వాళ్లు చెప్పిన సంద్రపు కథలు!

సముద్రంలో చేపల వేటకెళ్లిన కుప్పుస్వామి.. పొరపాటున తీరం దాటి శ్రీలంక నావికాదళానికి దొరికిపోయాడు. చావు నుంచి బయటపడ్డా ఆ తర్వాత అతనెప్పుడూ వేటకి వెళ్లలేదు.

Published : 28 Nov 2023 02:16 IST

సముద్రంలో చేపల వేటకెళ్లిన కుప్పుస్వామి.. పొరపాటున తీరం దాటి శ్రీలంక నావికాదళానికి దొరికిపోయాడు. చావు నుంచి బయటపడ్డా ఆ తర్వాత అతనెప్పుడూ వేటకి వెళ్లలేదు. ఎందుకు? తెలియాలంటే తమిళనాడు మత్య్సకార మహిళలు అతనిపై తీసిన షార్ట్‌ఫిల్మ్‌ చూడాల్సిందే. ఇదేకాదు ఎన్నో సంద్రపు కథలని తమ కెమెరాతో బంధించారు వీళ్లు...

అంతూదరీ లేని సంద్రం.. దాంతో నిత్యం ఊసులాడే మత్య్సకార కుటుంబాలు. వాళ్లకి మాత్రమే సొంతమైన ఆ అపురూప అనుభవాలు ప్రపంచానికీ తెలియాలన్న ఉద్దేశంతో.. అక్కడి మత్య్సకార మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ ఇచ్చింది దక్షిణ్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ. గతేడాది చెన్నైలో శిక్షణ ఇచ్చి.. అక్కడి మహిళలు తీసిన ఫొటోలను ‘రీఫ్రేమ్డ్‌’ పేరుతో ప్రదర్శించిందీ సంస్థ. అలా తమిళనాడులోని నాగపట్నం తర్వాత ఒడిశాలోని గంజాం ప్రాంత మహిళలూ ఈ శిక్షణ అందుకున్నారు. వాళ్లలో మహాలక్ష్మి, పూంగొడి, మంజమాత, సుగంధి, భారతి, పరిమళ తన అనుభవాలని పంచుకున్నారు.

భయపడ్డా..

‘మాది సెరుత్తూరు గ్రామం. మొదటిసారి కెమెరాను చేతిలోకి తీసుకోవడానికి భయపడ్డా. కెమెరా అంటే ఏంటో తెలీదుమరి. దాన్ని పట్టుకుని ఊళ్లోకి వెళ్తే అందరూ ప్రశ్నలతో ముంచెత్తేవారు. కొందరైతే లాక్కోవడానికి చూసేవారు. మొదట భయపడినా.. ఆ తర్వాత ఎవరేం అడిగినా సమాధానం చెప్పే ధైర్యం వచ్చింది. ఎవరినైనా ఫొటో తీయాలంటే వారితో ముందుగా ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకొన్నా. క్రమేపీ మా పరిసరాల్లో కనిపించే సమస్యలూ, మేం ఎదుర్కొనే ఇబ్బందులను కెమెరాలో బంధించడం మొదలుపెట్టా. ఆ అనుభవంతో షార్ట్‌ఫిల్మ్‌లని తీయడంలోనూ శిక్షణ పొందా. చేపల వేటలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న మా ఊరి కుప్పుస్వామిపై ఒక సిరీస్‌ తీస్తున్నా. 1990లో ఆయన వేటకెళ్లినప్పుడు తమిళనాడు తీరం దాటాడని శ్రీలంక నావికాదళం ఆయనపై కాల్పులు జరిపింది. తప్పించుకొని బయటపడినా, ఒంటినిండా గాయాలే. దాంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడి అనుభవాలను చెప్పిస్తూ... అతని జీవనశైలిపైనే సిరీస్‌ చేస్తున్నా. చేపల్ని వేటాడి తెచ్చేది మగవాళ్లే. ఆ తర్వాత అమ్మాల్సినదంతా మేమే. అందుకే నాలాంటి మహిళల జీవిత చిత్రాలను కెమెరాలో బంధిస్తున్నా’ అంటున్నారు పూంగొడి. 

ఆత్మవిశ్వాసంతో..

కెమెరాను ఉపయోగించడంలో శిక్షణ పొంది, ఫొటోలు తీయడం మొదలుపెట్టిన తర్వాత ఈ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందంటారు వీళ్లకు శిక్షణ ఇచ్చిన పళనికుమార్‌. ‘తమ రోజువారీ జీవితంలోని అనుభవాలని ఫొటోలుగా తీసి వాట్సాప్‌ గ్రూపులో వేస్తే నేను వాటిని పరిశీలిస్తుంటా. మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన సూచనలు ఇస్తుంటా. జాలర్ల జీవనశైలి, వలసలు, సముద్రపు ఒడ్డు కోతకు గురై కూలిపోయే నివాసాలు వంటివన్నీ థీంలుగా ఎంచుకుని వీరంతా ఫొటోలు, డాక్యుమెంటరీలుగా తీయగలుగుతున్నారు. వీరెదుర్కొంటున్న సమస్యలనూ వాటిలో సృజనాత్మకంగా చూపిస్తున్నారు. తమ సమస్యలను ఫొటోల ద్వారా వెలుగులోకి తీసుకురాగలుగుతున్నారు. త్వరలో చెన్నైలో వీరు తీసిన చిత్రాలని ప్రదర్శిస్తాం అంటున్నారు పళనికుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్