వీరివి ప్లస్‌ సైజ్‌ విజయాలు!

కాస్త లావుగా ఉంటే.. నలుగురిలోకి రావడానికి ఆలోచిస్తాం. నచ్చిన డ్రెస్‌ వేసుకోవడానికి వెనకాడతాం. లావుని దాచి సన్నగా కనబడాలని తాపత్రయ పడతాం.

Published : 23 Jul 2023 00:16 IST

కాస్త లావుగా ఉంటే.. నలుగురిలోకి రావడానికి ఆలోచిస్తాం. నచ్చిన డ్రెస్‌ వేసుకోవడానికి వెనకాడతాం. లావుని దాచి సన్నగా కనబడాలని తాపత్రయ పడతాం. కానీ వీళ్లలా కాదు.. అధిక బరువుతో వచ్చే ఇబ్బందుల్ని బయటపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్లస్‌ సైజ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారి అవకాశాలు అందుకున్నారు...


ఫిల్టర్లలో ముఖం దాచుకొనేదాన్ని..
ప్రబ్లీన్‌ కౌర్‌ బొమ్రా

ప్రబ్లీన్‌ పుట్టి పెరిగింది దిల్లీలో. మోడల్‌ కావాలని కలలు కంది. అధిక బరువు, మొటిమలవల్ల ఎక్కడికి వెళ్లినా ఛీత్కారాలే. తెలిసిన వాళ్లే ‘బరువు తగ్గాలి. లేకపోతే పెళ్లి అవ్వడం కష్టం’ అని హేళన చేసేవారు. ‘సన్నగా, నాజుగ్గా రకరకాల దుస్తుల్లో మెరిసిపోవాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు. నాదీ అదే ఆశ. అందుకే బరువు తగ్గడానికి ఎవరేం చెప్పినా చేసేదాన్ని. తినేదాన్ని కాదు. దీనికి పీసీఓడీ సమస్య తోడైంది. పార్టీలు, ఫంక్షన్లు ఎక్కడికి వెళ్లినా ఏంటి నీ ముఖం నిండా మొటిమలు అనేవారు. వీటన్నిటి నుంచి బయటపడటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ.. టిక్‌టాక్‌లోకి వచ్చాను. దాన్నే వ్యాపకంగా చేసుకున్నా. వీడియోలు అందంగా రావాలని ఫిల్టర్లు వాడేదాన్ని. మొటిమలు దాచుకోవడానికి ఎన్నెన్నో క్రీములు. కానీ ఫిల్టర్లు, క్రీములతో ఎన్నాళ్లని నా ముఖం దాచుకుంటా? అవన్నీ వదిలేసి.. నా సమస్యను రీల్స్‌ ద్వారా వివరించా. అప్పుడే అర్థమైంది చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని. వాళ్లలో ఉత్తేజం నింపుతూ, సమస్యకు పరిష్కారం చెబుతూ వీడియోలు చేయడం మొదలుపెట్టా. ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో మూడున్నర లక్షల మంది  అభిమానులని సంపాదించుకున్నా’ అనే ప్రబ్లీన్‌ మోడల్‌గా, డాన్సర్‌గా రాణిస్తోంది.


ఏ కొండనైనా ఎక్కేస్తా
దీక్ష సింగీ

‘11 ఏళ్ల వయసు నుంచే బరువు తగ్గాలని తినడం మానేసేదాన్ని. ఇచ్చిన ఆహారాన్ని చెత్తబుట్టలో పడేసి అమ్మకి అబద్ధం చెప్పేదాన్ని. స్నేహితులు, ఇరుగు, పొరుగు.. మోటూ అంటే తట్టుకోలేకపోయేదాన్ని. వయసు పెరుగుతున్న కొద్దీ నా సమస్య అర్థమైంది. కానీ నన్ను నేను అంగీకరించడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఈ బాధ నుంచి బయటపడటానికే ట్రావెలింగ్‌ని వ్యాపకంగా మార్చుకున్నా. కాస్త బరువుంటేనే అడుగు వేయడానికి సంకోచిస్తారు. అలాంటిది నేను కొండలు, గుట్టలు ఎక్కేస్తా. అందుకు కావాల్సిన ఫిట్‌నెస్‌ సలహాలు ఇస్తుంటా. ఎన్నో దేశాలు పర్యటించా. వాటినే వీడియోలుగా ఇన్‌స్టాలో పెడుతుంటా. లక్షమంది అనుసరిస్తున్నారు. అధిక బరువుతో నిరాశలో ఉన్నవారు ఈ వీడియోలని చూసి ఉత్సాహంగా మారుతున్నాం అంటే సంతోషంగా ఉంటుంది’ అనే దీక్ష ఫ్యాషన్‌  యాక్సెసరీలనూ రూపొందిస్తుంది.


పట్టవు అనేవారు
ఆష్నాభగవానీ

మోడల్స్‌ అంటే సన్నగా, నాజూగ్గా ఉండేవాళ్లనే చూశారు. వందల ప్లస్‌ సైజ్‌ దుస్తుల బ్రాండ్లకి ఆష్నా మోడల్‌. ఆ విజయం ఆమెకు అంత తేలిగ్గా దక్కలేదు. ‘నాన్నమ్మ డిజైనర్‌. పెరిగిందంతా సినిమా ప్రపంచంలో. వెండితెర మీద వెలిగిపోవాలనుకున్నా. కానీ బొద్దుగా ఉండటం వల్ల సాధ్యపడలేదు. ఏ దుస్తులు వేసుకుందామన్నా నీకివి పట్టవులే అనేవారు. ‘అసలు నీసైజ్‌ డ్రెస్సులుంటాయా?’ అని వెక్కిరించేవారు. చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నేనో ప్లస్‌ సైజ్‌ మోడల్‌ని. దీనంతటికీ సామాజిక మాధ్యమాలే కారణం. మేమూ మనుషులమే, లావుగా ఉండటం మా తప్పు కాదంటూ మొదలైంది నా వీడియోల ప్రయాణం. ఇప్పుడు రెండున్నర లక్షల మంది ఫాలోయర్లు న్నారు. 2014లో బాడీ పాజిటివిటీపై వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు తిట్టని వారు లేరు. నువ్వున్న బరువేంటి, వేస్తున్న దుస్తులేంటి అంటూ కామెంట్లు పెట్టేవారు. వేల తిట్ల మధ్య ఎక్కడో ఒక కామెంట్‌ ‘థాంక్యూ దీదీ.. మేమూ ఈ సమస్యతోనే బాధపడుతున్నాం’ అంటూ ఉండేది. అవే నాకు బలాన్నిచ్చేవి. నేను చేసే కంటెంట్‌ ప్రభావంతో అన్ని రకాల దుస్తుల్లో ప్లస్‌సైజ్‌లను కుట్టడం మొదలుపెట్టారు’.. అనే ఆష్నా ప్రస్తుతం 200 బ్రాండ్స్‌కి మోడల్‌గా పనిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్