బతుకు పాఠాలు నేర్పే.. మీనాక్షి డ్రైవింగ్‌ స్కూల్‌!

చిన్న కష్టం రాగానే... వెనక్కి తగ్గుతాం! వైఫల్యం ఎదురవ్వగానే.. మనవల్ల కాదనుకుంటాం.. మీనాక్షి అలాకాదు. కష్టాల కొలిమిలో పదునుతేలారు. వైఫల్యాలని నిచ్చెన మెట్లుగా మార్చుకుని తనేంటో నిరూపించుకున్నారు.

Updated : 29 Nov 2023 06:43 IST

చిన్న కష్టం రాగానే... వెనక్కి తగ్గుతాం! వైఫల్యం ఎదురవ్వగానే.. మనవల్ల కాదనుకుంటాం.. మీనాక్షి అలాకాదు. కష్టాల కొలిమిలో పదునుతేలారు. వైఫల్యాలని నిచ్చెన మెట్లుగా మార్చుకుని తనేంటో నిరూపించుకున్నారు. ఆమెకొచ్చిన డ్రైవింగ్‌ విద్యను వేలమంది మహిళలకు నేర్పించి.. వాళ్లలో ధైర్యాన్ని నింపుతున్నారు. తన కథని మనతో పంచుకున్నారు..  

మాది అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ. దిగువ మధ్య తరగతి కుటుంబం. ముగ్గురు అక్కాచెల్లెళ్లం. ఒక తమ్ముడు. వాళ్లని చూసుకోవడానికి ఐదో తరగతి పూర్తవ్వగానే ఇంట్లో నా చదువు మాన్పించారు. పెళ్లి అంటే ఏంటో అర్థం కూడా తెలియని 12 ఏళ్ల వయసులోనే నా మెళ్లో మూడు ముళ్లూ పడ్డాయి. ఇద్దరు పిల్లలు.. వంశీకృష్ణ, వంశీ ప్రియ. పాపకి ఆరునెలలు ఉండగా.. ఆయన మాకు దూరమయ్యారు. దాంతో కుటుంబ భారం నాపై పడింది. బట్టలుతికి పిల్లలను సాకేదాన్ని. కానీ ఎన్నాళ్లిలా? వాళ్ల భవిష్యత్తూ నాలానే ఉంటుందా? ఆ ఆలోచన రాగానే డీఆర్‌డీఏ వాళ్లు కుట్టుమిషన్‌, బ్యుటీషియన్‌, జ్యూట్‌ వర్క్‌లు నేర్పిస్తున్నారని తెలిసి వెళ్లాను. కొద్ది రోజులు నేర్చుకుని వదిలేశా. డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకున్నా. అప్పటికి మా ఊరి ఆడవాళ్లకి అది చేతకాని విద్యే. నేను నేర్చుకుందామనుకుంటే కనీసం ఎనిమిదైనా చదివితే శిక్షణ ఇస్తాం అన్నారు. కానీ నేను ఐదు వరకే చదివా. అందుకని మా ఊళ్లోని ఆర్డీటీ సంస్థ రాత్రి బళ్లు పెట్టిందని తెలిసి అక్కడ చదువుకున్నా. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేసుకుని, డ్రైవింగ్‌ లైసెన్సు పొందా. చదువుకుంటే విలువ ఉంటుందని ఓపెన్‌లో 10వతరగతి పూర్తి చేశా.

అలా నిరూపించుకున్నా..

లైసెన్స్‌ తీసుకొని 8 నెలలు అయినా నేను డ్రైవింగ్‌ చేస్తానంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఉపాధి చూపించమని ఆర్డీటీ వాళ్లనే అడిగితే.. వాళ్ల ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్‌ని కలవమన్నారు. ఇంతవరకూ ఇక్కడ ఆడవాళ్లు పనిచేయలేదు. ఏమైనా జరిగితే మేం బాధ్యులం కాదన్నారు. కనీసం గరాజ్‌లో ఏదైనా చిన్న పని చేద్దామన్నా అక్కడా ఆడవాళ్లు ఉండరన్నారు.

నేను పట్టు వదలకపోయేసరికి ఓ పరీక్ష పెట్టారు. ఓ కొత్తకారు చూపించి.. డ్రైవ్‌ చేయమన్నారు. పాత డొక్కు జీపు నేర్చుకున్న నాకు దాన్ని చూడగానే భయం వేసింది. ధైర్యం చేసి పంగల్‌ రోడ్డు నుంచి రాప్తాడు రైల్వే గేటు వరకూ తీసుకెళ్లా. కానీ గేర్‌ మార్చలేకపోయా. దాంతో ఇంజిన్‌ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వచ్చేశాను. ఇక ఉద్యోగం రాదనే దిగులుగా వెళ్లా... కానీ మర్నాడు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. నీ ధైర్యం చూసి ఇచ్చాం కానీ ప్రాక్టీస్‌ అవసరమన్నారు. నెలకు రూ.3600 జీతం. చాలా సంతోషంగా అనిపించింది. అంతవరకూ పోషించలేక..  పిల్లల్ని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంచా మరి. కానీ ఈ ఉద్యోగం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. అప్పటివరకూ నాకు లైట్‌ మోటారు వెహికల్‌ లైసెన్స్‌ మాత్రమే ఉండేది. నెమ్మదిగా హెవీ లైసెన్స్‌నీ సాధించా. చదువుని కూడా ఆపలేదు.

వేలమందికి పాఠాలు..  

ఆ సంస్థలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూనే.. తోటి ఆడవాళ్లకీ ఈ విద్య నేర్పాలనుకున్నా. చాలామంది ఉత్సాహంగా ముందుకొచ్చారు. 2016లో సొంతంగా డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశా. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ ఇచ్చి, లైసెన్సు ఇప్పించా. చాలామందికి ఉచితంగానూ నేర్పించాను. ఇప్పటివరకూ 3500మందికి నేర్పించా. రోజుకు ఐదు చొప్పున ఒక్కొక్క బ్యాచ్‌కూ నెల రోజులు శిక్షణ ఇస్తా. ఉత్తమ మహిళా డ్రైవర్‌గా రెండుసార్లు అవార్డు అందుకున్నా. మా పాపతోపాటే నేనూ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుకున్నా. తను ఎంసీఏ చేసింది. బాబు ఐటీఐ చదివి ఉద్యోగం చేస్తున్నాడు. ఓపిక ఉన్నంతవరకూ నాకు తెలిసిన విద్యని మహిళలకు నేర్పి వాళ్లలో ధైర్యం నింపాలన్నదే నా కల.

గొరవ గోపాల్‌, అనంతపురం


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్