నాన్న కష్టమే.. నన్ను నడిపించింది

గగన్‌యాన్‌, చంద్రయాన్‌, ఓషన్‌శాట్‌, జీశాట్‌.. ఇలా ఇస్రో ప్రయోగించిన అనేక ఉపగ్రహాలకు కీలకమైన సెన్సార్‌ సాంకేతికతను అందించి శభాష్‌ అనిపించుకున్నారు యండ్రపల్లి విజయ. సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. ఐఐటీలో సీటునీ వదులుకున్నారు.

Updated : 22 Nov 2023 07:10 IST

గగన్‌యాన్‌, చంద్రయాన్‌, ఓషన్‌శాట్‌, జీశాట్‌.. ఇలా ఇస్రో ప్రయోగించిన అనేక ఉపగ్రహాలకు కీలకమైన సెన్సార్‌ సాంకేతికతను అందించి శభాష్‌ అనిపించుకున్నారు యండ్రపల్లి విజయ. సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. ఐఐటీలో సీటునీ వదులుకున్నారు. ఇదంతా ఇస్రో కోసమే అంటారామె. ఆ సంస్థలో తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారు...

దువు ఒక్కటే జీవితాల్ని మార్చగలదని నా నమ్మకం. అందుకోసం ఎంతైనా కష్టపడాలనుకున్నా. మాది కృష్ణాజిల్లాలోని ముదునూరు. నాన్న కొల్లి గంగాధర్‌ రావు కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో పనిచేసేవారు. అమ్మ వెంకట రత్నం. నాన్నది తక్కువ జీతం. మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు. అప్పుడే.. పనిచేస్తే పెద్ద సంస్థలో పనిచేసి, ఆయనకు కష్టం లేకుండా చేయాలనుకున్నా. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జెడ్‌పీహెచ్‌ పాఠశాలలో పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నా. పదో తరగతిలో టాపర్‌గా నిలిచా. మాకు సైన్సు పాఠాలు చెప్పే జయప్రద టీచర్‌ మాటలే నన్ను సైన్స్‌వైపు నడిపించాయి. విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివా. ఆఖరి ఏడాది ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూనే.. గేట్‌ పరీక్షకూ హాజరయ్యా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటొచ్చింది. అక్కడ చేరిన నెల రోజులకే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నుంచి ఉద్యోగానికి ఎంపికైనట్లు ఉత్తరం వచ్చింది. చాలామంది ఐఐటీని వదిలిపెట్టొద్దని సలహాలిచ్చారు. కానీ నేను ఇస్రోకే ఓటేసి.. బెంగళూరులో సెన్సార్లు తయారయ్యే ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌(లియోస్‌ ఇస్రో)లో చేరిపోయా. ఆ తర్వాత కోనికల్‌ స్కానింగ్‌ ఎర్త్‌ సెన్సార్‌ను ఆరునెలల సమయంలో అభివృద్ధి చేశాం. మేం రూపొందించిన ఈ సెన్సార్‌ని పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టులో మొదటిసారి వినియోగించినప్పుడు చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది.

ఐఐటీకి దూరమైనా..

నేను ఖరగ్‌పూర్‌ ఐఐటీలో చదవలేదన్న బాధని మర్చిపోవడానికి.. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఐఐఎస్‌సీలో ఎంటెక్‌ చేశా. ఆ తర్వాత అత్యంత క్లిష్టమైన స్టార్‌ సెన్సార్‌ డిజైనింగ్‌పై దృష్టిపెట్టా. వీటి తయారీ విషయంలో చాలా ఒత్తిడి ఉండేది. కానీ ఆ సవాళ్లను ఇష్టంగా స్వీకరించా. ఆ కష్టానికి ప్రతిఫలంగా మేం తయారుచేసిన సెన్సార్లను ఓషన్‌శాట్‌-3, రీశాట్‌, జీశాట్‌ సిరీస్‌ వంటి కొత్త ఉపగ్రహాల్లో వినియోగించారు. అలాగే ఇస్రో తయారుచేసిన 100వ ఉపగ్రహం మైక్రోశాట్‌ కోసం తక్కువ బరువుతో ఉన్న స్టార్‌ సెన్సార్‌ని తయారుచేశా. ఇదే సెన్సార్‌ పరిజ్ఞానాన్ని చంద్రయాన్‌-3లో వినియోగించారు. త్వరలో చేపట్టనున్న గగన్‌యాన్‌ మిషన్‌లోనూ ఉపయోగించనున్నారు. చంద్రయాన్‌-3లో.. చంద్రునిపై ల్యాండర్‌ను మార్గనిర్దేశం చేసినందుకు మేం సన్‌సెన్సార్లు, స్టార్‌సెన్సార్లు వాడాం. ఈ బృందానికి నేను నాయకత్వం వహించా. అలాగే ఆదిత్య-ఎల్‌1 మిషన్‌లో భాగంగా.. వాడిన మాగ్నెటోమీటర్‌ తయారీలో ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేశాను. గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేయడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం.

అవకాశాలు అందుకుంటూ..

ఇస్రోలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లకూ అవకాశాలున్నాయి. కుటుంబాన్నీ, కెరియర్‌ని సమన్వయం చేసుకోవడం తెలిస్తే ఎవరైనా రాణించొచ్చు. మావారు వెంకట్రావు ఐటీ ఉద్యోగి. మాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దపాప స్విట్జర్లాండ్‌లో నానో టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేసింది. రెండో అమ్మాయి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది.

 దేవేంద్రరెడ్డి కల్లిపూడి, సూళ్లూరుపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్