అమ్మకిచ్చిన మాట కోసం..!
‘అందరూ డాక్టర్లే అయితే.. మరి క్యాన్సర్‌లాంటి వ్యాధులకు మందులెవరు తయారుచేస్తారు? నువ్వే ఆ పని చేయాలి’ అని ప్రోత్సహించిన అమ్మ అదే క్యాన్సర్ బారినపడి మరణించారు. అమ్మకిచ్చిన మాటకోసం ఫార్మసీ రంగంలో తనదైన ముద్ర వేసుకుని విదేశాలకు మందులు ఎగుమతి చేస్తున్నారు 46 ఏళ్ల పిట్టా సంధ్య.
‘అందరూ డాక్టర్లే అయితే.. మరి క్యాన్సర్‌లాంటి వ్యాధులకు మందులెవరు తయారుచేస్తారు? నువ్వే ఆ పని చేయాలి’ అని ప్రోత్సహించిన అమ్మ అదే క్యాన్సర్ బారినపడి మరణించారు. అమ్మకిచ్చిన మాటకోసం ఫార్మసీ రంగంలో తనదైన ముద్ర వేసుకుని విదేశాలకు మందులు ఎగుమతి చేస్తున్నారు 46 ఏళ్ల పిట్టా సంధ్య...
క్యాన్సర్ మందుల తయారీనా? ముందు నువ్వు అనారోగ్యం పాలవ్వకుండా చూస్కో? ఇలాంటి హెచ్చరికలు చాలానే విన్నా. అయినా ధైర్యంగా ఆ రంగాన్నే ఎంచుకున్నానంటే కారణం అమ్మ. డాక్టరవ్వాలన్నది నా కల. మాది సిద్దిపేట. నాన్న సత్యనారాయణ కాలేజీ లెక్చరర్. అమ్మ విజయలక్ష్మి గృహిణి. చెల్లి, తమ్ముడున్నారు. ఎంసెట్ రాస్తే.. ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. దాంతో హైదరాబాద్‌లో బీఫార్మసీ, ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఫార్మసీ చేశా. బేగంపేటలోని నెట్కో పరిశోధనాకేంద్రంలో ఏడాది, అహ్మదాబాద్‌లోని టొరెంట్ రిసెర్చ్ సెంటర్‌లో రెండేళ్లు చేశా. డ్రగ్, క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉత్పత్తులపై పరిశోధన చేసేదాన్ని. ఆ సమయంలో చాలామంది ఇది జీవితానికే ముప్పు అని భయపెట్టారు. క్యాన్సర్ వస్తుందన్నారు. అమ్మ మాత్రం అందరూ అలా అనుకుంటే మందులెవరు తయారుచేస్తారంది. అహ్మదాబాద్‌లో జలుబు, దగ్గు, యాంటీ క్యాన్సర్ ఉత్పత్తులపై పరిశోధనలు మొదలుపెట్టా. అప్పట్లో ల్యాబ్‌లో నేనొక్కదాన్నే అమ్మాయిని. ఉదయం గం.6లకు వెళితే ఇంటికి చేరుకొనేసరికి తెల్లారిపోయేది. రోజంతా నిలబడే పనిచేయాలి. అరబిందో ఫార్మాలో అయిదేళ్లు ఇంజెక్టబుల్ ఉత్పత్తులపై పనిచేశా. ఆ తర్వాత గ్లాండ్, కాప్లిన్ పాయింట్ ల్యాబుల్లో పనిచేసి.. ఐసీయూలో వినియోగించే ప్రాణావసర మందులపై పరిశోధన చేసి వాటిని అమెరికా, లండన్‌కు అందించేవాళ్లం. ఆ కమంలోనే స్విట్జర్లాండ్, అమెరికాసహా యూరప్‌దేశాలకు వెళ్లా. అలా అక్కడి మార్కెట్‌పై అవగాహన వచ్చింది. దాంతో సొంతంగా ఔషధాల తయారీ మొదలుపెట్టాలనిపించింది. 2017లో పొదుపు చేసిన సొమ్ము రూ.3కోట్లతో హైదరాబాద్‌లోని బాలానగర్‌లో, ఇద్దరు సైంటిస్టులతో క్రెంజా ఫార్మాస్యుటికల్స్ ప్రారంభించా.
పెట్టుబడుల అండతో...
మొదట్లో పరిశోధనలు మాత్రమే కాదు.. ల్యాబ్ శుభ్రం చేసేదాన్ని కూడా. రిసెర్చ్ టెస్టింగ్‌కు సంబంధించి చిన్నచిన్న కాంట్రాక్ట్‌లు తీసుకొన్నా. పెద్ద సంస్థలతో కలిసి పనిచేయడానికి ప్రయత్నాలు జరుపుతుండగా నా కెరియర్‌లో ఊహించని మలుపు ఎదురైంది. అమెరికా, లండన్‌కు చెందిన కొన్ని సంస్థలు నా పరిశోధన అనుభవాన్ని తెలుసుకొని వచ్చాయి. యాంటీ క్యాన్సర్ ఇంజెక్షన్ల కోసం ఒక్కోసంస్థ రూ.2.5 కోట్లు వరకూ నిధులందించాయి. వాళ్ల నమ్మకాన్నివమ్ము చేయకుండా చెప్పిన సమయానికి ఆర్డరు అందించా. పరిశోధనలో నా పారదర్శకత చూసి క్రమంగా క్లైంట్లు పెరిగారు. రెండుమూడు ఉత్పత్తుల నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం 15రకాలకు పైగా క్యాన్సర్ సంబంధిత ఉత్పత్తులు తయారుచేస్తున్నాం. మా సంస్థలో 50మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలోనూ పోటీ ఎక్కువే. సిబ్బందితో సమస్యలు ఉంటాయి. మధ్యలో కొన్ని సంస్థలు ఆర్డర్లు విరమించుకుంటాయి. ఇలాంటి సవాళ్లన్నీ ఓపిగ్గా పరిష్కరించుకోవాలి. నాణ్యత, వేగం.. అందుబాటు ధరలు వంటి సూత్రాలు పాటిస్తూ ముందుకెళ్తున్నా. ప్రస్తుతం సంస్థ వార్షికాదాయం రూ.25 కోట్లు.
పోగొట్టుకొన్నా..
అమ్మకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందని తెలిసేసరికే అది ముదిరిపోయింది. బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. నెలలోపే చనిపోయింది. క్యాన్సర్ ఔషధాలపై పరిశోధన చేసే నేను అమ్మను కాపాడుకోలేకపోవడం దురదృష్టమే. ఈ రంగాన్నెంచుకున్నప్పుడు అందరూ భయపెడితే తనే ధైర్యం చెప్పింది. సొంతంగా సంస్థ ప్రారంభించినప్పుడు గర్వపడింది. తనలాంటి మరెందరినో బాధిస్తున్న క్యాన్సర్‌ను నిరోధించడానికి కృషి చేయమని చెప్పిన అమ్మ మాట నిలబెట్టాలనే పట్టుదలతో పనిచేస్తున్నా. సింగిల్ మదర్‌గా ఇద్దరు మగపిల్లల సంరక్షణా తీసుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.