అమ్మ కదా...అమృతమిస్తోంది!

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికీ, ఎదుగుదలకీ చేసే మేలెంతో! ఈ విషయం మోడరన్‌ అమ్మలకీ బాగా తెలుసు. అందుకే అందం, కెరియర్‌ అంటూ స్తన్యం ఇవ్వడానికి వెనుకాడట్లేదు.

Updated : 02 Aug 2023 05:22 IST

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికీ, ఎదుగుదలకీ చేసే మేలెంతో! ఈ విషయం మోడరన్‌ అమ్మలకీ బాగా తెలుసు. అందుకే అందం, కెరియర్‌ అంటూ స్తన్యం ఇవ్వడానికి వెనుకాడట్లేదు. పాపాయి ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తున్నారు. అంతేనా.. కొందరు తల్లిపాలను నోచుకోని వారికి సాయమందిస్తోంటే.. మరికొందరు వాటి గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు.. అలాంటి కొందరు అమ్మలను కలుసుకోండి.

మోడల్‌, నటి.. అందానికి వీరికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారెవరు ఉంటారు? బిడ్డ ఆరోగ్యం కంటే అవేమీ ఎక్కువ కాదంటోంది సోనమ్‌ కపూర్‌. గతేడాది చివర్లో బాబుకి జన్మనిచ్చిందీమె. ‘ఆరోగ్యం విలువ నాకు బాగా తెలుసు. చిన్నతనంలోనే మధుమేహం, ఆపై అధిక బరువు. ఎన్ని అవమానాలు పడ్డానో. అలాంటిది నా బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఉంటానా? ‘బరువు పెరిగినందుకు బాధగా ఉందా’ అంటూ చాలామంది అడిగేవారు. ఆ కొలతలు పట్టించుకోవడం మానేసి.. ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామంపై మాత్రమే దృష్టిపెట్టా’ననే సోనమ్‌ అమ్మగా తన ప్రయాణాన్నీ.. పాలిచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడం సహజమని ప్రచారమూ చేస్తోంది.

వేల మందికి సాయం..

తన పాపాయి ఆరోగ్యం కోసం ఏ తల్లైనా తాపత్రయపడుతుంది. తన బిడ్డల్లాంటి వారే అందరూ అని మిగతా పిల్లల గురించీ ఆలోచించేవారు ఎందరు ఉంటారు? కోయంబత్తూరుకి చెందిన శ్రీవిద్య, సింధు అలాగే ఆలోచించారు. అందుకే వందల లీటర్ల చనుబాలను దానం చేశారు. వేలమంది చిన్నారులకు అమ్మయ్యారు. ‘ప్రసవ సమయంలో తల్లి చనిపోయి.. అమ్మకి పాలు పడక పోతపాలపై ఆధారపడే చిన్నారులను చూస్తే జాలేసేది. అప్పటికే నాకో బాబు. రెండోసారి పాప. అమ్మని కదా.. నెలలు నిండక, తక్కువ బరువుతో ఉన్న ఆ పిల్లలను చూసి తట్టుకోలేకపోయా. ఏదైనా సాయం చేయాలనిపించి వెతికితే తల్లిపాల దానం గురించి తెలిసింది. ఆలోచించకుండా ముందుకొచ్చా’ననే శ్రీవిద్య 105 లీటర్ల పాలను దానం చేసింది. ‘పాపాయి పుట్టిన కొత్తలో పాలు ఎక్కువయ్యేవి. నొప్పి భరించలేక పిండి పారబోసేదాన్ని. ఓసారి అనుకోకుండా తల్లిపాలతో శిశుమరణాలు తగ్గించొచ్చు, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచొచ్చన్న వార్త చదివా. అంత అమృతతుల్యమైన పాలను వృథా చేస్తున్నానని బాధేసింది. దానమివ్వడం మొదలుపెట్టా’ననే సింధు మౌనిక 55 లీటర్లతో 1500 మంది పిల్లల కడుపునింపింది.

