ఆమె అడవిని జయించింది!

స్వార్థానికి చిరునామాగా మారి అడవులని నరుక్కుంటూపోతున్న మనిషికి... పచ్చని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు వీళ్లు. అడవిలోని అందాలు.. వన్యమృగాల జీవితంపై అవగాహన తెస్తూ మన దగ్గరకే వసంతాలని మోసుకొస్తున్నారు..  

Updated : 26 Nov 2023 04:27 IST

స్వార్థానికి చిరునామాగా మారి అడవులని నరుక్కుంటూపోతున్న మనిషికి... పచ్చని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు వీళ్లు. అడవిలోని అందాలు.. వన్యమృగాల జీవితంపై అవగాహన తెస్తూ మన దగ్గరకే వసంతాలని మోసుకొస్తున్నారు..  


ప్రకృతిలో పర్యటనలు..

డవులతో 30 ఏళ్ల అనుబంధం శ్రీవారి భారతిది. పర్యావరణం, పులుల సంరక్షణ కోసం ఏదైనా చేయాలన్న తలంపే ఆమెని వైల్డ్‌ వండర్స్‌, వైల్డ్‌ లైఫ్‌ పేరుతో అటవీ పర్యటనలు, రిసార్ట్‌ సేవలు అందించేలా చేసింది... హైదరాబాద్‌కి చెందిన భారతి ఎంకామ్‌ చదువుకున్నారు. భర్త చంద్రశేఖర్‌ శాస్త్రవేత్త. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సెక్రటరీగా సేవలందించారు. బాబు భార్గవ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌. ‘మావారి పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధనల కోసం అమెరికా వెళ్లాం. అటు నుంచి ఇండియాకొచ్చాక మా అబ్బాయిని ఓసారి సరదాగా అటవీ పర్యటనకి తీసుకెళ్లా. వాడు అక్కడ జంతువులని బాగా ఇష్టపడ్డాడు. తర్వాత తనకి ఎప్పుడు సెలవులొచ్చినా అమ్మమ్మ ఇల్లూ, నానమ్మ ఇల్లూ కూడా అరణ్యాలే అయ్యాయి. వాడితో పాటూ నేనూ అడవులపై ప్రేమను పెంచుకుని మనదేశంతోపాటూ ఆఫ్రికా, కెన్యాల్లోని అడవులన్నీ చుట్టొచ్చా. బాబు పెద్దై వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మేం మొదటిసారి పులుల్ని చూడ్డానికి 5 ఏళ్లు పట్టింది. అంత తక్కువగా ఉండేవి. ‘సేవ్‌ ద టైగర్స్‌’ నినాదం నా మనసులో నాటుకుపోయింది. నా అనుభవంతో.. కొంతమందికైనా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఒక రిసార్ట్‌ కట్టాలనుకున్నా. ఇందుకోసం మహారాష్ట్రలోని తడోబాలో కొంతస్థలం కొన్నా. కానీ అక్కడ అనుమతులు రాకపోవడంతో మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయపార్కుకి దగ్గరగా వైల్డ్‌ లైఫ్‌ పేరుతో రిసార్టునీ, వైల్డ్‌ వండర్స్‌పేరుతో టూర్స్‌ని మొదలుపెట్టాం. అటవీ పర్యటనలు ఖరీదైనవి. అందుకే దేశంలో ఎక్కడికైనా తక్కువ ధరకే పర్యటించేలా రాయితీలిచ్చి, ప్యాకేజీలు అందిస్తున్నాం. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు, పర్యటకులకు అనుకూలంగా మా రిసార్ట్‌ని తీర్చిదిద్దా. అడవుల్లో నేచర్‌ వాక్స్‌, ట్రెక్కింగ్‌, గ్రామాలకు పర్యటనలు ఏర్పాటు చేశా. ఇంతవరకూ 60 పర్యటనలు చేపట్టాం. సెలబ్రిటీలను తీసుకొచ్చాం. ఎక్కువమంది విదేశీయులొస్తుంటార’ని చెబుతున్నారు భారతి.


అమ్మాయిలు పనికిరారంటే..

