ఆ బాధే.. వ్యాపారమైంది!

సొంతంగా ఏదైనా చేయాలి.. అది నలుగురికీ సాయపడాలని ఆలోచించారు.. మణికుమారి, హిమబిందు. అప్పుడే వాళ్ల దృష్టి పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ప్లాస్టిక్‌ కప్పులపై పడింది. దానికి వారు తీసుకొచ్చిన ప్రత్యామ్నాయం.. ఎంతోమందికి ఉపాధినీ కలిగిస్తోంది.

Published : 04 Jul 2023 00:36 IST

సొంతంగా ఏదైనా చేయాలి.. అది నలుగురికీ సాయపడాలని ఆలోచించారు.. మణికుమారి, హిమబిందు. అప్పుడే వాళ్ల దృష్టి పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ప్లాస్టిక్‌ కప్పులపై పడింది. దానికి వారు తీసుకొచ్చిన ప్రత్యామ్నాయం.. ఎంతోమందికి ఉపాధినీ కలిగిస్తోంది.

పొన్నాడ మణికుమారి, కెజియా హిమబిందు ఇద్దరిదీ రాజమహేంద్రవరం. మణికుమారి ఆర్కిటెక్చర్‌లో డిప్లొమా చేసి, పదేళ్లు హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా చేశారు. నెలకు రూ.లక్ష జీతం. హిమబిందు ఎమ్మే ఇంగ్లిష్‌ చేసి, నన్నయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద ఉద్యోగం చేస్తున్నారు. చిన్ననాటి స్నేహితురాళ్లు ఎప్పుడు కలిసినా ‘నలుగురికి ఉపాధి కల్పించేలా ఏదైనా చేయాల’న్న దానిపైనే చర్చించుకునేవారు. పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణానికి జరుగుతున్న హానీ వీళ్లని బాధించేది. సేవాసంస్థను ప్రారంభించి ప్లాస్టిక్‌ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలనుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై పరిశోధిస్తోంటే వారి దృష్టి ఒక్క వినియోగంతో పడేసే ప్లాస్టిక్‌ కప్పులపై పడింది. దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దేశాలు పిండితో తయారుచేసిన కప్పులను వినియోగించడం గమనించారు. కాఫీ, టీ తాగాక వాటిని ఏకంగా తినేయొచ్చు కూడా. ఇలాంటివి మనదగ్గరా ప్రవేశపెడితే కొంతమేర అయినా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని భావించారు.

అంతర్జాలంలో ఈ తరహా కప్పుల తయారీ, వాడటం వల్ల ఏవైనా నష్టాలున్నాయా అనీ పరిశోధించారు. రాగి, జొన్న వంటివాటితో ఆరోగ్యమే కాబట్టి, వీటితో చేయాలని నిర్ణయించుకున్నారు. గతేడాది అక్టోబరులో ఇద్దరు స్నేహితురాళ్లు కలిపి సుమారు రూ.20 లక్షలతో ‘క్రంచీ కప్స్‌’ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశారు. రాగి, జొన్న, మైదాలతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు నాలుగు వేల కప్‌లను తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. నగరపాలక సంస్థ యంత్రాంగం కూడా వీరి ప్రయత్నాన్ని ప్రశంసించి, ప్రచారాన్ని కల్పిస్తోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించడానికి వివిధ సంస్థలూ ముందుకు వస్తున్నాయి. ‘సామాన్యులకూ  అందుబాటులో ఉండాలనే రూ.5కు విక్రయిస్తున్నాం’ అంటున్న ఈ స్నేహద్వయం పరిశ్రమ కోసం ఉద్యోగాలనీ వదులుకున్నారు. రూ.24 లక్షల టర్నోవర్‌ సాధిస్తున్నారు. 25-30 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారు. తాము కోరుకున్నట్టుగా నలుగురికీ ఉపాధిని కల్పిస్తూనే పర్యావరణహితానికీ తోడ్పడుతుండటం ఆనందంగా ఉందని చెబుతున్నారు.

 వి.వి.వి.రామకృష్ణ, రాజమహేంద్రవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్