కవల పిల్లలు.. ఆ కబురు వినగానే కుటుంబమే కాదు.. విశ్వ కుంతల్‌ వకిల్‌ కూడా ఎగిరి గంతేసినంత పనిచేశారు. కానీ అనారోగ్య కారణాలతో ముందుగానే ప్రసవం అయ్యింది. కవలల్లో ఒకరు చనిపోయారు. ఇంకొకరి పరిస్థితీ ప్రమాదకరంగానే ఉంది. ఎన్‌ఐసీయూ ముందు బిడ్డ ఆరోగ్యం కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఎదురు చూసేదామె. అలాంటి పరిస్థితుల్లో వేరొకరికి సాయం చేయాలన్న ఆలోచన వస్తుందా? కానీ ఆమెకు వచ్చింది. వృత్తిరీత్యా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. తల్లిపాలతో పిల్లలు త్వరగా ఆరోగ్యవంతులవుతారని విశ్వ అధ్యయనం ద్వారా తెలుసుకుంది. కెరియర్‌ను పక్కనపెట్టి, ఆసుపత్రిలోనే నెలలు గడిపింది. తన బిడ్డతోపాటు ఎన్‌ఐసీయూలో ఉన్న ఓ కవలల తల్లి ఆమెకు పరిచయమైంది. ఆమెకేమో పాలు లేవు. ‘వాళ్ల ఆరోగ్యమెలా?’ ఇదే ఆలోచించిన విశ్వ తనబిడ్డతో పాటు వాళ్లకీ పాలిచ్చేది. అలా ఇంకొందరికి.. మొత్తం పాతిక లీటర్ల పాలను దానం చేసింది.

బాధ్యతగా భావించి..

‘ఇతరుల పిల్లలకు పాలిస్తే.. మావాళ్లకెలా సరిపోతాయంటారు చాలామంది తల్లులు. వాళ్లను మాటలతోకాదు చేతలతోనే ఒప్పించాలనుకున్నా. నాకు కవలలు. వాళ్లు చిన్నగా ఉన్నప్పటి నుంచే పాలను తీసి ఫ్రీజ్‌ చేసేదాన్ని. తర్వాత వాళ్లకు ఇస్తూనే మిగిలిన వాటిని మిల్క్‌ బ్యాంకుకి దానమిస్తున్నా. ఆఫీసుకి తిరిగొచ్చాక చాలామంది పాలివ్వడం మానేస్తారు. కానీ తీసి కూడా అందించొచ్చు. అది స్వయంగా ఆచరించి చూపి, ఇతరులను అడుగుతున్నా. తల్లిపాలు ఆరోగ్యం.. ఎంతోమంది ప్రాణాలు కాపాడొచ్చు అని మాటల్లో చెప్పినప్పటి కంటే చేతల ద్వారా ఎక్కువమందిని ఒప్పించగలిగా’నంటారు ఐఏఎస్‌ అధికారి మితాలీ సేథీ. డాక్టరుగానే కాదు.. ప్రజాసేవకురాలిగా అది నా బాధ్యతనే ఆవిడ ‘బ్రెస్ట్‌ మిల్క్‌ డొనేటింగ్‌ ప్రోగ్రామ్‌’ ఎలిగ్జిర్‌కి అంబాసిడర్‌ కూడా!

ఎలిసాబెత్‌ యాండర్సన్‌ అయితే ఏకంగా తొమ్మిదేళ్లలో పదివేల లీటర్లను పాలను దానంచేసి గిన్నిస్‌ రికార్డును అందుకుంది. ఈమె అమెరికన్‌. హైపర్‌ లాక్టేషన్‌ కారణంగా గర్భం దాల్చినప్పటి నుంచే ఆమెకు పాలు ఉత్పత్తి అయ్యేవి. మందులు వాడితే తగ్గేదే. కానీ తల్లిపాలు లేని నవజాత శిశువుల గురించి ఆలోచించి దానమివ్వడం మొదలుపెట్టిందామె. పైగా ఇంతమంది ఆకలి తీర్చడం గొప్ప అనుభూతి అంటుందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్