ఆమె కలలు.. నేలపై నక్షత్రాలు!

నింగిలోని తారలని నేలపైకి తెచ్చే నక్షత్రశాలలంటే ఇష్టపడని పిల్లలుంటారా? కానీ ఎంతమంది చిన్నారులకి ప్లానిటోరియాలని చూసే అవకాశం కలుగుతోంది? గ్రామీణ విద్యార్థులకీ సైన్స్‌ని చేరువచేయాలన్న లక్ష్యంతో సంచార సైన్స్‌ ల్యాబులు, నక్షత్రశాలలు ఏర్పాటు చేస్తూ 13లక్షలమంది చిన్నారులకు దగ్గరయ్యారు నళిని అపరంజి.

Updated : 16 Mar 2023 07:50 IST

నింగిలోని తారలని నేలపైకి తెచ్చే నక్షత్రశాలలంటే ఇష్టపడని పిల్లలుంటారా? కానీ ఎంతమంది చిన్నారులకి ప్లానిటోరియాలని చూసే అవకాశం కలుగుతోంది? గ్రామీణ విద్యార్థులకీ సైన్స్‌ని చేరువచేయాలన్న లక్ష్యంతో సంచార సైన్స్‌ ల్యాబులు, నక్షత్రశాలలు ఏర్పాటు చేస్తూ 13లక్షలమంది చిన్నారులకు దగ్గరయ్యారు నళిని అపరంజి. వసుంధర పలకరించినప్పుడు ఈ క్రమంలో ఎదురైన సవాళ్లని చెప్పుకొచ్చారామె...  

కప్పుడు ఊరికి దూరంగా బడి ఉండేది. దాంతో మైళ్ల దూరం నడవాల్సిందే. ఇప్పుడు ఊరికో బడి. కానీ వాళ్లలో ఎంతమంది పిల్లలకు నాణ్యమైన సైన్స్‌ పాఠాలు, అంతరిక్ష పరిజ్ఞానం అందుతున్నాయి. ఆ చిన్నారులందరికీ నక్షత్రాలు, గ్రహాలను దగ్గర నుంచీ చూపించాలన్నది నా కల. మాది బెంగళూరు దగ్గర హుబ్లి. నాన్న ప్రభురాజ్‌ అపరంజి సీఏ. అమ్మ పద్మజ గృహిణి. మేమిద్దరం ఆడపిల్లలం. నేను సీఏ చదివా. దినేష్‌తో వివాహమయ్యాక లండన్‌ వెళ్లిపోయా. పదేళ్ల తర్వాత ఇండియా వచ్చాక.. ఇక్కడి పిల్లలకోసం ఏదైనా చేయాలనుకున్నా. దాంతో మావారితో కలిసి వర్నాల్‌ టెక్నాలజీ పేరుతో గ్రామీణ విద్యార్థులకు కెరియర్‌పై అవగాహన, ఉన్నత విద్యకు కావాల్సిన శిక్షణ ఇచ్చేవాళ్లం. అలా కుగ్రామాలకు వెళ్లినప్పుడు పిల్లలు సైన్స్‌లో ఎంత వెనుకబడ్డారో అర్థమైంది. లండన్‌లో పిల్లలకు ఖగోళశాస్త్రం తేలిగ్గా అర్థమవడానికి తరగతులు తీసుకోవడం చూసి, మన దేశంలోనూ ప్రయత్నించాలనుకున్నా.  

ఒక్కొక్కటి రూ.కోటి ఖర్చుతో..

