సోమాలియా దొంగల్ని తరిమేశా...

ప్రేరణ స్వస్థలం ముంబయి. అక్కడి జేవియర్‌ కళాశాలలో సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. దేశానికి సేవ చేసేందుకు 2009లో నేవీలో చేరారు. పురుషులతో సమానంగా 6-7 నెలల కఠిన శిక్షణ పొందారు. ప్రస్తుతం నేవల్‌ ఏవియేషన్‌లో నావిగేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా రాణిస్తున్నారు. నౌకాదళంలో కొత్తగా చేరినవారిని ఫ్రంట్‌లైన్‌ యూనిట్లలో పనిచేసేందుకు తీర్చిదిద్దుతున్నారు.

Published : 04 Dec 2023 01:21 IST

బాల్యంలో విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు చూసి ఆ రంగంపై ఇష్టం పెంచుకున్నారామె. కృషి, పట్టుదలతో ఎంతో కష్టపడి భారత నౌకా దళంలో చేరారు. తాజాగా యుద్ధనౌకకు నాయకత్వం వహించే బాధ్యత తీసుకున్నారు. ఆమే లెఫ్టినెంట్‌ కమాండర్‌ ప్రేరణ ప్రవీణ్‌ దేవస్థలి...

2000 సెప్టెంబరులో నేవీలో చేరిన ఐఎన్‌ఎస్‌ ట్రింకట్‌లో దాదాపు 50 మంది విధులు నిర్వర్తిస్తారు. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని ఓ ద్వీపం పేరును ఈ నౌకకు పెట్టారు. అందులో యాంటీ సర్ఫేస్‌, యాంటీ ఎయిర్‌గన్‌లు, మీడియం, హెవీ మెషిన్‌ గన్‌లు అమర్చారు. అధిక వేగంతో తక్కువ లోతులో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం.

ప్రేరణ స్వస్థలం ముంబయి. అక్కడి జేవియర్‌ కళాశాలలో సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. దేశానికి సేవ చేసేందుకు 2009లో నేవీలో చేరారు. పురుషులతో సమానంగా 6-7 నెలల కఠిన శిక్షణ పొందారు. ప్రస్తుతం నేవల్‌ ఏవియేషన్‌లో నావిగేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా రాణిస్తున్నారు. నౌకాదళంలో కొత్తగా చేరినవారిని ఫ్రంట్‌లైన్‌ యూనిట్లలో పనిచేసేందుకు తీర్చిదిద్దుతున్నారు. నేలపై, గాలిలోనూ శిక్షణిస్తున్నారు. ఒక మిషన్‌ చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం నుంచి లక్ష్యం సాధించేవరకు ఎలా పనిచేయాలో బోధిస్తున్నారు. విధుల్లో చేరిన నాటి నుంచి ఫ్రంట్‌లైన్‌ యూనిట్లలో మెరుగ్గా పనిచేస్తున్నారు. కొచ్చిలో నేవిగేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, గూడఛారి విమానం పీ8ఐలో, యుద్ధ విమానం తుపోలెవ్‌ టీయూ- 142లో మొదటి మహిళా పరిశీలకురాలిగా పనిచేశారు.

ఎంత కష్టమైనా సరే!

ప్రస్తుతం ఐఎన్‌ఎస్‌ చెన్నైలో లెఫ్టినెంట్‌గా ఉన్నారు. తాజాగా వాటర్‌జెట్‌ ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ ట్రింకట్‌ (యుద్ధనౌక)కు కమాండింగ్‌ అధికారిగా ఎంపికయ్యారు. ‘‘2010లో మన వ్యాపార నౌకపై సోమాలియా వద్ద సముద్ర దొంగలు దాడి చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని దాడి చేయడంతో వారు పారిపోయారు. విధుల్లో చేరిన కొత్తలో అలాంటి దాడిని అడ్డుకోవడం నాకే గర్వంగా అనిపించింది. విధి నిర్వహణలో ఒక్కోసారి 9 గంటలు నిర్విరామంగా ప్రయాణించాల్సి వస్తుంది. అదే సమయంలో కమాండ్‌ కంట్రోల్‌కు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారం అందిస్తుండాలి. ఈ ఉద్యోగంలో రాణించడం అంత సులువేం కాదు. కానీ, చేయాలనుకున్నప్పుడు ఎంత కష్టమైనా భరించాలనే తత్వం నాది. అందుకే ఎంతో ఆసక్తిగా ఈ ఉద్యోగంలో చేరా. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉంటా. చిన్నప్పటి నుంచీ ఇంట్లోవాళ్లు నా అభిప్రాయాలకు విలువనిచ్చి ప్రోత్సహించారు. అందుకే, నేనెక్కడా వెనుదిరిగి చూడలేదు. మావారు రోహన్‌ నేవీ అధికారి. మూడేళ్ల పాప ఆలనాపాలనా కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడంలోనూ ఆయన సహకారం ఎంతో’ అంటూ చెప్పుకొచ్చారామె.

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్