రెక్కలకో.. గ్రంథాలయం!

మన పెరట్లోనో, బాల్కనీ నుంచో రంగురంగుల పక్షులు కనబడితే చూసి ఆనందిస్తాం. మనకి తెలిసిన నాలుగైదు రకాలు తప్పించి.. కొత్త వాటి పేరేంటో మనకి తెలియదు.

Updated : 28 Jul 2023 04:51 IST

మన పెరట్లోనో, బాల్కనీ నుంచో రంగురంగుల పక్షులు కనబడితే చూసి ఆనందిస్తాం. మనకి తెలిసిన నాలుగైదు రకాలు తప్పించి.. కొత్త వాటి పేరేంటో మనకి తెలియదు. ఆ సమాచారం చిటికెలో తెలిసేందుకు వీలుగా దేశంలోనే తొలి డిజిటల్‌ ఫెదర్‌ లైబ్రరీని ప్రారంభించారు

ఈషా మున్షీ...

‘కొవిడ్‌ సమయంలో... ఒక పిల్లి పక్షిపిల్లను పట్టితెచ్చి మా వరండాలో తినడం మొదలుపెట్టింది. నాకు పాపం అనిపించి, ఆ పిల్లిని ఎంత అదిలించినా అది వదల్లేదు. చివరికి ఆ పక్షి రెక్కలు, ఈకలు తప్ప ఏం మిగల్లేదు. అదేం పక్షో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించా. చివరికి ఈ ఫెదర్స్‌ రంగు, పక్షి పోలికలు చెప్పి నాకు తెలిసిన బర్డ్‌ లవర్‌ని అడిగితే అది సిల్వర్‌బిల్‌ అయి ఉంటుందిలే అన్నాడు. అతను చెప్పింది తప్ప మరెక్కడా వివరాలు దొరకలేదు. ఆశ్చర్యంగా అనిపించింది. మా అహ్మదాబాద్‌లో కొన్ని వందల పక్షులు ఉంటాయి. కానీ వాటిల్లో నాకు తెలిసిన పేర్లు మహా అయితే మూడు, నాలుగు. అప్పట్నుంచి పక్షులకు సంబంధించిన సమాచారం కోసం వెతకడం మొదలుపెట్టా. ఎక్కడా దొరికేది కాదు. అదేదో నేనే మొదలుపెడితే అన్న ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని నా స్నేహితుడు షెర్విన్‌కు చెప్పాను. అతను వన్యప్రాణులకు పునరావాసాన్ని కల్పించే ఓ సంస్థతో కలిసి పని చేస్తాడు.

ప్రతి నెల దాదాపు రెండువేల పక్షులకు ఈ సంస్థ చికిత్సనందిస్తుంది. అతని సాయంతో ఆన్‌లైన్‌లో పక్షులకు కావాల్సిన సమాచారం అందించే ఫెదర్‌ లైబ్రరీ ప్రారంభించా. షెర్విన్‌ సాయంతో ఈకలను సేకరించి వాటిని ఫొటోలు తీసి, పక్షి శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆయా జాతులను గుర్తిస్తున్నా. ఆ వివరాలతో మార్చి 2020, నవంబరులో దేశంలోనే తొలిసారిగా ‘డిజిటల్‌ ఫెదర్‌ లైబ్రరీ’ని ఫెదర్‌లైబ్రరీ.కామ్‌పేరుతో ప్రారంభించా. పక్షి జాతి, బరువు, పరిమాణం, పొడవు నుంచి అవి నివసించే భౌగోళిక ప్రాంత వివరాలనూ పొందుపరుస్తున్నాం. మన దేశానికి చెందిన 1300 రకాల పక్షి జాతుల్లో ఇప్పటివరకు 1,060 రకాల వివరాలను అందులో ఉంచా. వీటిలో అరుదైన జాతులూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు, అధ్యయన వేత్తలు, అటవీశాఖలకూ ఈ వేదిక ఉపయోగపడుతోంది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని అమెరికా కార్నెల్‌ యూనివర్శిటీలో రెండేళ్ల బర్డ్‌ బయాలజీ కోర్సు పూర్తిచేశా’ అనే 35 ఏళ్ల మున్షీ ఆర్కిటెక్ట్‌ కూడా. త్వరలో దేశవ్యాప్తంగా బర్డ్‌ మ్యూజియాలు మరిన్ని లైబ్రరీల ఏర్పాటుకు కృషి చేస్తున్నారీమె. ఫెదర్‌ మ్యూజియం ఏర్పాటుకు బెంగళూరు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయలాజికల్‌ సైన్సెస్‌తో కలిసి పనిచేస్తున్న ఈమె కృషి అభినందనీయం కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్