్‌- చైనా సరిహద్దుల్లో స్వతంత్ర ఫీల్డ్‌ వర్క్‌షాప్‌నకు నేతృత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు కల్నల్‌ గీతా రాణా! ఈ అవకాశం అందుకొన్న తొలి మహిళా ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌ (ఈఎంఈ) కార్ప్స్‌ సభ్యురాలీమె. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన కమాండింగ్‌ బాధ్యతలను మహిళలకూ అప్పగించాలన్న నిర్ణయానికి ప్రతీకే ఈవిడ నియామకం! చైనా సరిహద్దులోని ఈఎంఈ యూనిట్‌ స్వతంత్ర ఫీల్డ్‌ వర్క్‌షాప్‌ బాధ్యత చేపట్టారీమె. గీత రాణాది ఆర్మీ నేపథ్యమే! ఈమెది లూధియానా. నాన్న మెహర్‌ రెజిమెంట్‌లో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా చేశారు. గీత చెన్నైలో శిక్షణ పూర్తిచేసి, 2000లో బాధ్యతలు చేపట్టారు. ఈఎంఈ కార్ప్స్‌ సభ్యురాలిగా ఆయుధాల డిజైన్‌, అభివృద్ధి, ప్రయోగం, పరిశీలన వంటి వాటిల్లో పాలు పంచుకున్నారు. 23 ఏళ్ల కెరియర్‌లో సిక్కిం, జమ్మూకశ్మీర్‌ వంటి ఎన్నో ప్రాంతాల్లో పనిచేశారు. ఈఎంఈ శిక్షణ కేంద్రంలో ఇన్‌స్ట్రక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. గీతా రాణా.. ఆర్మీలో ఒక యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్న తొలి నాన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్