అమ్మ ప్రేమ.. వ్యాపారవేత్తని చేసింది!
ఆమె సాధారణ విద్యార్థి. కష్టపడి ఉద్యోగం సాధించినా.. బాబు పుట్టాక దాన్నీ మానేశారు. గృహిణిగా ఏడేళ్లు కొనసాగాక ఆవిడ మనసు వ్యాపారం వైపు మళ్లింది. ఇంట్లో మామూలుగా మొదలై అదిప్పుడు దాదాపు రూ.200 కోట్ల వ్యాపారమైంది.
ఆమె సాధారణ విద్యార్థి. కష్టపడి ఉద్యోగం సాధించినా.. బాబు పుట్టాక దాన్నీ మానేశారు. గృహిణిగా ఏడేళ్లు కొనసాగాక ఆవిడ మనసు వ్యాపారం వైపు మళ్లింది. ఇంట్లో మామూలుగా మొదలై అదిప్పుడు దాదాపు రూ.200 కోట్ల వ్యాపారమైంది. అంతేనా స్టార్టప్‌లకు వ్యాపార పాఠాలూ చెబుతున్నారామె. ఇదంతా ఎలా సాధ్యమైందంటే హరిణి ప్రయాణాన్ని తెలుసుకోవాల్సిందే!
ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం. మంచి స్థాయికీ ఎదిగారు హరిణి శివకుమార్. కానీ తన కలల పంట అయిన బాబుకి డౌన్‌సిండ్రోమ్ అని తెలిశాక కెరియర్ లక్ష్యాల్ని పక్కన పెట్టేశారు. కామర్స్‌లో డిగ్రీ చేసిన ఆమె పిల్లాడి కోసం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పీజీ చేశారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్.. వంటి నగరాలెన్నో బాబు చికిత్సకోసం తిరిగారు. వాడికి అయిదేళ్లు వచ్చాయి. నోరు తెరిచి చెప్పలేక పోయినా.. అమ్మ కదా! బాబుకి ఏదో సమస్యని అర్థమైంది. వైద్యుల దగ్గరికి తీసుకెళితే సబ్బులు, షాంపూల్లోని రసాయనాలు, కృత్రిమ సువాసనలు అలర్జీలే కాదు.. మానసికంగా ఉద్రేక పరుస్తున్నాయన్నారు. దీంతో సహజ ప్రత్యామ్నాయాల కోసం వెదికారామె. అవేమీ సంతృప్తినివ్వలేదు. విదేశాల నుంచి తెప్పించుకోవడం కష్టమైంది. లాభం లేదనుకొని పరిశోధనలు చేసి, సొంత తయారీ ప్రారంభించారు. వాటిని స్నేహితులు, బంధువులకీ బహుమతిగా ఇస్తే.. వాళ్లకీ నచ్చి చేసివ్వమనేవారు.
నాన్న మనసు కదిలి..
ఈమెది చెన్నై. అప్పటిదాకా ఏదో వ్యాపకంగా హరిణి ఇలా చేస్తోంది అనుకున్నారు ఆమె నాన్న. కానీ స్కిన్‌కేర్ ఫార్ములేషన్, కాస్మెటిక్ సైన్స్ కోర్సులు చదివి, 2017లో ‘సోప్‌వర్క్స్ ఇండియా’ పేరుతో కంపెనీ నమోదు కూడా చేయించేసరికి సీరియస్‌గానే ప్రయత్నిస్తోందని అర్థమైంది ఆయనకు. దీంతో ఆయనా ఆమెతో చేతులు కలిపారు. 2019లో సంస్థ పేరునీ ‘ఎర్త్ రిథమ్’గా మార్చారు. ‘నిజానికి నా నిర్ణయం అంత తేలికేమీ కాదు. బాబు కోసమే ఉద్యోగాన్ని వదిలేశా. వాడి సంరక్షణ కోసం పడిన తాపత్రయమే సంస్థగా మారింది. అందరికీ సహజ ఉత్పత్తులు అందించాలనుకున్నా. మరి వ్యాపారమన్నాక కాలు బయటపెట్టాలిగా. వాడు నాతో తప్ప ఎవరితోనూ మాట కూడా కలిపేవాడు కాదు. వాడికి అన్యాయం చేస్తున్నానా అన్న ఆలోచనా వచ్చింది. వాడికి ఇబ్బంది అయితే ప్రత్యామ్నాయాలు వెదుకుదామనుకుంటూనే కొనసాగా. ఆశ్చర్యంగా వాడిలో చాలా మార్పు వచ్చింది. ఇతరులతో మాట్లాడటం, కలిసి పోవడం మొదలుపెట్టాడు. నా ఆలోచనలో మంచి ఉంది కాబట్టే, నాకిలా మేలు జరిగింది అనిపించింది’ అని గుర్తు చేసుకుంటారు హరిణి.
పెట్టుబడులొచ్చాయి..
మొదట సబ్బులే.. తర్వాత క్రీములు, షాంపూ.. రకరకాలు తీసుకొచ్చారు. అమెజాన్, నైకా వంటి వెబ్‌సైట్లలో అమ్మకం మొదలుపెట్టి, సొంత వెబ్‌సైట్‌నీ రూపొందించుకున్నారు. ‘కొవిడ్‌లో ఆరోగ్య స్పృహ, సహజ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ మాకు కలిసొచ్చింది. వ్యాపారం పెరుగుతోంది పెట్టుబడి ఎలా అనుకున్నప్పుడు ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. నా ఒక్కదానితో మొదలైన సంస్థలో ఇప్పుడు వందలమంది పనిచేస్తున్నారు. అభివృద్ధి వేగంగానే జరిగింది. అంతమాత్రాన నా ప్రయాణం సులువేమీ కాదు. మంచి విద్యార్థిని కాదు. ఉద్యోగం మాని సబ్బులు తయారు చేస్తున్నప్పుడు ‘ఇంతా చేసి సబ్బులమ్ముకుంటావా’ అన్న ప్రశ్నలెన్నో. నేనవేమీ పట్టించుకోలేదు. బాబు కోసం సబ్బుల తయారీ, మార్కెటింగ్ గురించి రిటైలింగ్ కోర్సు.. ఇలా ఒక్కోటీ నేర్చుకుంటూ వచ్చా. ఇంటి వద్ద, ఎగ్జిబిషన్లలో నా ఉత్పత్తులను పరిచయం చేశా. ఇవాళ దాదాపు రూ.200 కోట్ల సంస్థగా ఎదగడం ఆనందంగా ఉంది’ అనే హరిణి.. పర్యావరణంపై ప్రేమతో జీరో ప్లాస్టిక్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితాలోనూ స్థానం సంపాదించిన ఈమె.. స్టార్టప్ సమ్మిట్‌లలో, వ్యాపార కళాశాలల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ‘పెద్ద చదువులు, వనరులు లేవని వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసం, సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు.. కలల సాధన సాధ్యమే! అందుకు నేనే ఉదాహరణంటూ యువతలో ఉత్సాహాన్నీ నింపుతున్న హరిణి టెడెక్స్ స్పీకర్ కూడా!
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.