ఆ పాప మరణం.. తట్టుకోలేకపోయా!

మూడు దశాబ్దాల కిందటే ఎండీ చదివారామె.. కానీ వైద్యాన్ని ఆదాయ మార్గంలా చూడలేదు.. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్తం అందించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు విశాఖపట్నానికి చెందిన డా.ఎ.సుగంధి.

Updated : 22 Jul 2023 04:41 IST

మూడు దశాబ్దాల కిందటే ఎండీ చదివారామె.. కానీ వైద్యాన్ని ఆదాయ మార్గంలా చూడలేదు.. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్తం అందించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు విశాఖపట్నానికి చెందిన డా.ఎ.సుగంధి. ఆ లక్ష్యానికి కట్టుబడి ఇంత వరకూ వేలమందికి ప్రాణదానం చేశారామె. ఈ మహాయజ్ఞం అంత సులభంగా సాగలేదు అంటూ ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను వసుంధరతో పంచుకున్నారు...

నేను ఎంబీబీఎస్‌ చదివా. మావారు శివప్రసాద్‌ ఉదరకోశ నిపుణులు. దిల్లీ ఎయిమ్స్‌లో చదివారు. ఇద్దరూ డాక్టర్లే కదాని ఇంట్లో పెద్దవాళ్లు విశాఖలో ఓ పెద్ద ఆసుపత్రి నిర్మించి ఇచ్చారు. కానీ మా లక్ష్యం సేవ. దానికి మా మామగారు ఏఎస్‌ రాజా మంచి మనసు కూడా తోడయ్యింది. ఆయనకు వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ప్రజలకు మేలు చేయాలని కుటుంబం నుంచి ఒకరు పూర్తిగా ప్రజాసేవకే అంకితమవ్వాలని ఆయన కోరుకున్నారు. ఆ ఆశయం కోసం నేను ముందుకొచ్చాను. సమయానికి రక్తం అందక అప్పట్లో ఎంతోమంది మృతి చెందేవారు. అందుకే బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలనుకున్నా. ఇందుకోసం ఆంధ్ర వైద్య కళాశాల నుంచి ఎండీ పాథాలజీ చదివా. రక్తనిధి కేంద్రం నిర్వహణకు ఆ కోర్సు పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఏడాది పాటు వెల్లూరులోని ఓ కేంద్రంలో శిక్షణ తీసుకున్నా. ఆ అనుభవంతో 1995లో ఏఎస్‌ రాజా స్వచ్ఛంద రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించాం. అప్పట్నుంచీ దాని నిర్వహణ నేనే చూసుకుంటున్నా.

మొదటి రోజే నిరాశ...

బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించాం సరే... మరి దానికి రక్తదానం చేసేవాళ్లు ఉండాలిగా! కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులని అడిగితే ఆ రోజు ముందుకొచ్చింది 15 మంది మాత్రమే.  అప్పట్లో రక్తదానంపై అనేక అపోహలు ఉండేవి. దీంతో దాతలు దొరికేవారు కాదు. మాకు రోటరీ, రెడ్‌క్రాస్‌, లయన్స్‌, ఎన్‌జీవోలు, ఇతర సంస్థలతో స్నేహ సంబంధాలు ఉన్నాయి కదా ఈ పని తేలిక అనుకున్నా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మూడు నెలలు గడిచాక.. ఇక నడపలేం అనే స్థాయికి వచ్చేశా. 50 మందికి రక్తం కావాల్సొస్తే.. రక్తం ఇచ్చేవారు పది మందే ఉండేవారు. నా స్నేహితురాలి 11 ఏళ్ల పాప సమయానికి రక్తం అందక చనిపోయింది. ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. మా దృష్టికి రానివి ఇంకెన్నో. అప్పటి నుంచి దీన్ని ఒక సవాలుగా తీసుకున్నా. రక్తదానం అవగాహన కోసం ప్రత్యేక బృందాలు నియమించా. పదేళ్లు నిర్విరామంగా పనిచేశా. కావాల్సిన వాళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లకూ వెళ్లలేని పరిస్థితి. అంతలా శ్రమించాల్సి వచ్చింది. మొదటి ఏడాది 7 వేల యూనిట్లు మాత్రమే సేకరించాం. ఆ తర్వాత ఏడాది పది వేల యూనిట్లు. 2011లో గరిష్ఠంగా 21 వేల యూనిట్లు.. ప్రస్తుతం ఏటా 15 వేల యూనిట్లు సేకరిస్తున్నాం.

ఖర్చుకు వెనకాడలేదు..

ఈ బ్లడ్‌ బ్యాంకు నిర్వహణ కోసం ఎప్పుడూ వెనకాడలేదు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూ.కోట్ల విలువైన పరికరాలు కొనుగోలు చేశాం. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో టెస్టింగ్‌ పరికరాలను విదేశాల నుంచి తెప్పించాం. డెంగీ వస్తే రోజుల తరబడి ప్లేట్‌లెట్స్‌ కోసం క్యూలు కట్టేవారు. కొవిడ్‌లోనూ ఇదే పరిస్థితి. అందుకే ప్లాస్మా వేరు చేసే ఆధునిక పరికరాలూ కొనుగోలు చేశాం. రక్తం డోనర్‌ దగ్గర నుంచి సేకరించినప్పటి నుంచీ బ్లడ్‌ గ్రూపింగ్‌, టెస్టింగ్‌, నిల్వ వరకు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తాం. ఓపెన్‌ హార్ట్‌, కాలేయం, ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల్లో ఎక్కువమంది మా వద్ద నుంచే రక్తం తీసుకెళ్తారు. ఇప్పటివరకు 500 ఓపెన్‌హార్ట్‌ శస్త్రచికిత్సలకు రక్తం అందించాం.

వినియోగం పెరిగినా..

గతంతో పోలిస్తే వినియోగం పది రెట్లు పెరిగింది. కానీ రక్తదానం చేసేవారు మాత్రం పెరగలేదు. గతంలో విద్యాలయాలు, పరిశ్రమలు, సంస్థలు ఏటా శిబిరాలు నిర్వహించి రక్తం అందించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. విద్యార్థులకు సమయం లేదు, పరీక్షలున్నాయి, ల్యాబ్‌ అంటూ దాట వేస్తున్నారు. ఇదే కొనసాగితే మళ్లీ రక్తం కొరత ఏర్పడే పరిస్థితులున్నాయి. దీనికి ప్రాంతీయ రక్త నిధి కేంద్రం ఏర్పాటు చక్కని పరిష్కారం. రీజనల్‌ బ్లడ్‌ బ్యాంకుని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం.

- సురేశ్‌ రావివలస, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్