ప్లాస్టిక్‌ కష్టాలు చూసి.. ఈ సంచులు చేస్తున్నా!

విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్నా.. స్వదేశంలో ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆమెని వ్యాపారవేత్తని చేసింది.  భూమిలో  తేలిగ్గా కలిసిపోయే సంచులు తయారుచేస్తూ తోటి మహిళలకూ శిక్షణ ఇస్తున్నారు శ్రీరామినేని రమణి... ఈ విశేషాలను మనతో పంచుకున్నారామె...

Updated : 02 Dec 2023 05:41 IST

విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్నా.. స్వదేశంలో ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆమెని వ్యాపారవేత్తని చేసింది.  భూమిలో  తేలిగ్గా కలిసిపోయే సంచులు తయారుచేస్తూ తోటి మహిళలకూ శిక్షణ ఇస్తున్నారు శ్రీరామినేని రమణి... ఈ విశేషాలను మనతో పంచుకున్నారామె...

చిన్నతనం నుంచి వ్యవసాయాన్నీ చూస్తూ పెరిగా. అందుకే రైతుల కష్టాలు నాకు తెలుసు. ప్రకాశం జిల్లాలోని మామిళ్లపల్లి మాది. తిరుచ్చిలోని భారతీదశన్‌ విశ్వవిద్యాలయంలో ఐటీలో ఎమ్మెస్సీ చేశా. మావారు డాక్టర్‌ ప్రసాద్‌ ఎమర్జెన్సీ ఫిజీషియన్‌. ఇద్దరబ్బాయిలు సాయిసాత్విక్‌, సాయినితిన్‌. వాళ్లు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మానాన్నల దగ్గర వదిలి... మావారి ఉద్యోగరీత్యా సౌదీ అరేబియా వెళ్లా. ఆయన ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించేవారు. నేను రియాద్‌లోని ప్రిన్సెస్‌ నోరా విశ్వవిద్యాలయంలో సిస్కో నెట్‌వర్క్‌ సీనియర్‌ సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా 13 ఏళ్లు పని చేశాను. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక వాళ్లకోసమని నేను మనదేశానికి తిరిగొచ్చేశా. రియాద్‌లో ఉండగా అక్కడి తెలుగువాళ్లతో ఆత్మీయ సమావేశాలు ఎక్కువగా జరిగేవి. అప్పుడు నేను వండిన వంటలని అంతా మెచ్చుకొనేవారు. దాంతో హైదరాబాద్‌లో ‘తాజా టేస్ట్‌’ పేరుతో కమర్షియల్‌ కిచెన్‌ ప్రారంభించా. రెండేళ్లు బాగా నడిచింది. కానీ కొవిడ్‌ కారణంగా మూసేయాల్సి వచ్చింది. మావారు కూడా ఇండియాకు వచ్చేశారు. .

కిడ్నీ దానం చేశా...

ఇక్కడికొచ్చాక ఆయన అనారోగ్యంగా ఉండడంతో.. ఆరోగ్య పరీక్షలు చేయించాం. రెండు కిడ్నీలు చెడిపోయాయని తేలింది. డయాలసిస్‌ చేయించాల్సి వచ్చేది. కొవిడ్‌ కావడంతో.. మాకష్టం రెట్టింపయ్యింది. దాంతో నేనే ముందుకొచ్చా. కిడ్నీ మార్పిడి తర్వాత ఇద్దరం కలిసి సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకున్నాం. గమనిస్తే.. ఉదయం కొనే పాల ప్యాకెట్‌, కిరాణా సరకులు తీసుకొచ్చే సంచీ ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ మమ్మల్ని కలవరపరిచింది. ఆకలితో ఉన్న మూగజీవాలు ప్లాస్టిక్‌ సంచుల్లో మూటగట్టి పారేసిన ఆహారాన్ని సంచీతో పాటు తిని జీర్ణం కాక ప్రాణాలు కోల్పోతుండటం చూసి బాధేసింది. దీనికి ప్రత్యామ్నాయం కోసం వెతికి.. డీఆర్‌డీవో శాస్త్రవేత్తల్ని కలిశా. భూమిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్‌ సంచుల పరిజ్ఞానం గురించి లోతుగా తెలుసుకున్నా. అక్కడి సీనియర్‌ శాస్త్రవేత్తల సాయంతో భూమిలో కలిసిపోయే ఈ సంచుల తయారీ మొదలుపెట్టా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మల్కాపురంలో ‘బయో కంపోస్టికా- ప్రకృతి నుంచి మట్టిలోకి’ పేరుతో ఉత్పత్తులు తీసుకొచ్చా. మేమిక్కడ మొక్కజొన్న పిండితో.. ప్లాస్టిక్‌ కంటే దృఢంగా ఉండే సంచులు తయారుచేస్తున్నాం. అయితే ఇవి 120 రోజుల్లోనే భూమిలో కరిగిపోయి భూమికి ఎరువుగా మారతాయి. నీళ్లలో అంతకంటే తక్కువ సమయంలోనే కరిగిపోతాయి.

రైతులకూ మేలు చేయాలని...

రూ.70 లక్షల పెట్టుబడితో యంత్రాలను కొనుగోలు చేసి బయోడిగ్రేడబుల్‌ సంచులు ఉత్పత్తి చేస్తున్నా. మొక్కజొన్న పిండి, బయో పాలిమర్‌ను కలిపి 100 గ్రాముల నుంచి 25 కిలోల వరకు బరువు మోయగల క్యారీ బ్యాగులు, షాపింగ్‌, టెక్స్‌టైల్‌, గ్రాసరీ, గార్బేజ్‌ బ్యాగులు, ఎన్వలప్‌లు తయారు చేస్తున్నాం. వీటితో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ షీట్లు, పొలంలో కలుపు మొక్కలు రాకుండా పరిచే మల్చింగ్‌కి, పాలు, నూనె ప్యాకెట్ల తయారీకి ఉపయోగించే షీట్లు, నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఉపయోగించే నల్లని సంచులూ తయారు చేస్తున్నాం. మొక్కజొన్న పిండిని గుజరాత్‌ నుంచీ, బయో పాలిమర్‌ని విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం మా పరిశ్రమలో 30 మందికి ఉపాధి లభిస్తోంది. ముడిసరకు కొనుగోలుతో మొక్కజొన్న పండించే రైతులకూ మేలు జరుగుతుంది. 


ఆసక్తి ఉంటే శిక్షణ...

కొద్దిపాటి చదువుండి, ఇంటి పట్టున ఉండే మహిళలూ ప్లాస్టిక్‌ సంచుల ప్రెస్సింగ్‌, కటింగ్‌ చేసి ఆదాయాన్ని అందుకోవచ్చు. ఇందుకోసం కొద్దిపాటి పెట్టుబడి చాలు. నామమాత్రపు రుసుముతో అందుకు అవసరమైన శిక్షణనీ, ముడి సరకునీ సరఫరా చేస్తాం.  ప్రస్తుతం మా పెద్దబ్బాయి ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌, చిన్నబ్బాయి ఎంబీబీఎస్‌ చదువుతున్నారు.

సూరపల్లి రఘుపతి, చౌటుప్పల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్