‘మీలా నేచురలిస్ట్‌, ఫారెస్ట్‌ గైడ్‌ అవ్వాలంటే నేనేం చేయాలి?’ ఈ ప్రశ్న అడిగిన రత్నను చూసి ఆ గైడ్‌లు నవ్వడమే కాదు.. ‘అడవుల్లో అమ్మాయిలకేం పని? చూసి ఆనందించండి! ఇలాంటి పనులకు మీరు పనికిరార’న్నారు. అది విన్న రత్నాసింగ్‌కు బాధేసింది. తనది మధ్యప్రదేశ్‌లోని బాందవ్‌గఢ్‌ నేషనల్‌ పార్క్‌ దగ్గర కుగ్రామం. చదువంతా బోర్డింగ్‌ స్కూల్‌, దిల్లీల్లో సాగింది. హిస్టరీ (ఆనర్స్‌)లో డిగ్రీ, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ రెఫ్యూజీ లాస్‌ల్లో పీజీ డిప్లొమా పూర్తయ్యాక వివిధ సంస్థల్లో ఉద్యోగమూ చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పైచదువులు చదివే అవకాశం కూడా వచ్చింది. కానీ ఇకనైనా ఇంటికి దగ్గర్లో ఉండాలన్నది ఆమె ఆశ. జంతువులంటే ప్రాణమిచ్చే రత్నకు తాజ్‌ సఫారీ శిక్షణ ప్రోగ్రామ్‌ గురించి తెలిసి, చేరారు. పూర్తయ్యాక పన్నా టైగర్‌ రిజర్వ్‌లో నేచురలిస్ట్‌గా కెరియర్‌ ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారుచేసిన జీపులో సందర్శకులను తీసుకెళ్లి, జంతువులను చూపించడం, వాటి గురించి వివరించడమే కాదు.. వన్యమృగాల సంరక్షణ వగైరా తన బాధ్యతలు. ‘తొలిరోజుల్లో అటవీ ప్రాంతాల్లోని ప్రజలే కాదు.. సహోద్యోగులూ విచిత్రంగా చూసేవారు. కొద్దిరోజుల్లోనే వెళ్లిపోతానని భావించారు. సందర్శకులూ వన్యమృగాలను చూసి భయపడతానేమోనని అనుమానించేవారు. కానీ త్వరగానే వాళ్ల అనుమానాలన్నీ పటాపంచలు చేశా. అప్పుడు సమానంగా చూడటం మొదలుపెట్టా’రంటారు రత్న. కన్హా రిజర్వ్‌కి మారాక ఎంతోమంది పాఠశాల విద్యతో ఉద్యోగాలు రాని అమ్మాయిలను చూశారు. తను చేయగలిగినప్పుడు మిగతావారూ చేయగలరని నమ్మి వారికి శిక్షణివ్వడం మొదలుపెట్టారు. ఈమె సేవలు గుర్తించి అటవీ శాఖ ఆమె ఆధ్వర్యంలో కోర్సును ప్రారంభించింది. అటవీ ప్రాంతాల వారిని టూర్‌ గైడ్‌, సఫారీ డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌గా వేలమందిని తయారుచేసిన రత్న.. దేశంలో తొలి మహిళా నేచురలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తమ నేచురలిస్ట్‌ సహా పలు పురస్కారాలు అందుకొన్నారు.


వన్యప్రాణుల కోసం ఏడు ఖండాలు చుట్టి..

డవుల్లో... రక్తం కూడా గడ్డకట్టే చలిలో.. 10కేజీల బరువున్న కెమెరాతో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు సిమ్రాన్‌గిల్‌.. ముంబయిలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ చదివి, జర్నలిస్ట్‌గా తన కెరియర్‌ని ప్రారంభించింది సిమ్రాన్‌. స్నేహితుడి నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్‌ ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ‘తను ప్రారంభించే వైల్డ్‌ లైఫ్‌ ఛానెల్‌కు వన్యమృగాల వీడియోలు తీయాలంటే నేనొప్పుకొన్నా. అలా 2016లో మా ‘జిప్సీ టైగర్‌’ వైల్డ్‌లైఫ్‌ ఛానెల్‌ మొదలైందంటా’రీమె. స్నోఘోస్ట్‌ అని పిలిచే మంచు చిరుతలపై డాక్యుమెంటరీ తీయడానికి మొదటిసారి సిమ్రాన్‌ లద్దాఖ్‌ వెళ్లారు. రోజులు గడిచినా ఆ చిరుతలు కనిపించలేదు. ‘అమ్మానాన్నలకు ఫోన్‌ చేయడానికి నెట్‌వర్క్‌ లేదు. నెలరోజుల తర్వాత ఫోన్‌లో నాన్న గొంతు విని, ఇంకెప్పుడూ ఈ సాహసం చేయనని భోరుమన్నా. కానీ నాన్నమాత్రం ‘ఏకాగ్రతతో ప్రయత్నించ’మని సలహా ఇచ్చారు. ఈ వృత్తిలో అందరూ రిస్క్‌ ఉందని అంటే, అమ్మానాన్న మాత్రం ప్రోత్సహించారు. ఒక్కోసారి తిండికూడా దొరకదు. పగలూరాత్రి ఓపిగ్గా ఎదురుచూడాలి. తీరా వన్యప్రాణి మన కెమెరా లెన్స్‌లో చిక్కితే ఆ ఆనందమే వేరు. ఈ అనుభవంతో ‘ఫిల్మ్‌ ట్రోటర్స్‌ మీడియా’ సంస్థని ప్రారంభించా. కెనాన్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌నయ్యా. ఈ ఏడేళ్లలో ఏడు ఖండాలు చుట్టా’నని చెప్పే సిమ్రాన్‌ 3 డిగ్రీల ఉష్ణోగ్రతలో అలస్కా, మైనస్‌ 20 డిగ్రీల చలిలో అంటార్కిటిక, దక్షిణధ్రువంలో రోజులు తరబడి ఎదురుచూసి చిరుత, పులి వంటి వన్యప్రాణులపై డాక్యుమెంటరీలెన్నో తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్