నా కోసం నేను జీవించాలని...

పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలామె. యోగా, సైక్లింగ్‌, పర్వతారోహణ, మారథాన్‌.. వంటివన్నీ అభిరుచులు. అలాగని తన జీవితం పూలబాట అనుకుంటే పొరపాటే. భర్తను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరాడపిల్లలను పెంచాల్సిన బాధ్యత ఆమెపై పడింది.

Published : 26 Mar 2023 00:25 IST

పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలామె. యోగా, సైక్లింగ్‌, పర్వతారోహణ, మారథాన్‌.. వంటివన్నీ అభిరుచులు. అలాగని తన జీవితం పూలబాట అనుకుంటే పొరపాటే. భర్తను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరాడపిల్లలను పెంచాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఆ పరిస్థితులన్నింటినీ ధైర్యంగా దాటింది. యాభైల్లోనూ సాహసాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న నీరూ సైనీ కథనమిది.

నౌకాదళ విభాగంలో పనిచేసే వ్యక్తితో 20 ఏళ్ల వయసులోనే నీరూ వివాహమైంది. భర్త ఉద్యోగరీత్యా ప్రపంచదేశాలన్నీ  తిరిగారీమె. ఇద్దరాడపిల్లలు.. జీవితం సంతోషంగా సాగుతున్నప్పుడు అనుకోని కష్టమెదురైందామెకు. భర్తకు క్యాన్సర్‌ సోకి రెండేళ్లలో చనిపోయారు. ఒక్కసారే జీవితమంతా ఆగిపోయినట్లైందంటారీమె. ‘గృహిణిగా ఇంటిని చక్కపెట్టే నా చేతిలో 10, 4 ఏళ్ల ఇద్దరాడపిల్లలున్నారు. మొదట్లో ఆర్థికంగా ఇబ్బందిలేని కుటుంబమే. క్యాన్సర్‌ చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టాం. అయినా ఆయన దక్కలేదు. పొదుపు చేసినదంతా అయిపోయి, ఆర్థిక ఇబ్బందులు మిగిలాయి. ఏం చేయాలో తోచలేదు. పిల్లలిద్దరినీ బాగా చదివిస్తానని మావారికి మాటిచ్చా. ఆర్థికంగా నిలబడటానికి ట్యూషన్లు  చెప్పడం ప్రారంభించా. అయినా రోజు గడవడం కష్టంగా ఉండేది. ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా చేరా. మా పిల్లలతోపాటు నేనూ తిరిగి చదవడం మొదలుపెట్టా. ఉదయం 3 గంటలకు నిద్రలేస్తే తిరిగి పక్క మీదకి చేరడానికి రాత్రి 10 అయ్యేది. బీఈడీ రాసి పాసయ్యా. శిక్షణ తర్వాత చండీగఢ్‌లోని ఓ ప్రభుత్వపాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా చేరా. అలా 15 ఏళ్లు గడిచిపోయాయి. పిల్లలిద్దరూ బాగా చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు’ అని వివరిస్తారు నీరూ.


తెలుసుకోవాలి

47 ఏళ్ల వయసులో నీరూను ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది. తీవ్ర కుంగుబాటుకు గురయ్యారీమె. ‘బరువు తగ్గిపోతుంటే ఏదైనా చేయాలనుకున్నా. పిల్లలిద్దరూ కెరియర్‌లో స్థిరపడ్డారు. మావారికిచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఇలా దొరికిన ఖాళీ సమయాన్ని నా కోసం వినియోగించుకోవాలనుకున్నా. యోగా ప్రారంభించా. సాహసక్రీడలు.. క్లిఫ్‌ జంపింగ్‌, స్కూబా డైవింగ్‌, స్కైడైవింగ్‌, పర్వతారోహణ నేర్చుకొన్నా. బైక్‌ రైడింగ్‌ మొదలుపెట్టా. గతేడాది రెండు సార్లు సోలో బైక్‌ రైడ్‌కెళ్లా. పర్వతారోహణ చేస్తూ బృందాలకు నేతృత్వం వహిస్తుంటా. ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగిస్తా. యోగా నేర్పుతా. ప్రతి మహిళ జీవితంలో తన కోసం తాను జీవించడమెలాగో తెలుసుకోవాలి. అనుకున్నవి సాధించి సంతోషాన్ని పొందాలి’ అంటారు నీరూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్