రైతన్నలతో పరిశ్రమలు పెట్టించాలని...

‘కోటి విద్యలూ కూటి కోసమే’ కదా! అయినా ఏసీ గదుల్లో కూర్చుని ఉద్యోగాలెన్ని చేసినా... గుప్పెడు మెతుకుల్ని మాత్రం పుట్టించలేం. కోట్లాది మంది కడుపులు నిండాలంటే... అన్నదాత ఆరుగాలం శ్రమించాల్సిందే.

Updated : 12 Jun 2023 04:15 IST

‘కోటి విద్యలూ కూటి కోసమే’ కదా! అయినా ఏసీ గదుల్లో కూర్చుని ఉద్యోగాలెన్ని చేసినా... గుప్పెడు మెతుకుల్ని మాత్రం పుట్టించలేం. కోట్లాది మంది కడుపులు నిండాలంటే... అన్నదాత ఆరుగాలం శ్రమించాల్సిందే. కానీ, అదెప్పుడూ రైతుకి లాభసాటి కావడం లేదని ఆవేదన చెందిన ఆమె... సాగు ఉత్పత్తులను వ్యాపారంగా ఎలా మార్చుకోవచ్చో రైతన్నలకు నేర్పించాలనుకున్నారు. ఇందుకోసమే...  ‘అగ్రిఘర్‌’ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశారు హైదరాబాద్‌కి చెందిన డా.సౌమిని సుంకర. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే...

రైతులంతా బతుకుదెరువు కోసం పట్టణాలకు, ఉద్యోగాల కోసం యువత నగరాల బాట పడితే, దేశానికి తిండి పెట్టేదెవరు?...ఈ ఆలోచనే కాస్త భయం పుట్టించింది. నిజానికి గ్రామాల్లో వ్యవసాయ రంగంతో ముడిపడ్డ ఉపాధి అవకాశాలెన్నో ఉన్నాయి. వాటిపై అవగాహన వస్తే... ప్రతి కర్షకుడూ సాగుని లాభసాటిగా మలచుకోగలడన్న నమ్మకమే నన్ను అగ్రిఘర్‌ ఏర్పాటు దిశగా నడిపించింది. వరంగల్‌లో పుట్టి పెరిగా. డిగ్రీలో కాకతీయ విశ్వవిద్యాలయం బంగారు పతక విజేతను. హైదరాబాద్‌ కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో బయో కెమిస్ట్రీలో పీజీ చేశా. 2003లో కనపర్తి కల్యాణ్‌తో పెళ్లయ్యింది. ఆయనకు సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉంది. అత్తింటి వారు ప్రోత్సహించడంతో జేఎన్‌టీయూలో బయోటెక్నాలజీలో ఎంటెక్‌ చదివా. ఇక్రిశాట్‌లో టిష్యూకల్చర్‌పై పీహెచ్‌డీ చేశా. వేరుశెనగకు బూజు పట్టినప్పుడు టాక్సిన్స్‌ విడుదల అవుతాయి. వాటిని నిలువరించడం మీద నా పరిశోధన సాగింది.

ధైర్యం చేయకపోవడంతో...

ల్యాబ్‌లో పరిశోధనల కంటే, క్షేత్ర స్థాయిలో ప్రయోగాల ద్వారానే ఫలితాలు త్వరగా లబ్ధిదారులకు చేరతాయనిపించింది. ఆ సమయంలోనే తెలంగాణ ‘సెర్ప్‌’లో వరల్డ్‌ బ్యాంకు ప్రాజెక్టు కన్సల్టెంట్‌గా చేరాను. 14 మండలాల్లో నిర్వహించిన ఈ పైలట్‌ ప్రాజెక్టు ద్వారా 18 నెలల్లో వేల మందికి సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలు వంటి ఎన్నో విషయాలపై అవగాహన కల్పించా. ఈ క్రమంలోనే రైతుల బాధలు, మహిళల స్థితిగతులు అర్థం చేసుకున్నా. రైతులూ, మహిళలూ, యువతనీ ఆహారరంగ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోమని ఎంత ప్రోత్సహించినా ధైర్యం చేసే వారు కాదు. దాంతో అందరికీ ఆదర్శంగా నిలబడాలని నేనే ఆ పని చేయాలనుకున్నా. ఈలోగా సీడ్‌ సెక్టార్‌లో ఇండో-జర్మన్‌ ప్రాజెక్టుకి తెలంగాణలో ‘నేషనల్‌ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌’గా అవకాశం వచ్చింది. ఆ విధులు నిర్వర్తిస్తూనే, మరో పక్క పరిశ్రమకు పునాదులు వేసుకున్నా. ఎన్నో బ్యాంకులకు తిరిగా. చివరికి నా ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకుని... పూచీకత్తు లేకుండానే ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ రూ.1.95 కోట్లు రుణంగా ఇచ్చింది. నా సొంత సొమ్ము 35 లక్షలు జోడించి చౌటుప్పల్‌లోని మల్కాపురం హరిత పారిశ్రామిక పార్కులో అగ్రిఘర్‌ని ఏర్పాటు చేశా.

విలువ పెంచుతాం...

పంటలకు విలువ పెరగాలంటే వాటిని వివిధ రూపాల్లోకి మార్చి అమ్ముకోవాలి. మా దగ్గరికొస్తే ధాన్యం, పప్పులు, గింజలు, పండ్లు, కాయలు... వంటి వాటిని ఎన్నిరకాలుగా మార్చొచ్చో చూపిస్తాం. వారే సొంతంగా ఎలా చేసుకోవచ్చో నేర్పిస్తాం. వాళ్ల ఊళ్లోనే సొంతంగా చేసుకోవడాన్నీ, మధ్యవర్తులు లేకుండా అమ్ముకునే విధానాల్నీ చెబుతాం. పండ్లు, కూరగాయలు నిల్వ ఉంటే కుళ్లిపోతాయని రైతులు తక్కువ రేటుకే అమ్ముతుంటారు. ఆ భయం లేకుండా ఎండబెట్టి నిల్వ చేసే పద్ధతులను నేర్పిస్తాం. ఆసక్తి ఉన్న వారికి సొంత యూనిట్‌ ఏర్పాటుకు బ్యాంకు రుణం ఎలా పొందాలీ, వ్యాపార ప్రణాళిక వంటివీ సూచిస్తాం. ఉచితంగా వ్యాపార మెలకువలు నేర్పిస్తే విలువుండదని, నామమాత్రపు రుసుము వసూలు చేయాలని నిర్ణయించుకున్నా. మా పరిశ్రమను మోడల్‌ యూనిట్‌గా మార్చి... దీని ద్వారా రైతుల ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి నా సొంతంగా ‘నెయిశా’ బ్రాండ్‌ని తీసుకొచ్చా. ఈ పేరుతో సోలార్‌తో డ్రై, రెడీ టు ఈట్‌, రెడీ టు కుక్‌ ఉత్పత్తులెన్నో చేస్తున్నాం. మా పరిశ్రమ ద్వారా 30 మందికి ఉపాధి కల్పించడం సంతోషాన్నిస్తుంటుంది. ఇప్పటికే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు శిక్షణ ఇచ్చా. రైతులు లాభాల బాట పట్టాలి, యువతకు ఊళ్లే ఉపాధినివ్వాలన్న లక్ష్యంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నా.

-  సూరపల్లి రఘుపతి, యాదాద్రి భువనగిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్