తానే బంధువై.. సగౌరవంగా సాగనంపుతుంది!

‘చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌..’ అని పాడుకున్నంత ఈజీకాదు జీవితపు అంతిమఘట్టం. ఈ భూమ్మీద నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించాలనే ఉంటుంది ఎవరికైనా.

Updated : 14 Jun 2023 05:02 IST

‘చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌..’ అని పాడుకున్నంత ఈజీకాదు జీవితపు అంతిమఘట్టం. ఈ భూమ్మీద నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించాలనే ఉంటుంది ఎవరికైనా. కానీ అనాథల మాటేంటి? అయినవాళ్ల ఆదరణలేని అభాగ్యుల సంగతేంటి? అలంటి వేల మందికి అంతిమ సంస్కారాలు చేసి సగౌరవంగా సాగనంపుతున్నారు వర్షవర్మ... మానవతకు నిలువెత్తు రూపం లాంటి ఓ సేవామూర్తి స్ఫూర్తి గాథ ఇదీ...

‘కొవిడ్‌ రెండో దశ. నా ప్రాణస్నేహితురాలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందై ఆసుపత్రిలో చనిపోయింది. ఇంటికి తీసుకెళదామంటే సాయంత్రం వరకు అంబులెన్స్‌ దొరకలేదు. కొందరు భయపడితే.. ఇంకొందరు చాలా పెద్దమొత్తంలో డబ్బులు అడిగారు. చివరకు 4కి.మీ. దూరంలోని ఇంటికి తీసుకెళ్లడానికి రూ.25 వేలు ఇవ్వాల్సొచ్చింది. మేమంటే ఎలాగోలా చెల్లించాం. ఆసుపత్రి ఖర్చుతో చితికిపోయిన వారికిది అదనపు భారమేగా అనిపించింది. ఇలాంటి వాళ్లకి సాయపడాలని అద్దెకు వాహనాన్ని తీసుకొని అంబులెన్స్‌, శవాలు తీసుకెళ్లే వాహనాలు ఏర్పాటు చేశా’ అంటారు 44 ఏళ్ల వర్ష. ఈవిడది లఖ్‌నవూ. చావు భయంతో సొంతవాళ్ల దేహాలను ఆసుపత్రుల్లో, రోడ్ల పక్కన వదిలేస్తున్న సంఘటనలు చూశాక వాళ్ల దహన కార్యక్రమాలూ ఆవిడే చూసుకోవడం మొదలుపెట్టారు. ‘తొలి దహన కార్యక్రమం తర్వాత కొద్దిరోజులు అన్నం సహించలేదు. నిద్ర కరవైంది. నిజానికి డాక్టర్‌ అవ్వాలనుకున్న నేను.. ఓ యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్యక్తిని చూసి ఆలోచన మానుకున్నా. ఆ ట్రామా నుంచి బయటపడటానికి కొన్నినెలలు పట్టింది. నన్ను అమ్మానాన్న ఆటలవైపు మళ్లించడానికీ అదే కారణ’మనే వర్ష జూడోలో జాతీయస్థాయి క్రీడాకారిణి, రచయిత్రి.

ఆమె బాధ చూసి..

నిజానికి ఆమె సేవా ప్రయాణం చిన్నప్పట్నుంచే ప్రారంభమైంది. అమ్మానాన్నల్ని చూసి 16వ ఏట నుంచే మతిస్థిమితం లేనివారు, ఇల్లులేని వృద్ధులను ఆదరించి ఆశ్రమాల్లో చేర్చడం, ఆహారం, వైద్యసాయం అందివ్వడం చేసేవారు. 2015లో ‘ఏక్‌ కోషిష్‌ ఐసే భీ’ సేవాసంస్థని ప్రారంభించినామె.. కొవిడ్‌ నుంచి అంతిమ సంస్కార కార్యక్రమాల్నీ దానిలో చేర్చారు. ‘లఖ్‌నవూ మెడికల్‌ హబ్‌. ఎక్కడెక్కడ్నుంచో చికిత్సకు వస్తుంటారు. నయమయ్యాక అంబులెన్స్‌ అవసరమైనా, చనిపోయాక శరీరాన్ని తీసుకోవాలన్నా పేదవాళ్లకి తలకు మించిన భారం. అనాథలు, వైద్యపరీక్షల కోసం శరీరాలు ఇచ్చినవాళ్లు.. ఎవరికైనా సరే అంతిమ యాత్ర గౌరవంగా జరగాలి. దాదాపు 5వేల అంత్యక్రియలు చేశా. వారివారి మతాలు కనుక్కొని మరీ నిర్వహిస్తా’ననే ఆవిడ చదువుకు దూరమైన పేదపిల్లలను స్కూలు బాట పట్టిస్తున్నారు. ‘కొవిడ్‌ సమయంలో తండ్రికి అంత్యక్రియలు చేస్తూ రోదిస్తున్న అమ్మాయిని ఊరడిస్తోంటే.. ‘నిన్న తమ్ముడు, ఈరోజు నాన్న.. ఇప్పుడే అన్నయ్యా చనిపోయాడన్న వార్తొచ్చింది. అమ్మెలాగుందో తెలియదు. ఒంటరిగా మిగిలా’నని వెక్కివెక్కి ఏడ్చింది. కొవిడ్‌ తర్వాత అలాంటి ఎందరినో చూశాక ఒంటరైన పిల్లలకు ఆదరువు చూపించడం, చదువు చెప్పించడం ప్రారంభించా’నంటారు. తన సేవలకు ఎన్నో పురస్కారాలందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.

డబ్బే కానక్కర్లేదు

‘మొదట్లో నా సొంతడబ్బులే. తర్వాత సోషల్‌ మీడియా సాయం తీసుకునేదాన్ని. డబ్బు రూపేణానే కాదు.. మాట, వస్తు ఇలా తోచిన రూపంలో సాయపడమనేదాన్ని. ఇతర ఎన్‌జీఓలు, ప్రభుత్వంతోనూ కలిసి నడుస్తున్నా’ననే వర్ష కౌన్సెలింగ్‌, గృహహింస, డ్రగ్‌ అడిక్షన్‌ వంటి ఎన్నో అంశాల్లో తోడ్పడుతున్నారు. ‘మావారు ఇంజినీర్‌. కొవిడ్‌ సమయంలో నాకేమైనా అవుతుందేమోనని భయపడ్డారు. సాయానికి రమ్మన్నా ‘నువ్వు కావాలంటే చావు.. మాకు చావాలని లేద’నేవారు. అప్పుడు కాస్త బాధపడేదాన్ని. కానీ మాఅమ్మాయి మాత్రం నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంది. ఆమాట, నా నుంచి సాయం పొందిన నిస్సహాయుల కళ్లల్లో కనిపించే ఆనందమే నాకు బలాన్నిస్తుంటాయి. వాటిముందు ఏదైనా చిన్నదే’నంటారు వర్ష. ఉత్తర్‌ప్రదేశ్‌కే పరిమితమైన సేవల్ని దేశవ్యాప్తం చేయడం ఆమె కలట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్