వస్త్రానికి ప్రాణం పోస్తోంది...

ముక్కలు ఆమె చేతిలో సజీవ చిత్రాలుగా మారతాయి. రంగులు పులుముకొని సహజత్వంతో మాయ చేస్తాయి. ఆమె చేతి వేళ్ల మధ్య 3డీ క్విల్టింగ్‌ కళ.. కళాఖండంగా మారి విశ్వవేదికపై ప్రదర్శన ఇస్తోంది.

Published : 14 Mar 2023 00:16 IST

ముక్కలు ఆమె చేతిలో సజీవ చిత్రాలుగా మారతాయి. రంగులు పులుముకొని సహజత్వంతో మాయ చేస్తాయి. ఆమె చేతి వేళ్ల మధ్య 3డీ క్విల్టింగ్‌ కళ.. కళాఖండంగా మారి విశ్వవేదికపై ప్రదర్శన ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి ఈ కళలో శిక్షణనిస్తున్న శృతి దండేకర్‌ స్ఫూర్తి కథనమిది.

వృత్తిరీత్యా శృతి ఆర్కిటెక్ట్‌. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ఈమెకి 2005లో పెళ్లైంది.  భర్తతో సంగ్లీకి వచ్చిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. హౌసింగ్‌ సొసైటీలు, బంగ్లాలు, పాఠశాలలకు సంబంధించిన ప్రాజెక్టులు చేసేవారు. 2009లో బాబు పుట్టడంతో తన సంరక్షణలో పనిని సమన్వయం చేయలేక వ్యాపారానికి కొన్ని రోజులు దూరమయ్యారు.

శిక్షణతో.. ఖాళీ సమయంలో మనసంతా తెలియని ఆందోళనతో బాధపడేవారీమె. ‘వృథా వస్త్రాలతో చేతిరుమాళ్లు, గృహోపకలంకరణలు రూపొందించేదాన్ని. మా పనమ్మాయి నాకు సాయంగా ఉండేది. ఆమె వద్ద మెషిన్‌ కుట్టడం నేర్చుకునేదాన్ని. అప్పుడే ఎలిజబెత్‌ బ్లాగ్‌ చూశా. క్విల్టింగ్‌పై ఆమె చాలా వీడియోలు పొందుపరిచారు. ఆ కళ నేర్చుకోవాలనిపించి, రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. 2012లో దీనికి సంబంధించి మెషిన్‌ కొనుక్కొన్నా. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. రకరకాల ఫొటోలను నకలుగా తీసుకొని వస్త్రంతో క్విల్టింగ్‌ చేసేదాన్ని. ఓసారి మావారి తాతగారి ఫొటోను 3డీ పోర్ట్రయిట్‌ క్విల్ట్‌ చేశా. దానికి దాదాపు 3,500 వస్త్ర ముక్కలు ఉపయోగించా. మూడున్నర నెలలు పట్టింది. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసించారు’ అని వివరిస్తారీమె. 3డీ పోర్ట్రయిట్‌ క్విల్ట్‌ చేయడంలో సొంతంగా నైపుణ్యాలను పెంచుకున్నారు శృతి. ‘క్విల్టింగ్‌లో నా సొంత టెక్నిక్‌ ‘అబౌట్‌ పేస్‌’ కనిపెట్టా. ఇందులో ఆరేడురకాల వస్త్రాలతో క్విల్టింగ్‌ చేస్తా. వాటితో స్టీవ్‌జాబ్స్‌ పోర్ట్రయిట్‌ను వారంలో చేశా. ఈ కళను ప్రపంచవేదికపైకి తీసుకెళ్లాలనుకొన్నా. అమెరికాలో జరిగే ‘మోడరల్‌ క్విల్ట్‌ గిల్డ్‌- క్విల్ట్‌కాన్‌’ ప్రదర్శనకు 2015లో మన దేశం తరఫున ఓ మహిళ పోర్ట్రయిట్‌ను పంపితే అర్హత సాధించింది’ అని చెప్పుకొస్తారీమె.

25వేల ముక్కలతో...శివాజీ పట్టాభిషేక వేడుకను 20 అడుగుల పొడవుతో 287 రంగుల్లో 25వేల వస్త్రం ముక్కలతో ఎనిమిది నెలలు శ్రమించి అతిపెద్ద క్విల్ట్‌ పోర్ట్రయిట్‌ను రూపొందించారీమె. దేశంతోపాటు హోస్టన్‌, చికాగో క్విల్ట్‌ ఫెస్టివళ్లలో ప్రదర్శించారు. ‘స్టిచ్‌ మెడిటేషన్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఆసక్తి ఉన్నవారికి ఈ కళలో శిక్షణనందిస్తున్నారు. ముంబయి, పుణె సహా చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోనూ వర్క్‌షాపులు నిర్వహిస్తూ.. తనలాంటి మరెందరికో ఈ కళలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్