తబలా.. మాంత్రికురాలు!

ఉస్తాద్‌ అల్లారఖా, జాకీర్‌ హుసేన్‌, శంకర్‌ ఘోష్‌.. తబలా విద్వాంసులనగానే వీళ్ల పేర్లే వినిపిస్తాయి. వాళ్లతో పాటుగా ఖ్యాతి గడించారు అనురాధా పాల్‌. ప్రపంచంలోనే తొలి మహిళా తబలా విద్వాంసురాలామె!

Published : 17 Mar 2023 00:06 IST

ఉస్తాద్‌ అల్లారఖా, జాకీర్‌ హుసేన్‌, శంకర్‌ ఘోష్‌.. తబలా విద్వాంసులనగానే వీళ్ల పేర్లే వినిపిస్తాయి. వాళ్లతో పాటుగా ఖ్యాతి గడించారు అనురాధా పాల్‌. ప్రపంచంలోనే తొలి మహిళా తబలా విద్వాంసురాలామె!

ముంబయిలో అనురాధా పాల్‌ కచేరీ! దానికి హాజరైన చిత్రకారుడు ఎంఎఫ్‌ హుసేన్‌ కచేరీ పూర్తయ్యాక ఆమెను కలిసి ‘రేపు మీ ఇంటికి వస్తా’ అని చెప్పేసి వెళ్లారట. అన్నట్టుగానే కలిసి నా ‘గజ్‌గామిని’ సినిమాకి నువ్వే నేపథ్య సంగీతమివ్వాలి అన్నారట. మాధురీ దీక్షిత్‌ నటించిన సినిమా అది. ‘నా వల్ల అవుతుందా’ అన్నా ఆయన పట్టుబట్టి ఆమెను ఒప్పించారట. ఆ సినిమా అంతా అనురాధ ఒక్కరే తబలా వాయిస్తూ రీ రికార్డింగ్‌ చేశారు. ప్రపంచంలో ఒక స్త్రీ తబలా వాయిస్తూ రీ రికార్డింగ్‌ పూర్తిచేసిన సినిమా అదొక్కటే అంటారు సంగీత పండితులు.

అనురాధా పాల్‌.. పుట్టింది ముంబయి. ఆమెలోని సంగీత జ్ఞానాన్ని అమ్మమ్మ సరోజ్‌బెన్‌ గుర్తించి శాస్త్రీయ సంగీత శిక్షణలో చేర్పించారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలను ఒకేసారి నేర్చుకున్న ఆవిడ గాత్రానికి తోడుగా వాయిస్తున్న తబలాపై మనసు పారేసుకున్నారు. ‘ఆడపిల్లలు సితార్‌, వీణ, వయోలిన్‌ వంటివి నేర్చుకోవాలి, తబలా అబ్బాయిలకి’ అని ఎందరన్నా పట్టుబట్టి నేర్చుకున్నారామె. ప్రముఖ తబలా విద్వాంసుల వద్ద శిక్షణ తీసుకొని 14 ఏళ్లకే సంగీత కచేరీల్లో ప్రముఖులతో వేదిక పంచుకొనే స్థాయికెదిగారు.

‘ఉస్తాద్‌ అల్లారఖా, జాకీర్‌ హుసేన్‌ వంటి వారికి శిష్యురాలినవ్వడం అదృష్టం. కళ పట్ల గౌరవం, క్రమశిక్షణ వారి నుంచే నేర్చుకున్నా. గంటల తరబడి సాధనుండేది. శారీరక సామర్థ్యమూ తప్పనిసరే! ఇది మగవారి కళంటూ చాలామంది నిరుత్సాహ పరిచేవారు. సహనంతో, అంకితభావంతో కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చన్న అమ్మానాన్నల ప్రోత్సాహమే నడిపింది. ప్రపంచంలోనే తొలి మహిళా తబలా మాస్ట్రోగా నిలిపింది’ అనే అనురాధ మ్యూజిక్‌లో ఎంఏ చేశారు. హార్వర్డ్‌, న్యూ ఇంగ్లండ్‌ వంటి ఎన్నో విశ్వవిద్యాలయాల్లో శిక్షణిస్తున్నారు. 30 దేశాల్లో అయిదువేల కచేరీలిచ్చిన ఈమె 40 రకాల వాద్యాలను వాయించగలరు. ‘అనూరాధ పాల్‌ కల్చరల్‌ అకాడమీ’ నిర్వహిస్తూ దేశవిదేశాల్లో శిష్యులను సంపాదించుకున్నారు. రాష్ట్రపతి అవార్డు సహా 108కిపైగా పురస్కారాలను అందుకున్నారు. ఈ క్రమంలో లింగ వివక్ష, అవమానాలు, ఎన్నో ఇబ్బందులూ ఎదుర్కొన్నారు.

‘నా శక్తికి విలువివ్వండి. మహిళనని మెచ్చుకోలులో వాటా ఇవ్వకండి’ అనే ఈమె మహిళా విద్వాంసులతో ‘స్త్రీ శక్తి’ అనే బ్యాండ్‌ను ఏర్పాటు చేసి 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నారు. క్లాసికల్‌కు వెస్ట్రన్‌ జతచేస్తూ ‘రీచార్జ్‌’, సుఫోరే, తబలా సింగ్‌ స్టోరీస్‌ బ్యాండ్‌లనీ ప్రారంభించారు. పలు చలనచిత్రాలు, లఘుచిత్రాలు, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌కు సంగీతాన్ని సమకూర్చారు. ‘15 ఏళ్లప్పుడు గురువు ఉస్తాద్‌ జాకీర్‌ హుసేన్‌తో కలిసి, 16 ఏళ్లకు పండిట్‌ జస్రాజ్‌జీ భజనలు పాడుతుంటే సహవాద్యంగా, ఉస్తాద్‌ సుల్తాన్‌ఖాన్‌తో కలిసి వేదిక పంచుకోవడం, పండిట్‌ రవిశంకర్‌తో జుగల్‌బందీ తీపి జ్ఞాపకాలు’ అంటారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్