అలనాటి వంటలకు లక్షలాది వీక్షణలు

అలనాటి వంటకాలు.. అమ్మ వంటింటి సువాసనలు ఈ తరాలకు పరిచయం చేయాలనుకున్నారామె. చికెన్‌ మామిడికాయ దమ్‌ బిర్యాని, కోడిగుడ్డు నిల్వ పచ్చడి అంటూ కొత్త ప్రయోగాలూ చేశారు.

Updated : 19 Mar 2023 08:32 IST

అలనాటి వంటకాలు.. అమ్మ వంటింటి సువాసనలు ఈ తరాలకు పరిచయం చేయాలనుకున్నారామె. చికెన్‌ మామిడికాయ దమ్‌ బిర్యాని, కోడిగుడ్డు నిల్వ పచ్చడి అంటూ కొత్త ప్రయోగాలూ చేశారు. ‘నా వంట’ నుంచి పక్కకొచ్చి కమ్మనైన రుచి ఎవరు అందించినా పరిచయం చేస్తూ లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు శైలజ ఏచూరి. ఆవిడని వసుంధర పలకరించింది.

జీవితమంటే వడ్డించిన విస్తరికాదు... శ్రమతోనే ఏదైనా సాధ్యం. నా ప్రయాణం కూడా అలాంటిదే. పెద్దమ్మాయి అమెరికాలో, చిన్నమ్మాయి బెంగళూరులో ఉంటారు. ఇంటి రుచులు గుర్తొస్తే ఎలా వండాలంటూ ఫోన్‌ చేసేవారు. నా చేతి వంట మిస్‌ అయినప్పుడల్లా ‘నీ వంటల్ని వీడియోలు తీసి పెట్టొచ్చు కదా. చూసి వండుకుంటాం’ అనేవారు. ఓ పక్క మంచాన పడ్డ అత్తమ్మను చూసుకుంటూ, మా వారు ఏచూరి భాస్కర్‌ నిర్వహించే కేబుల్‌ వ్యవహారాలనూ పట్టించుకోవాలి. దీంతో సమయమే ఉండేది కాదు. అయితే కొవిడ్‌కు ముందు అత్తమ్మ చనిపోయారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌. చాలా సమయం దొరికింది.. ఏదైనా చేద్దామనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లంతా యూట్యూబ్‌ ఛానెల్‌కే ఓటేశారు. మాది నల్గొండ. వంట చేయడమంటే ఇష్టం. రుచిగా వండుతావంటూ బంధువులు, స్నేహితులు ప్రశంసించేవారు. దాంతో అలనాటి వంటకాల్నీ, అమ్మ వంటగది నుంచి వచ్చే సువాసనలతోపాటు ఆధునిక రుచులనూ అందరికీ పరిచయం చేయాలనిపించింది. అలా 2021 మేలో ‘శైలాస్‌ కిచెన్‌’ ప్రారంభించా.


పట్టు తెచ్చుకున్నా..

కష్టపడే తత్వం, ప్రతిదీ తెలుసుకోవాలన్న ఉత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చాయి. ఇంటర్‌లో పెళ్లయినా, ఇంట్లో వాళ్లు ప్రోత్సహించడంతో జర్నలిజంలో పీజీ, ఆ తర్వాత ఎంబీఏ చేశా. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మావారికి వ్యాపార నిర్వహణలో సాయపడేదాన్ని. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేదాన్ని. ఆ గుర్తింపుతో నా ఛానెల్‌కు పబ్లిసిటీ ఉంటుంది, వెయ్యి సబ్‌స్క్రిప్షన్లను సులువుగా చేరుకుంటానని భావించా. లింక్‌ పంపిస్తే చాలు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారన్న నా ఆలోచన ఎంత తప్పో కొద్దిరోజులకే అర్థమైంది. ‘ఫాలోయర్లు, ఆదాయం గురించి ఆలోచించకు, కొత్త పనిని ఆస్వాదించ’మని ఇంట్లోవాళ్లు సలహా ఇచ్చారు. ఎడిటింగ్‌పై పట్టు తెచ్చుకొని వీడియోలు తీసి, అప్‌లోడ్‌ చేసేదాన్ని. ఎంత చెప్పినా సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగడం లేదనే ఆలోచించేదాన్ని.

ఆ వీడియోతో..

రోజూ రెండు గంటల కల్లా వీడియోని అప్‌లోడ్‌ చేయాలని నియమంగా పెట్టుకున్నా. ఒకరోజు సాధ్యపడలేదు. దీంతో స్నేహితురాలింటికి వెళుతూ.. దారిలో చాట్‌ బండి దగ్గర చాట్‌ తయారు చేస్తోంటే వీడియో తీసి అప్‌లోడ్‌ చేశా. అప్పటివరకూ వెయ్యి నుంచి 1200 వరకూ వ్యూస్‌ వచ్చేవి. ఆ వీడియోని తెల్లారేసరికి 12వేల మంది చూశారు. క్రమంగా ఆ సంఖ్య మిలియన్‌కు చేరుకుంది. అంతకు కొద్దిరోజుల ముందే కిచెన్‌ టూర్‌ వీడియోతో మానిటైజేషన్‌ అర్హత సాధించా. రెండేళ్లలోపే 6లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేరుకున్నా. 40 లక్షల వీక్షణలకి చేరుకున్న ఎనిమిది వీడియోలతో పాటు 10 లక్షలు దాటినవి 30కి పైగా ఉన్నాయి.


ఒక్క రోజులో..

ఇల్లు, వ్యాపారం, ఛానెల్‌ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ, ఇష్టంగా చేస్తున్న పని కష్టమనిపించదు. వారంలో ఒకరోజు కనీసం ఐదారు వీడియోలైనా సిద్ధం చేస్తా. ఈ ఛానెల్‌లో నా వంటలే కాదు.. ఎవరెక్కడ ప్రత్యేకంగా చేస్తున్నారన్నా... వారితోనే చేయించి చూపిస్తా. భిన్న సంస్కృతుల వంటకాలను పరిచయం చేస్తూ, ఆ రుచులతో భావోద్వేగాలను గుర్తు చేయాలనేదే నా లక్ష్యం. రైతు కూలీలతో చికెన్‌ కూర, రహదారి పక్కన రాజస్థానీ వాళ్ల రుచులను పరిచయం చేయడం వీటిలో భాగమే! జీవితంలో గొప్ప రోజుంటూ ఉండదు. ప్రతిరోజునీ మనమే గొప్పగా మార్చుకోగలగాలని నమ్ముతా. త్వరలో స్ట్రీట్‌ ఫుడ్‌ వైవిధ్యాన్ని చూపించబోతున్నా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్