ఆస్కార్‌లో.. ఆమె సంతకం

60 ఏళ్ల వయసు సాధించడానికి అడ్డంకి కాదని నిరూపించి, ఉత్తమ నటిగా మెరిసింది.. మిషెల్‌యో! ముగ్గురు పిల్లలని చూసుకుంటూ దర్శకత్వం చేపట్టి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుని అందుకుంది.. సారాపోలెన్‌!  పర్యావరణంపై ప్రేమతో..

Updated : 14 Mar 2023 07:57 IST

60 ఏళ్ల వయసు సాధించడానికి అడ్డంకి కాదని నిరూపించి, ఉత్తమ నటిగా మెరిసింది.. మిషెల్‌యో! ముగ్గురు పిల్లలని చూసుకుంటూ దర్శకత్వం చేపట్టి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుని అందుకుంది.. సారాపోలెన్‌!  పర్యావరణంపై ప్రేమతో.. అనుబంధాలని నిలబెట్టాలనే లక్ష్యంతో ఏకంగా చరిత్రనే తిరగరాశారు గునీత్‌మోంగా, కార్తికి గోన్సాల్వెస్‌లు...


రఘు మీద ప్రేమతో!

మె ఒక ఫొటో జర్నలిస్ట్‌. వన్యమృగాలు, పర్యావరణంపై వీడియోలు చిత్రించిన అనుభవం. దాంతో డైరెక్టర్‌ అవ్వాలన్న ధైర్యం ఎలా వచ్చిందంటే.. ‘రఘు (పిల్ల ఏనుగు)పై కలిగిన ప్రేమే’ అంటారు కార్తికి గోన్సాల్వెస్‌. ఈమెది ఊటీ. విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో పీజీ చేశారు. నాన్న ఫొటోగ్రాఫర్‌, అమ్మకేమో మూగజీవులంటే ఇష్టం. బామ్మ పర్యావరణ ప్రేమికురాలు. వీళ్ల నుంచి వంశపారంపర్యంగా తనకీ పర్యావరణం, వన్యమృగాలపై ప్రేమ ఏర్పడింది అంటారామె. వివిధ మేగజీన్లతోపాటు అడ్వర్టైజ్‌ మెంట్లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలకు పనిచేశారు. అయిదేళ్ల క్రితం ఓసారి ఇంటికెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళుతుండటం గమనించారు కార్తికి. ‘వన్యమృగాలు ఊళ్లలోకి వస్తున్నాయని చంపేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అలాంటిది ఆ వ్యక్తి, ఏనుగు పిల్ల మధ్య అనుబంధం నన్ను ఆశ్చర్యపరిచింది. పైగా మూణ్ణెళ్ల ఏనుగు పిల్లని నేనెప్పుడూ చూడలేదు. తొండంతో దేన్నీ సరిగా పట్టుకోవడమూ రావడం లేదు. కానీ అతను చెప్పే విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటోంది. ఆసక్తి అనిపించి అతనితో మాట కలిపా. తన పేరు బొమన్‌, తల్లి చనిపోతే ఆ ఏనుగు పిల్లను చేరదీశానంటే ఆశ్చర్యమనిపించింది’ అంటారు కార్తికి. అప్పటికి సినిమా ఆలోచన లేదు. రఘుతో స్నేహం చేస్తూ, వాళ్ల అనుబంధాన్ని దగ్గర నుంచి పరిశీలించాలనుకున్నారు. తొందరపడి ఫొటోలూ తీయలేదట. ముందు వాళ్లతో అనుబంధం ఏర్పరచుకున్నాక ఫొటో తీశారు. తర్వాత చిన్న వీడియో తీశారు. దాన్ని నెట్‌ఫ్లిక్స్‌ వాళ్లకి చూపించినప్పుడు ఆమెకు గునీత్‌ను కలవమని చెప్పారట. అలా గునీత్‌ మోంగాతో పరిచయం ఏర్పడింది. ఇదంతా జరగడానికి ఏడాది పట్టింది!

‘సినీరంగంలో నిలదొక్కుకోవడం ఒక అమ్మాయికెంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది ఇంకో అమ్మాయికి అవకాశం ఇవ్వకుండా ఉండగలనా? నేను నిర్మించే సినిమాలు ఏదోక సందేశాన్ని ఇవ్వాలనుకుంటా. ఇది మనుషులు, జంతువుల మధ్య అనుబంధం, వాళ్లిద్దరూ కలిసి సాగితే ప్రకృతికెంత మేలో తెలియజేస్తుంది. బొమన్‌, బెల్లీ పెళ్లితో.. వితంతువుకీ మళ్లీ పెళ్లి చేసుకునే హక్కుందనీ, ఓ వెనుకబడిన తెగ సంస్కృతినీ చూపించాం. అది అందరికీ నచ్చింది. అందుకే దీన్ని ఇద్దరు మహిళల విజయంగా చెబుతా’ అంటారు గునీత్‌ మోంగా. 42 నిమిషాల ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ని తీయడానికి అయిదేళ్లు పట్టింది. స్క్రిప్ట్‌ ఉండదు. ఏనుగు పిల్లలు, బొమన్‌, బెల్లీల జీవనశైలే కథా వస్తువు. అందుకే 450 గం. ఫుటేజీ వచ్చింది. కొన్ని అపాయాలూ ఎదురయ్యాయి. అయినా.. ఆస్కార్‌ గుర్తింపుతో ఇవన్నీ మర్చిపోయామంటారు గునీత్‌, కార్తికి!


