నా మాటెవరూ నమ్మలేదు...

మహిళా సాధికారత కోసం తన కెరియర్‌ను వదులుకున్నారీమె. దేశవ్యాప్తంగా వేలాదిమందికి పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణనిచ్చి ఆర్థికస్వావలంబన కల్పించారు. ‘మష్రూం లేడీ ఆఫ్‌ ఉత్తరాఖండ్‌’గా పేరు తెచ్చుకున్న డాక్టర్‌ హిరేషా వర్మ మనోగతమిది.

Published : 13 Aug 2023 00:14 IST

మహిళా సాధికారత కోసం తన కెరియర్‌ను వదులుకున్నారీమె. దేశవ్యాప్తంగా వేలాదిమందికి పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణనిచ్చి ఆర్థికస్వావలంబన కల్పించారు. ‘మష్రూం లేడీ ఆఫ్‌ ఉత్తరాఖండ్‌’గా పేరు తెచ్చుకున్న డాక్టర్‌ హిరేషా వర్మ మనోగతమిది.

నాన్న సైన్యంలో కమాండెంట్‌. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల్లోనే నా బాల్యమంతా గడిచింది. నాసిక్‌లో డిగ్రీ, చెన్నై నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెచ్‌ఆర్‌లో హ్యూమన్‌ రిసోర్స్‌లో మాస్టర్స్‌ చదివా. దూరవిద్యలో ఎంబీఏ తర్వాత టాటా టెలికాంలో రెండేళ్లు ఉద్యోగం చేశా. ఆ అనుభవంతో  ‘హంజెన్‌ టెక్నాలజీస్‌’, 2010లో ‘హంజెన్‌ కన్సల్టెంట్స్‌ ప్రారంభించా. ఉత్తరాఖండ్‌ను 2013లో వరద ముంచెత్తింది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఓ ఎన్జీవోతో కలిసి.. దుస్తులు, ఆహారం, నిత్యావసర వస్తువులూ అందించా. మగవాళ్లు పట్టణాలకు వలస వెళ్లడంతో పిల్లలు, మహిళలే అక్కడెక్కువ కనిపించారు. నిరక్షరాస్యతతో వారెవరికీ ఉపాధిలేదు. అడవి నుంచి కట్టెలు తెచ్చి అమ్మి పిల్లలను పోషిస్తుంటారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతా వారే గుర్తొచ్చేవారు. నావంతు సాయమేదైనా చేయాలనిపించింది.

శిక్షణ ఇచ్చి..

ఆ పర్వత ప్రాంతాల్లో పుట్టగొడుగుల పెంపకం విజయవంతం అవుతుందని తెలిసింది. అందులోనే వారికి శిక్షణనిస్తే మంచిదనిపించి అధ్యయనం ప్రారంభించా. నిపుణులను కలుసుకున్నా. సోలాన్‌లోని ఐసీఏఆర్‌- డైరెక్టరేట్‌ ఆఫ్‌ మష్రూమ్‌ రిసెర్చ్‌ (డీఎమ్మార్‌) సెంటర్‌లో శిక్షణ తీసుకున్నా. ప్రభుత్వ శిక్షణా తరగతుల్లో చేరి మెలకువలు తెలుసుకొన్నా. మా క్వార్టర్స్‌లోని చిన్న గదిలో ఆయిస్టర్‌ పుట్టగొడుగులు పెంచా. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌కెళ్లి మహిళలను కలుసుకొని వీటి పెంపకం ద్వారా ఉపాధి పొందొచ్చంటే ఎవరూ నమ్మలేదు. వాటి వల్ల కలిగే లాభాలను వివరించా. ఉచిత శిక్షణనిచ్చి, దానికి కావాల్సినవన్నీ అందించా. మొదట అయిదుగురు, ఆ తర్వాత 10 మంది వచ్చారు. ఇప్పుడా సంఖ్య 5వేలకు చేరింది. వారు పండించేవాటిని మార్కెటింగ్‌ చేయడానికి 2015లో ‘హన్‌ ఆగ్రో కేర్‌’ ప్రారంభించా. రూ.60 లక్షల బ్యాంకు రుణంతో యూనిట్‌నీ మొదలుపెట్టా. 

తెలంగాణాలోనూ..

చైనా వెళ్లి ఈ సాగు గురించి మరింత తెలుసుకొన్నా. డీఎమ్మార్‌ సహకారంతో హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ- కశ్మీర్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది మహిళలకు శిక్షణనిప్పించి  ఆర్థిక స్వావలంబన పొందేలా చేస్తున్నా. హైదరాబాద్‌ మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, వైజాగ్‌ భారతీయ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నొవేషన్‌ యూనివర్శిటీ సహకారంతో మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఈ సాగుకు కావాల్సిన సేంద్రియ ఎరువును ప్రభుత్వమే అందించేది. కొవిడ్‌లో పంపిణీ ఆగింది. దీంతో సొంతంగా ఎరువు తయారీ నేర్పించా. ఇది కూడా వారికి ఉపాధి మార్గమైంది. అలాగే ఆర్డర్లు లేక పండించిన పుట్టగొడుగులు వృథా కాకుండా పచ్చళ్లు, అప్పడాలు, కుకీస్‌ వంటివాటి తయారీలో శిక్షణనిచ్చా. చైనా, ఇండోనేషియాల నుంచి మెడిసినల్‌ మష్రూమ్‌లు మనకు దిగుమతి అవుతుంటాయి. వీటి పెంపకాన్ని నేర్చుకొని శిక్షణనిచ్చా. మిగతవాటికన్నా వీటి ధర 5రెట్లు ఎక్కువ. గతంలో ఉపాధి లేనివారంతా నెలకిప్పుడు రూ.15వేల ఆదాయం పొందుతున్నారు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. అలాగే ‘హన్‌ ఆగ్రో కేర్‌’ టర్నోవర్‌ రూ.3 కోట్లు. ‘ఎంటర్‌ప్రైజింగ్‌ ఉమెన్‌ ఆంత్రŸప్రెన్యూర్‌’, ‘మష్రూం లేడీ ఆఫ్‌ ఉత్తరాఖండ్‌’ వంటి 50కిపైగా అవార్డులను అందుకోవడం గర్వంగానూ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్