అక్కాచెల్లెళ్లు.. సిరిమంతురాళ్లు!

ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి’ అనొచ్చేమో కానీ.. ఇద్దరు పుట్టారంటే మాత్రం ‘అయ్యో’ అనేవారే ఎక్కువ. అమ్మానాన్నలు ఎంత ధనవంతులైనా.. వారసులంటే మగపిల్లలే! కానీ వీళ్ల విషయంలో అలా కాలేదు. కాబట్టే.. ప్రపంచంలోనే పిన్నవయసు ధనవంతురాళ్లుగా నిలిచారు.

Updated : 25 Nov 2023 12:55 IST

ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి’ అనొచ్చేమో కానీ.. ఇద్దరు పుట్టారంటే మాత్రం ‘అయ్యో’ అనేవారే ఎక్కువ. అమ్మానాన్నలు ఎంత ధనవంతులైనా.. వారసులంటే మగపిల్లలే! కానీ వీళ్ల విషయంలో అలా కాలేదు. కాబట్టే.. ప్రపంచంలోనే పిన్నవయసు ధనవంతురాళ్లుగా నిలిచారు.

కిమ్‌ జంగ్‌ యోన్‌, కిమ్‌ జంగ్‌ మిన్‌.. ఫోర్బ్స్‌ తాజా ‘వరల్డ్స్‌ యంగెస్ట్‌ బిలియనీర్స్‌’ జాబితాలో 2, 4 స్థానాల్లో నిలిచారు. వీరి ఒక్కొక్కరి సంపద విలువ 1.7 బిలియన్‌ డాలర్లు (రూ.14వేల కోట్లకు పైమాటే). వయసు 19, 21 ఏళ్లు. దక్షిణ కొరియాకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ఈ జాబితాలోకి చేరడానికి ప్రధాన కారణం నాన్న వారసత్వమే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థల్లో ఒకటైన నెక్సాన్‌ అధిపతి కిమ్‌ జంగ్‌ జు కూతుళ్లు వీళ్లు. ఆసియాలోని అత్యంత సంపన్నుల్లో ఈయనా ఒకరు. తన సంస్థలో ఇద్దరు కూతుళ్లకూ 31 శాతం వాటాగా ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం, పిల్లల విషయంలోనూ జు గోప్యతను పాటించేవారు. కానీ కూతుళ్లకు వ్యాపారాన్ని మాత్రం పరిచయం చేశారంటారు. అందుకే నేరుగా సంస్థ పగ్గాలు చేజిక్కించుకోకపోయినా ఎదుగుదలలో పాత్ర పోషిస్తున్నారీ అక్కాచెల్లెళ్లు.

కేథరీన్‌, అలెగ్జాండ్రా అండర్సన్‌లు కూడా అక్కాచెల్లెళ్లే! నార్వేకు చెందిన వీళ్లది సంపన్న కుటుంబం. 2016 నుంచీ వీళ్లీ జాబితాలో కొనసాగుతున్నారు. కుటుంబ సంస్థ ‘ఫెర్డ్‌’లో చెరో 42% శాతం వాటా దక్కింది. వాళ్ల నాన్న ఆస్తిని పంచినప్పుడు అంతా ‘వీళ్లు సంస్థను సరిగా ముందుకు నడపలేరేమో’ అన్న అనుమానాన్ని వెలిబుచ్చారు. ఆయన మాత్రం.. ‘మా అమ్మాయిల్లో సత్తా ఉంది. వాళ్లు మాకు దీనిలో ఆసక్తి లేదు.. వేరేది ప్రయత్నిస్తామన్నా ప్రోత్సహిస్తా’నని చెప్పారు. నిజానికి చెల్లెలు అలెగ్జాండ్రాకి గుర్రపుస్వారీ అంటే చాలా ఇష్టం. యూరప్‌లోని టాప్‌ డ్రెసేజ్‌ల్లో (గుర్రపుస్వారీ) ఒకరు. వివిధ ఛాంపియన్‌షిప్‌ల్లో పతకాలూ గెలుచుకుంది. మోడల్‌ కూడా. ఇంత సంపన్నురాలు కదా! అయినా ఈమెకేం కావాలన్నా తను సంపాదించిన దానిలోనుంచే ఖర్చు చేస్తుందట. పొదుపు పాఠాలు చెప్పి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కూడా. ఇక అక్క కేథరీన్‌  సోషల్‌ సైన్స్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసి, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థలో ఇంటర్న్‌షిప్‌, ఫెర్డ్‌లో యువత- నిరుద్యోగం ప్రాజెక్టుపైనా పనిచేసింది. ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థలో సస్టెయినబిలిటీ ఆఫీసర్‌గా చేస్తోంది. ఈ జాబితాలో 1.5 బిలియన్‌ డాలర్ల (రూ.12వేల కోట్లకు పైగా) చొప్పున సంపదతో అలెగ్జాండ్రా ఆరు, కేథరీన్‌ ఎనిమిది స్థానాల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్