ఈ గృహిణి.. ఈ-గేమ్‌లో మేటి!

చిన్న వయసులోనే పెళ్లి.. పెద్ద చదువులూ చదవలేదు. భర్త , కొడుకే లోకంగా బతుకుతున్న ఆమెకు బయటి ప్రపంచమూ పెద్దగా తెలియదు. అయితేనేం విభిన్నమైన వృత్తిని ఎంచుకున్నారు.

Published : 19 Mar 2023 00:11 IST

చిన్న వయసులోనే పెళ్లి.. పెద్ద చదువులూ చదవలేదు. భర్త , కొడుకే లోకంగా బతుకుతున్న ఆమెకు బయటి ప్రపంచమూ పెద్దగా తెలియదు. అయితేనేం విభిన్నమైన వృత్తిని ఎంచుకున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌తో రూ. లక్షలు సంపాదిస్తున్నారు. ప్రొఫెషనల్‌ గేమర్‌గా రాణిస్తూ.. ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా పట్టు సాధించొచ్చు అంటున్న 44ఏళ్ల రీతూ స్లాథియా ప్రయాణమిది..

‘మా రోజుల్లో అమ్మాయిలు పై చదువులు చదవటం అంత తేలిక కాదు. బయటకు పంపడానికీ అమ్మానాన్న భయపడేవారు. దాంతో చదువును ఇంటర్‌తోనే ఆపేయాల్సివచ్చింది. ఇరవై ఏళ్లకే పెళ్లైంది.  భర్త, అత్తింటి వారు బాగా చూసుకుంటారు. మాది జమ్మూ- కశ్మీర్‌. మంచి భార్యగా,  తల్లిగా ఉండటానికే నేను పరిమితమయ్యాను. ఇల్లు, పిల్లలే లోకంగా బతికాను. పెళ్లయి పాతికేళ్లు గడిచిపోయాయి. సొంతంగా డబ్బు సంపాదించి నా కాళ్లమీద నేను నిలబడదామనే ఆలోచన కూడా నాకు ఎప్పుడూ రాలేదు’ అంటారీమె.

కొడుకే గురువు..

‘మా అబ్బాయి రోజూ ఫోన్లో ఆటలు ఆడుతూ ఉండటాన్ని గమనించేదాన్ని. వాడిని చూసి నాకూ ఆడాలనిపించేది.  కాకపోతే అడగటానికి బిడియపడేదాన్ని.  మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం. చివరికి నేనూ ఆడతానని అడిగాను. వెంటనే వాడు ‘తప్పకుండా నేర్పిస్తానమ్మా’ అన్నాడు. అలా 2019లో గేమింగ్‌ నేర్చుకోవటం మొదలు పెట్టా. మొదట్లో బీజీఎమ్‌ఐ (బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా) ఆడేదాన్ని. ప్రారంభంలో ఆటను అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. కానీ నేను ఏదైనా ఇట్టే నేర్చేసుకుంటా. అలా ఆటపై నాకున్న ఉత్సుకతే మరిన్ని ఆటలు నేర్చుకునేలా చేసింది. ఆడుతున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించేది. అప్పటి వరకూ ఉదయాన్నే వంట చేసుకోవటం, పూజ, ఇంటిపని ఇవే నా లోకం. ఇప్పుడు ఉదయం 8 గంటలకే ఇంటిపని ముగించుకుని కంప్యూటర్‌ ముందు కూర్చుంటున్నా. ఏడాది కిందట లైవ్‌ స్ట్రీమింగ్‌, గేమ్‌ప్లే స్ట్రీమింగ్‌ల గురించి తెలుసుకున్నాను. నా కొడుకు వయసు వాళ్లు, అంతకంటే చిన్న వాళ్లతో పోటీపడుతోంటే నాకు గేమింగ్‌పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు వాళ్లంతా గేమ్‌లో నన్ను ఫాలో అవుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఇంటికే పరిమితమైన నాకు ఇదంతా మంచి అనుభవం. మన చుట్టూ ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసుకున్నాను. మొదట్లో స్నేహితులకు చెప్పినప్పుడు నవ్వుకున్నారు. తర్వాత దీని ద్వారా ఆదాయం పొందుతున్నానని తెలిసి మెచ్చుకున్నారు. వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇప్పుడు వాళ్లు కూడా గేమింగ్‌ నేర్చుకుంటున్నారు’ అని సంబరపడతారు.


వాళ్లు ఊరుకోరు..

నా కొడుకు, భర్త ఇంటిపనుల్లో సాయం చేస్తారు. ఎవరైనా నిరుత్సాహపరిచినా, వాళ్లు నాకు అండగా నిలబడతారు. నేను నా కొడుకుని అడగటానికి మొహమాట పడితే నేను ఈ రోజు ఇక్కడ ఉండే దాన్ని కాదు. ఆర్థికస్వేచ్ఛ సాధించి ఉండేదాన్ని కాదు. ఇదే విషయం చాలా మంది మహిళలకు చెప్తుంటాను. అయితే వాళ్లలో ఎంతమంది ధైర్యంగా ముందడుగు వేస్తారన్నది ప్రశ్నార్థకమే. నా ఫాలోయర్లంతా నన్ను ‘మమ్మా బ్లాక్‌బర్డ్‌’ అని పిలుస్తారు. ఈ పేరుతో రూటర్‌ అనే గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో 3.5 లక్షలకు పైగా నాకు ఫాలోయర్లు ఉన్నారు. ఏడాదికి రూ. 1.2 లక్షల ఆదాయం పొందుతున్నా. ఇది తక్కువే కావొచ్చు కానీ నాలో చాలా ఆత్మస్థైర్యాన్ని నింపింది. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో స్ట్రీమింగ్‌లో మాట్లాడటం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆడవాళ్లకు ఎన్నో అవరోధాలు. చదువు లేనివాళ్లకైతే ఇంకా కష్టతరమౌతుంది. ప్రొఫెషనల్‌ గేమింగ్‌తో ఆడవాళ్లు ఇల్లు చూసుకుంటూనే ఆదాయమూ పొందవచ్చు. ప్రతి గృహిణీ దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవచ్చని చెప్పగలను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్