మహిళలు ఏకమైతే... అద్భుతాలే చేయొచ్చు!

శ్రమశక్తిలో స్త్రీల వాటా ఎంత ఎక్కువున్నా... నాయకత్వ స్థాయికి చేరే వారి సంఖ్య అరుదు. అలాంటి వారిలో భారత సంతతికి చెందిన కె. ధనలక్ష్మి ఒకరు. సింగపూర్‌లోని జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య(ఎన్టీయూసీ)అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

Updated : 29 Nov 2023 01:54 IST

శ్రమశక్తిలో స్త్రీల వాటా ఎంత ఎక్కువున్నా... నాయకత్వ స్థాయికి చేరే వారి సంఖ్య అరుదు. అలాంటి వారిలో భారత సంతతికి చెందిన కె. ధనలక్ష్మి ఒకరు. సింగపూర్‌లోని జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య(ఎన్టీయూసీ)అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆమె ప్రయాణాన్ని తెలుసుకుందామా!

‘నాయకత్వం ఒకరిచ్చేది కాదు.. మనం తీసుకోవాల్సింది’ అంటారు ధనలక్ష్మి. భారత సంతతికి చెందిన ఆమె 1966లో సింగపూర్‌లో పుట్టారు. ధనలక్ష్మి ఇంగ్లండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఆఫ్‌ సైన్స్‌ (ఆనర్స్‌)లో పట్టా పొందారు. తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో హెల్త్‌ సైన్స్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేశారు. చదువయ్యాక ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టారు. 26 ఏళ్లుగా సీనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో సింగపూర్‌ ప్రజా ఆరోగ్య సంరక్షణ విభాగంలో సేవలందిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచే వివిధ కార్మిక సంఘాల్లో చురుగ్గా పనిచేశారీమె.

1998లో నేషనల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ ‘ఎంప్లాయీస్‌ యూనియన్‌’ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఈ సంస్థ సింగపూర్‌ హెల్త్‌ కార్పొరేషన్‌లో విలీనం అవ్వడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ విజయం 2006లో ‘హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌ఎస్‌ఈయూ) ఏర్పడటానికి దారి తీసింది. 2011 నుంచి దీనికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారీమె. 2015లో నేషనల్‌ ట్రేడ్స్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఎన్‌టీయూసీ) కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తర్వాత ఉపాధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ సంస్థ మహిళా కమిటీతో పాటు మరెన్నో విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాదు, 2016లో సింగపూర్‌ లేబర్‌ ఉద్యమం నుంచి పార్లమెంటుకి నామినేట్‌ అయ్యి.. 2016 నుంచి 2018 వరకూ సభ్యురాలిగా పనిచేశారు. కార్మికుల వేతనాలు, సంక్షేమం, పని అవకాశాలను మెరుగుపరచడం వంటివి లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. ముఖ్యంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించడానికీ, పని వాతావరణంలో లింగసమానత్వం సాధించడానికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఈమె కీలకంగా ఉన్నారు. ఈ ప్రయత్నాలే ఆమెను జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య(ఎన్టీయూసీ) అధ్యక్షురాలిగా గెలిచేలా చేశాయి. ఈ ఎన్నికల్లో యాభై అనుబంధ సంఘాల నుంచి 450 మంది ప్రతినిధులు రహస్య బ్యాలెట్‌ విధానంలో ఓట్లు వేశారు. నాలుగేళ్లపాటు అధ్యక్ష పదవిలో ఉంటారీమె. ‘మంచి పని చేయాలన్న ఆలోచన ఉంటే చాలు... మార్పు అదే వస్తుంది. ఓర్పు, నేర్పు ఎక్కువగా ఉండే మహిళలు కలసికట్టుగా అడుగులు వేస్తే...అద్భుతాలెన్నో చేయగలరు’ అంటారు ధనలక్ష్మి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్