ఎక్కడికెళ్లినా నాకిదే ప్రశ్న!

మనవాళ్లు.. అంతర్జాతీయ సంస్థలకు సీఈఓ అన్నప్పుడు ఒకింత గర్వంగా అనిపించడం సాధారణమే! ఈసారి ఆ జాబితాలోకి ఓ మహిళ.. ఇంకా చెప్పాలంటే తెలుగు ఆడపడుచు చేరారు.

Updated : 08 Jul 2023 02:58 IST

మనవాళ్లు.. అంతర్జాతీయ సంస్థలకు సీఈఓ అన్నప్పుడు ఒకింత గర్వంగా అనిపించడం సాధారణమే! ఈసారి ఆ జాబితాలోకి ఓ మహిళ.. ఇంకా చెప్పాలంటే తెలుగు ఆడపడుచు చేరారు. శిరీష ఓరుగంటి.. యూకేకు చెందిన లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌కు సీఈఓ అయ్యారు. తెలుగువారి ఖ్యాతిని మరోసారి ప్రపంచవ్యాప్తం చేశారు. ఆవిడ ప్రస్థానమిది!

‘ఒక మహిళగా ఇంత ఉన్నత స్థాయికి చేరడం ఎలా అనిపిస్తోంది? ఎక్కడికెళ్లినా ఈ ప్రశ్న నన్ను చాలామంది అడుగుతుంటారు. దానికి నాకు వెంటనే స్ఫురించే సమాధానం.. కష్టం.. చాలా కష్టమనే! గది మొత్తంలో ఒంటరిగా.. అంతమంది మగవాళ్ల మధ్య ఏకైక మహిళా గొంతును వినిపించడం మామూలు విషయం కాదు. అభిప్రాయాలను చెప్పడానికీ.. సందేహాలను వ్యక్తం చేయడానికీ చాలా ధైర్యం కావాలి. ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉండాలి.. అందుకే ఆ సమాధానమిస్తా. అయినా ఈ స్థాయికి ఎలా అంటే టెక్నాలజీపై నాకున్న ప్రేమే. ఎన్నో సమస్యలకు సాంకేతికతతో సమాధానాలు చెప్పొ చ్చు. కాలం గడుస్తున్నకొద్దీ సమస్యలెన్నో. వాటికి పరిష్కారాలు కనుగొనాలన్న ఆలోచనే ఉత్సాహం నింపేస్తుం’దంటారు శిరీష. ఈవిడది గుంటూరు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేశారు.

ఆ లక్ష్యం కాదు..

కెరియర్‌ ప్రారంభంలోనే ప్రభుత్వ రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా అవకాశం. తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సహా ఎన్నో ప్రాజెక్టులకు పనిచేశారు. ఒకేచోట ఆగిపోవడం ఆవిడ నైజం కాదు. అందుకే భిన్నరంగాల్లో తనని తాను నిరూపించుకున్నారు. టెక్‌ మహీంద్రా, మాస్టర్‌కార్డ్‌, గ్రే మాటర్స్‌ క్యాపిటల్‌, జేపీ మోర్గాన్‌, జేసీపెన్నే.. వంటి ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐటీ ఆర్కిటెక్చర్‌, డేటా ఇంజినీరింగ్‌, ఫిన్‌టెక్‌ ఇన్నొవేషన్‌లో 30ఏళ్లకుపైగా అనుభవం ఈవిడ సొంతం. శిరీష.. జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ ఇన్‌ టెక్నాలజీకి భారత్‌లో తొలి మహిళా ఎండీ. వాగర్‌, హైజీన్‌ ఎనర్జీ, గ్రే మాటర్స్‌ క్యాపిటల్‌ మొదలైన వాటికి అడ్వైజరీ బోర్డులో సభ్యురాలిగానూ చేశారు. ‘టెక్‌గీక్‌.. సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించడంలో సిద్ధహస్తురాలు..’ శిరీషతో పనిచేసేవారంతా చెప్పే మాటిది. మంచి నాయకురాలు, ఎలాంటి పరిస్థితైనా తొణకని ధైర్యవంతురాలని ప్రశంసిస్తుంటారు. మాస్టర్‌కార్డ్‌లో క్లౌడ్‌ అప్లికేషన్స్‌ ఆవిడ ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయి. టెక్‌ మహీంద్రా ల్యాబ్స్‌ యూరప్‌, అమెరికా, కెనడా.. వంటి ఎన్నో దేశాలకు చేరడంలో ఈమెది ప్రధాన పాత్రే. యూకేకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల గ్రూపు.. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కీలకమైన లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌కు శిరీషను సారథిగా నియమించింది.


మన చేతిలోనే..

‘ఒకబ్బాయి, ఒకమ్మాయి.. ఇద్దరికీ ఏదైనా అవకాశమిస్తానంటే.. 50% నమ్మకమే ఉన్నా అబ్బాయి ముందుకొస్తాడు. అమ్మాయి మాత్రం నైపుణ్యాలున్నా, నీమీద నమ్మకం ఉందన్నా.. దాన్ని అందుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేనన్న కారణాలనే వెతుకుతుంది. ‘నీవల్ల కాదు.. అది నువ్వు చేయలే’వన్న మాటల మధ్య పెరగడమే అందుకు కారణం. మిగతా వాళ్లకంటే తక్కువని మనకి మనమే భావిస్తుంటాం. ముందు చేయగలను అన్న నమ్మకం మనలో ప్రారంభమవ్వాలి. ఎవరో వచ్చి మీతరఫున మాట్లాడతారనీ ఆశించొద్దు. మీ గురించి మీరే చెప్పాలి. ఈ క్రమంలో సందేహాలు, ప్రతికూల వ్యాఖ్యలు సాధారణమే. పట్టించుకోకుండా సాగగలగాలి. నేను అనుసరించిన సూత్రమిది. అందరూ దీన్ని పాటిస్తే... ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతుం’దనే శిరీషకు.. ప్రదర్శనకు ప్రాధాన్యమిస్తూనే సహానుభూతితో ఆలోచిస్తారన్న పేరూ ఉంది. ‘ఏమాత్రం ఆశలేదు.. కచ్చితంగా నష్టమొస్తుంది’ అన్న వాటినీ విజయాలుగా మార్చిన సందర్భాలెన్నో. అందుకే టెక్‌ రంగంలో అమ్మాయిలకు ఈవిడని రోల్‌మోడల్‌గా చూపిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్