వేల జీవితాల్లో వెలుగుల కోసం..

ఓ టీనేజీ పిల్లాడు డబ్బుల కోసం తెలియని వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపడమే కాదు.. ఆపై మృతదేహం ముందు డ్యాన్స్‌ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. దిల్లీలోనే కాదు.. చిన్న కారణాలకే తోటివారిపై దాడికి దిగుతున్న ఉదంతాలను చూస్తున్నాం.

Updated : 24 Nov 2023 05:45 IST

ఓ టీనేజీ పిల్లాడు డబ్బుల కోసం తెలియని వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపడమే కాదు.. ఆపై మృతదేహం ముందు డ్యాన్స్‌ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. దిల్లీలోనే కాదు.. చిన్న కారణాలకే తోటివారిపై దాడికి దిగుతున్న ఉదంతాలను చూస్తున్నాం. ఈవ్‌టీజింగ్‌లు, వేధింపులు సరేసరి. ఇలాంటివారికి సరైన దిశను చూపిస్తున్నారు. మాకేమీ చేతకాదంటూ నిరాశలోకి కుంగిపోతున్న మహిళలు.. ఒంటరితనంతో బాధపడే పెద్దల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు.. చిన్మయి తమ్మారెడ్డి. అందుకే సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ తనను ఆశ్రయిస్తున్నారు.

మస్యను చూసి బాధపడుతూ కూర్చోను. దాని పరిష్కారం కోసం వెతుకుతూ నన్ను నేను ఆనందంగా ఉంచుకుంటా.. చిన్నప్పటి నుంచీ ఇదే తత్వం. చుట్టూ ఉన్నవాళ్లు బాధపడుతున్నా తట్టుకోలేను. స్కూల్లో ఉన్నప్పుడే స్నేహితురాళ్లతో కలిసి మురికివాడలకు వెళ్లి పరిసరాలు, వ్యక్తిగత శుభ్రతలపై అవగాహన కల్పించేవాళ్లం. ఇలా చేయమని నాకెవరూ చెప్పలేదు. ఇదంతా నాన్న ప్రభావం. నాన్న బాలగంగాధర్‌ నిజామాబాద్‌లోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో పనిచేసేవారు. ఎవరికి సాయం కావాలన్నా కాదనకుండా చేసేవారు. అమ్మ రాణి. స్వస్థలం కృష్ణాజిల్లా అయినా నేను పుట్టి పెరిగింది రుద్రూర్‌లో.

దారి మార్చుకుని..

నాకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలనుండేది. కానీ ఎదుటివారి ఆనందం మరింత సంతృప్తినివ్వడం గమనించి దారి మార్చుకున్నా. బీఏ సైకాలజీ, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, లైఫ్‌ కోచ్‌ కోర్సులు చేశా. అమెరికా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌నీ అందుకున్నా. కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డా. 13 ఏళ్లు ఆపై వయసు వారికి కౌన్సెలింగ్‌ చేస్తా. అమ్మాయిల్ని ఏడిపించడం, దాడి, వెంటపడటం చేసిన టీనేజర్లకు షీటీమ్‌ ‘భరోసా’తో కలిసి కౌన్సెలింగ్‌ ఇచ్చా. వీళ్లలో సానుకూలత నింపి, తిరిగి ఆ మార్గంలోకి వెళ్లకుండా చూశా. నిజానికి వీళ్ల పరిస్థితికి తల్లిదండ్రుల నిర్లక్ష్యమూ కారణమే. అందుకే వారికీ కౌన్సెలింగ్‌ ఇస్తుంటా. వారితో సమయం గడపకపోవడం, మొబైళ్లిచ్చి ఊరుకోవడం, బలవంతంగా తమ ఇష్టాలను రుద్దడం.. చేస్తుంటారు. తీరా వాళ్లు కోరుకున్నట్లుగా సాధించలేకపోతే తిడుతుంటారు. దీంతో ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతిని దేనికీ పనికిరామన్న స్థితిలోకి వెళ్లిపోతారు. ఫలితమే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వగైరా. నేను లైఫ్‌కోచ్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ని కూడా. యువత ఈ స్థితి వరకూ రాకుండా చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి వారితో ఈ చర్యల వల్ల కలిగే నష్టాలు చెప్పడమే కాదు.. ప్రేరణనీ నింపుతున్నా. స్పెషల్‌ ఒలింపిక్‌ భారత్‌తో కలిసి మానసిక సమస్యలున్న పిల్లల కోసం పనిచేస్తున్నా. ఇవేకాదు కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు, టీచర్లు, ప్రొఫెసర్లకు మోటివేషనల్‌ స్పీచ్‌లిస్తుంటా. పదిహేను వేలమంది పోలీసులతోనూ కలిసి పనిచేస్తున్నా.

పెద్దవాళ్లయినా..

ఇల్లు, పిల్లల కోసం కెరియర్‌నీ పక్కన పెట్టేస్తారు మహిళలు. వాళ్లే లోకంగా బతికేస్తారు. తీరా చదువు కోసమని వాళ్లు దూరప్రాంతాలకు వెళ్లగానే ‘నా అస్తిత్వమేం’టన్న సందిగ్ధంలోకి వెళ్లిపోతారు. ఎంతో అనుభవమున్న పెద్దవాళ్లూ పలకరించేవారు లేక కుంగిపోతుంటారు. వీళ్లకోసం ‘రీ డిస్కవరీ, రీఇన్వెంట్‌’ సెషన్లు నిర్వహిస్తుంటా. ఇప్పటివరకూ వేలమందికి కౌన్సెలింగ్‌ ఇచ్చా. అయితే వాళ్ల ఇబ్బందిని దగ్గరుండి చూస్తా కదా.. నా కారణంగా వాళ్ల జీవితాల్లో మార్పు రావడం చూస్తే చాలా సంతృప్తి. అందుకే పెళ్లి కూడా చేసుకోలేదు. నేనెప్పుడూ సలహాలు ఆలోచించి పెట్టుకోను. వాళ్లతో మాట్లాడి, సమస్య తెలుసుకున్నాక.. దానినుంచి బయటపడటానికి నాకు తోచిన, సులువైన మార్గాన్నే సూచిస్తా. కాబట్టే ఇంతమందితో కలిసి పనిచేసే అవకాశమొచ్చింది. సెలబ్రిటీలకూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నా. హిందీ నటి మనీషా కోయిరాలా తన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. క్యాన్సర్‌ బారిన పడ్డాక తెలిసిన వారి ద్వారా నన్ను సంప్రదించారు. ఆవిడకు పదేళ్లుగా కౌన్సెలర్‌గా ఉన్నా. ఈ క్రమంలో అందుకున్న పురస్కారాలూ ఎన్నో.


ఆడవాళ్లు బలహీనులం అనుకుంటారు. ఒక బిడ్డని భూమిమీదకు తీసుకురావడానికి ఎంత నొప్పిని భరిస్తారు? దానిముందు ఏ సమస్య అయినా చిన్నదే. పోల్చుకోవడం, నెగెటివ్‌ ఆలోచనలు పక్కన పెట్టి మీకోసం మీరు ఆలోచించడం, నచ్చింది చేయడం ప్రారంభించండి. అప్పుడే ఆనందంగా సాగగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్