వాళ్లేం మాట్లాడుకున్నారో తెలుసా?

మూడేళ్ల పిల్లల నుంచి... 70 ఏళ్ల వయసు మళ్లిన ఆడవాళ్ల వరకూ అంతా అక్కడకు చేరారు. ఎప్పుడూ లేనంతగా మనసువిప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సినిమా పేరు కూడా అదే.. ‘విమెన్‌ టాకింగ్‌’. ఇంతకీ ఆ ఆడవాళ్లంతా ఏం మాట్లాడుకున్నారు? ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుని గెలుచుకుంది..

ఆధునిక సౌకర్యాలకు దూరంగా.. మతాచారాలను పాటిస్తూ బొలీవియాలో నివసించే అనేక వేల కాలనీల్లో మెన్నోనైట్‌ ఒకటి. కొంతకాలంగా అక్కడి స్త్రీల జీవితాల్లో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. రాత్రిళ్లు వాళ్లకే తెలియకుండా వాళ్లపై జరిగే అత్యాచారాలని నోరువిప్పి చెప్పడానికి అంతా భయపడతారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ అత్యాచారాలు మొదట సైతాన్‌ పనే అనుకుంటారు. బయటకు చెబితే సమాజం వెలివేస్తుందనే భయం. చివరికి మాట్లాడుకుంటారు. తర్వాతే ఆ అత్యాచారాల గుట్టు గురించి అసలు విషయం తెలుస్తుంది. ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగిన మిరియమ్‌ టోయెస్‌ ఈ సంఘటనని ప్రపంచానికి తెలియచేయాలనుకుంది. విమెన్‌ టాకింగ్‌ పేరుతో ఈ అమానుషాన్ని అక్షరబద్ధం చేసింది. ట్రిలియమ్‌ బుక్‌ అవార్డు కోసం పోటీపడ్డ ఈ పుస్తకానికి తెరరూపం ఇద్దామని మంచి దర్శకుల కోసం వెతికారు నిర్మాతలు. రచన, దర్శకత్వం రెండింట్లోనూ ప్రతిభ ఉన్నవారి కోసం వెతికినప్పుడు సారాపోలెన్‌ వాళ్ల కంటపడింది. ఆమె ఏడేళ్ల వయసు నుంచే అటు నటనలోనూ, ఇటు రచనలోనూ తనదైన ప్రతిభ చూపించింది. పెళ్లికి ముందువరకూ దర్శకత్వం చేసింది. చాలా విరామం తర్వాత తిరిగి ఈ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. ‘ముగ్గురు పిల్లలని చూసుకుంటూ దర్శకత్వం చేస్తాననుకోలేదు. నిర్ణయించుకున్నాక వాస్తవానికి దగ్గరగా తీసేందుకు చాలా కష్టపడ్డా. ముఖ్యంగా ఆడపిల్లలతో పనిచేసినప్పుడు వాళ్ల బాల్యాన్ని బంధించాలనుకోలేదు. వాళ్లు వద్దు అన్నప్పుడు షూటింగ్‌ ఆపేసేదాన్ని. షూటింగ్‌ ఎప్పుడు కావాలన్నా చేయొచ్చు. కానీ అమ్మాయిల భావోద్వేగాలు ప్రధానం. అవి  పలికినప్పుడే తీయాలనుకున్నా. ఈ విజయం స్త్రీలందరిది’ అంటారామె.


ఆ మాటకి అవకాశం ఇవ్వొద్దు...

ఆశ, ఆశయం ఉంటే ఆరుపదుల వయసులో కూడా సాధించి చూపించొచ్చు అని నిరూపించింది 60 ఏళ్ల మిషల్‌ యో. ఎవ్రీథింగ్‌, ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రానికి.. ఆసియా నుంచి మొదటిసారి ఉత్తమ నటి అవార్డుని అందుకుని చరిత్ర సృష్టించారామె.. ‘వయసైపోయింది. ఇంకేం సాధిస్తారులే’ మీ దగ్గర ఈ మాటలు అనే అవకాశం ఎప్పుడూ, ఎవరికీ ఇవ్వొద్దు. మీరు ఒక విషయాన్ని నమ్మితే సాధించడానికి వెనకాడొద్దు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆత్మవిశ్వాసంతో నిలబడండి. ఈ క్రమంలో మిమ్మల్ని వెనక్కి నెట్టేందుకు.. విమర్శకులు సిద్ధంగా ఉంటారు. మీ ఆశయం జ్వాలలా మండితే అవన్నీ తోక ముడవాల్సిందే. నన్నే ఉదాహరణగా చేసుకోండి. ఈ విజయం కోసం నాలుగు దశాబ్దాలు ఎదురుచూశా. ఇప్పుడు చరిత్రని తిరగ రాశా. ఈ అవార్డుని అమ్మకు అంకితమిస్తున్నా. అమ్మే లేకపోతే  ఈ వేదికపై నేను ఉండేదాన్నా?’ అనే మిషెల్‌ మలేషియాలో చైనా కుటుంబంలో పుట్టారు. తన 21 ఏళ్లప్పుడు అందాలపోటీలో పాల్గొని మిస్‌ వరల్డ్‌ మలేషియా-1983’గా నిలిచారు. హాంకాంగ్‌ యాక్షన్‌ చిత్రాల్లో నటన మొదలుపెట్టి, తన ప్రతిభతో హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ శభాష్‌ అనిపించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్