ఒక్కరూ థ్యాంక్స్‌ చెప్పలేదు!

తన కలని నిజం చేసుకోవడానికి ఓపిగ్గా 15 ఏళ్లు ఎదురుచూసింది.. అంతవరకూ వైఫల్యాలనే ముద్దాడింది. సవాళ్లనీ, సాహసాలనే జీవితం అనుకుంది.. తాజాగా దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఉత్తమనటి’ అవార్డుని అందుకున్న సుమాదేవిఫెయిల్యూర్‌ కథ ఇది.

Updated : 03 Jul 2023 02:53 IST

తన కలని నిజం చేసుకోవడానికి ఓపిగ్గా 15 ఏళ్లు ఎదురుచూసింది.. అంతవరకూ వైఫల్యాలనే ముద్దాడింది. సవాళ్లనీ, సాహసాలనే జీవితం అనుకుంది.. తాజాగా దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఉత్తమనటి’ అవార్డుని అందుకున్న సుమాదేవి ఫెయిల్యూర్‌ కథ ఇది. ఎంతోమంది అగ్రతారలకు డూప్‌గా పనిచేసిన ఓ అమ్మాయి ‘ఉత్తమ కథానాయిక’ ఎలా అయ్యిందో
తెలుసుకోవాలని ఉందా...

వెండితెరపై వెలిగిపోవాలన్నది నా కల. నాకంటే ఎక్కువగా మా అమ్మకి నన్ను కథానాయికగా చూడాలని ఉండేది. మాది కేరళలోని త్రిశూర్‌. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. దానికోసమే కలరియపట్టు నేర్చుకున్నా. నటించాలని ఉన్నా, అవకాశం ఇమ్మని ఎవరిని అడగాలో తెలియలేదు. సినిమాల్లో స్టంట్లు చేసే శశి మాస్టర్‌ మా బంధువులే. ఆయన్ని అడిగితే సెట్స్‌కు తీసుకెళ్లి తెలిసిన వారిని పరిచయం చేశారు. ‘నువ్వు రంగు తక్కువ.. కష్టం’ అని మొహంమీదే చెప్పేశారు. ఎలాగూ కలరి వచ్చు కాబట్టి శశిమాస్టర్‌తో కలిసి పనిచేస్తే.. ఎవరో ఒకరు అవకాశం ఇవ్వకపోతారా అన్న ఆశతో ‘బాడీ డబులింగ్‌’ వృత్తిలో నా కెరియర్‌ని మొదలుపెట్టా. నా మొదటి సినిమాలో.. నటి భావనకి డూప్‌గా చేశా. హీరోతో కలిసి సైకిల్‌పై వెళ్తున్న కథానాయిక.. పడిపోయే సీన్‌ అది. తలకి గాయం అయ్యింది. ఒళ్లంతా రక్తం. చేతులు కొట్టుకుపోయాయి. కళ్లలోంచి నీళ్లొచ్చాయి. అయినా నా మొదట సినిమా కాబట్టి చాలా సంతోషపడ్డా. తర్వాత్తర్వాత బాడీ డబులింగ్‌ కోసం డూప్‌గా అవకాశాలు వచ్చాయే కానీ హీరోయిన్‌గా ఒక్క అవకాశమూ రాలేదు. నిరాశపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం వస్తుందనుకున్నా.

ఆ మానవత్వం చూశాక...

చెట్ల మీద నుంచి దూకాలి. పెద్ద పెద్ద భవంతులపై నుంచి పరుగెత్తాలి. నీళ్లలో పడిపోవాలి. ఇలా ఒక్కసారి కాదు.. టేక్‌ ఓకే అయ్యేంతవరకూ పది, పదిహేను సార్లన్నా చేయాలి. కథానాయకి శ్రీజయ కోసం ‘ఒడియన్‌’ అనే మలయాళ చిత్రంలో.. నీటిలో దూకే సీన్‌. 10 సార్లు నీటిలో దూకాను. ఊపిరి బిగించి దూకి, నీటి అడుగున ఉండాలి. ఒక షాట్‌లో ఊపిరి అందనంత పనైంది. రక్షణగా బెల్టులు, తీగలు, తాళ్లు ఎన్నున్నా ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిందే. కాళ్లూ, చేతులూ విరుగుతూనే ఉంటాయి. అవన్నీ మర్చిపోయి మళ్లీ టేక్‌కి సిద్ధమవ్వాలి. మమతా మోహన్‌దాస్‌కి డూప్‌గా చేశా ఒకసారి. ఆమె ఉన్న బోటు తిరగబడే షాట్‌ అది. తన స్థానంలో నేనున్నా. నా పాదానికి పెద్ద గాయం అయ్యింది. నడవలేకపోయా. మమత చాలా కంగారు పడింది. ఆసుపత్రికెళ్లే వరకు ఊరుకోలేదు. అప్పుడొచ్చాయి నా కళ్లలో నీళ్లు. ఇన్నాళ్లూ అందరికీ నా శరీరంతోనే పని కానీ నాతో కాదు అనుకున్నా. కారణం.. ఎన్నో సినిమాల్లో కథానాయికల కన్నా ఎక్కువ కష్టపడ్డా. కనీసం వాళ్లు థ్యాంక్స్‌ కూడా చెప్పేవారు కాదు. అందుకే ఆ కన్నీళ్లు. భావన, కీర్తిసురేష్‌, అర్చన, తమన్నా, కమలిని ముఖర్జీ వంటి ఎందరికో బాడీ డబులింగ్‌ చేశా. ఇప్పటికీ కలరియ పట్టు సాధన చేస్తుంటా. ధ్యానం నా దినచర్యలో భాగం. ఇవే నన్ను నిత్యం శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉంచుతున్నాయి.

ఆమె చేయనంది..

తమన్నా నటించిన ‘బాంద్రా’ చిత్రం కోసం డూప్‌గా నటించడానికి ముంబయి నుంచి ఒకరిని తీసుకొచ్చారు. ఆమె ఆ షాట్‌ ప్రమాదమని, తను చేయనని వెళ్లిపోయింది. ఆ సమయంలో డైరెక్టర్‌ నాకు కబురు పంపారు. రెండు టేక్స్‌లో పూర్తిచేశా. కానీ బాగా దెబ్బలు తగిలాయి. మొదటిసారి ఈ వృత్తి గురించి భయపడ్డా. ఇక హీరోయిన్‌ కల అంటారా? 2018లో ఒక లఘుచిత్రంలో అవకాశం వచ్చింది. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించగలిగా. కానీ దర్శకుడు ప్రజేష్‌సేన్‌ నుంచి పిలుపొస్తుందని అనుకోలేదు. ఆ సినిమా ‘ది సీక్రెట్‌ ఆఫ్‌ ఉమెన్‌’. ఒక దీవిలో ఒంటరిగా జీవించే షీలా అనే మహిళ పాత్ర నాది. నేను చేయగలనా? అనుకున్నా. వెతుక్కుంటూ వచ్చిన దాన్ని వదులుకోకూడదని చేశా. ఈ సినిమాని అవార్డు కోసం పంపిస్తున్నా అని ప్రజేష్‌సేన్‌ అన్నప్పుడు సినిమాటోగ్రఫీకి వస్తుందేమో అనుకున్నా. కానీ దిల్లీలో జరిగిన 13వ దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ కథానాయిక అవుతాననుకోలేదు. ఆ కలని కన్న మా అమ్మ ఇప్పుడు లేదు. ఉంటే బాగుండేది. 15 ఏళ్ల నా లక్ష్యం నెరవేరిందని చెప్పి తనివి తీరా ఏడ్చేదాన్ని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్