2017లో ‘తారే జమీన్‌ పర్‌’ స్టార్టప్‌ను ప్రారంభించా. సంచార ప్లానిటోరియంల రూపకల్పన... దేశవ్యాప్తంగా ప్రదర్శనలు మా లక్ష్యం. కర్ణాటక ఐటీ విభాగం నిర్వహించిన ఎలివేట్‌ 100 ప్రోగ్రాంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైందీ అంకుర సంస్థ. దాంతో మొబైల్‌ ప్లానిటోరియంల తయారీకి రూ.30 లక్షల నిధులు కేటాయించింది. మావారికి సైన్స్‌పై పట్టుంది. దాంతో ఇద్దరం కలిసి పనిచేయాలనుకున్నాం. ఎల్‌అండ్‌టీ, టీవీఎస్‌ గ్రూపు ఇన్ఫోటెక్‌, కలరి క్యాపిటల్‌ వంటి సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు అందుకొని తయారీ ప్రారంభించాం. మొదటి సారి బెంగళూరు దగ్గరున్న చిక్‌బళ్లాపుర్‌ గ్రామంలో పిల్లలకు మొబైల్‌ ప్లానిటోరియంలో షోవేశాం. వాళ్ల ఆనందం చూడాలి. చాలా సంతోషమేసింది. ఇది విజయవంతం కావడంతో ప్రభుత్వం మరిన్ని ప్లానిటోరియాల తయారీకి నిధులు కేటాయించింది. ఈ వ్యాన్‌లో కంప్యూటర్లు, వ్యాన్‌, ప్రొజెక్టర్‌, జనరేటర్‌, సోలార్‌ జీపీఎస్‌ అనుసంధానమై.. మా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. ఒక్కో వాహనం తయారీకి రూ.కోటి వ్యయం. మా బృందం వీటిని నిర్వహిస్తుంది. ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రభుత్వ అధికారులు, ప్రధానోపాధ్యాయుల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తాం. ఇప్పటివరకు మొత్తం 12 వాహనాలు తయారుచేశాం. 6వేల గ్రామాల్లో.. 10వేల పాఠశాలల్లో 13 లక్షలమంది చిన్నారులు ఈ మొబైల్‌ వాహనాలు అందించిన సేవలని అందుకున్నారు.  

దేశం మొత్తం తిరుగుతున్నాం..

సైన్స్‌పై అవగాహన పెంచడానికి 2020లో మొబైల్‌ సైన్స్‌ ల్యాబులనీ రూపొందించాం. 5- 12వ తరగతి విద్యార్థులు భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రయోగాలు చేయగలిగేలా సౌకర్యం కల్పించాం. ఇక్కడ రోబోటిక్స్‌, డ్రోన్స్‌పై అవగాహన పొందొచ్చు. ఇప్పటివరకు 5 సంచార ల్యాబులు తయారుచేశాం. కర్ణాటక, మహారాష్ట్ర, కశ్మీరు, కార్గిల్‌, లద్దాక్‌లోని గ్రామాలకు వెళ్లి సేవలు అందించాం.

అప్పుడే పులొచ్చి వెళ్లింది..

మైసూరు రాజకుటుంబానికి చెందిన త్రిషికా కుమారి గత నెలలో నాగరపల్లి అటవీప్రాంతలోని 180మంది గిరిజన చిన్నారులతో ఒకరోజు గడిపారు. అక్కడ మా ప్లానిటోరియంని ప్రదర్శించాం. 2 రోజులముందే అక్కడ ఒక చిన్నారిని పులి చంపేసింది. దాంతో కార్యక్రమం ముగిసేవరకూ భయపడ్డా. కశ్మీర్‌, కార్గిల్‌, బారాముల్లా, ఉరి వంటి ప్రాంతాల్లోనూ ఎన్నో ఇబ్బందులు. కానీ పిల్లల కళ్లల్లో కనిపించే ఆనందం ముందు ఇవన్నీ ఎంత? వాళ్లని పెద్దయ్యాక ఏమవుతారని అడిగితే సైంటిస్టవుతా, రాకెట్‌ పంపుతా, అంతరిక్షానికి వెళతా అనే వారి సమాధానాలే నాకు తృప్తినిస్తాయి. హైదరాబాద్‌లో జరిగిన టై గ్లోబల్‌ సమిట్‌ పోటీల్లో మా అంకురం రూ.30లక్షలు నగదు బహుమతిని అందుకుంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్