గాజు మనసు తెలుసు!

విరిగిన మనసుని పగిలిన గాజుతో పోలుస్తాం. నిజమే.. గాజు పైకి ఎంత దృఢంగా కనిపిస్తుందో  అంత నాజూగ్గా ఉంటుంది. అలాంటి గాజుని అర్థం చేసుకుని ‘గ్లాస్‌ ఆర్ట్‌’తో సరికొత్త కళాకృతులను తయారుచేస్తూ విదేశాలకు అందిస్తోంది రేష్మి.

Published : 23 Nov 2023 01:45 IST

విరిగిన మనసుని పగిలిన గాజుతో పోలుస్తాం. నిజమే.. గాజు పైకి ఎంత దృఢంగా కనిపిస్తుందో  అంత నాజూగ్గా ఉంటుంది. అలాంటి గాజుని అర్థం చేసుకుని ‘గ్లాస్‌ ఆర్ట్‌’తో సరికొత్త కళాకృతులను తయారుచేస్తూ విదేశాలకు అందిస్తోంది రేష్మి..

కాలేజీ రోజుల్లో వెళ్లిన ఒక టూర్‌ రేష్మి జీవితాన్ని మార్చేసింది. దిల్లీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేస్తున్నప్పుడు గాజు పరిశ్రమకు పేరుమోసిన ఫిరోజాబాద్‌ వెళ్లింది. ‘అక్కడ గాజుల తయారీ చూశా. చూడటానికి గట్టిగా ఉండే గాజు ఒక ఉష్ణోగ్రత వద్ద మృదువుగా మారి.. కావాల్సిన ఆకృతిలో రావడం నన్ను ఆకర్షించింది. గాజు గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆ అవకాశం మనదేశంలో లేదని తెలిసింది. నేర్చుకోవాలంటే విదేశాలకెళ్లాల్సిందే. అప్పుడే లండన్‌లో ఇంటర్నేషనల్‌ గ్లాస్‌ సెంటర్‌ తరఫున గాజు కళాకృతుల ప్రదర్శన జరుగుతుంటే వెళ్లా. ఆ ప్రదర్శనలో విద్యార్థులతో కలిసి నేనూ నావంతు సాయమందించా. నా ఆసక్తిని గుర్తించిన లండన్‌ విద్యా సంస్థ ఉపకారవేతనాన్ని అందించింది. అలా అక్కడి అంతర్జాతీయ గ్లాస్‌ సెంటర్‌లో హాట్‌ గ్లాస్‌ బ్లోయింగ్‌లో ప్రత్యేక కోర్సు చేశా’నంటోంది రేష్మి.

అవగాహన లేదు..

కొన్నేళ్ల క్రితం వరకూ గ్లాస్‌ ఆర్ట్‌వర్క్‌ గురించి మన దేశంలో పెద్దగా అవగాహన ఉండేది కాదు. తొలిసారి ఆ ప్రయత్నం చేసి గాజు ఆకృతుల తయారీ, విక్రయాలపై పట్టు సాధిస్తోంది రేష్మి. ‘ఫిరోజాబాద్‌లో గాజుకు సంబంధించి తరతరాలుగా వ్యాపారం చేస్తున్న కుటుంబాలను కలుసుకుని చాలా విషయాలు నేర్చుకున్నా. అలాగే అంతర్జాతీయ స్థాయిలో గ్లాస్‌ మాస్టర్‌గా పేరొందిన పీటర్‌ నోవోట్నీ వద్ద ఆధునిక కళా నైపుణ్యాలను తెలుసుకొన్నా. ఈ అనుభవంతో 1999లో ‘మై క్రియేషన్‌’ పేరుతో గాజు కళాకృతుల అమ్మకాలు మొదలుపెట్టా. గాజుతో చేసిన ఆభరణాలు, అలంకరణ లైట్లు.. ఇతర ఆర్ట్‌వర్క్‌ చేసేదాన్ని. వీటికోసం విదేశాల నుంచి ఆర్డర్లు వచ్చేవి. అంతర్జాతీయ ప్రదర్శనల్లోనూ.. నా డిజైన్లని ఉంచేదాన్ని. మరింత పరిజ్ఞానం కోసం అమెరికా, యూరప్‌ సహా ప్రపంచంలోని గాజు మ్యూజియమ్‌లు అన్నింటినీ చుట్టేదాన్ని. కాలిఫోర్నియాలో దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్‌ కోర్సులు కూడా పూర్తిచేసుకుని 2017లో దిల్లీలో ‘గ్లాస్‌ సూత్రా’ ప్రారంభించా. ఇక్కడ ఆసక్తి ఉన్న ఎవరైనా గాజు పాఠాలు వినొచ్చంటోంది రేష్మి.

సవాళ్లు..

‘గాజును కరిగించి దాన్ని అందమైన కళాకృతిగా మార్చడం చాలా కష్టం. ఈ రంగంలో అమ్మాయిలు చాలా తక్కువ. దాంతో అవి నువ్వు చేయలేవు అనేవారు. అలా అనడంతో నాలో పట్టుదల పెరిగింది. ప్రస్తుతం విదేశాల్లోనూ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా’ అనే రేష్మి తయారు చేసే గాజు కళాకృతులకు రాడిసన్‌, లీమెరిడియన్‌ వంటి స్టార్‌ హోటళ్లు, నెక్సా వంటి ఆటోమొబైల్‌ సంస్థలతోపాటు... కార్పొరేట్‌ సంస్థలు, ఆసుపత్రులువంటివన్నీ ఖాతాదారులుగా మారాయి. గాజు కళాకృతులపై రేష్మి పరిశోధనలకుగాను భారతప్రభుత్వం నుంచి ‘సీనియర్‌ ఫెలోషిప్‌’ని అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికా సంస్థ ‘బుల్‌సేయే గ్లాస్‌’లో గాజు గురించిన పాఠాలు చెబుతూ శభాష్‌ అనిపించుకుంటోంది రేష్మి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్