సైనికుడితో పోటీపడి.. కోట్లమందిని ఆకర్షించింది!

కశ్మీర్‌.. దేశ సరిహద్దు ప్రాంతం. మోకాలి లోతున దిగబడే మంచు. అలాంటి పరిస్థితుల్లో పుషప్స్‌ తీశారు నేహా గులాటీ. దానికో సందేశాన్ని జోడించి.. కోట్ల మందిని ఆకర్షించారు.

Published : 05 Dec 2023 01:29 IST

కశ్మీర్‌.. దేశ సరిహద్దు ప్రాంతం. మోకాలి లోతున దిగబడే మంచు. అలాంటి పరిస్థితుల్లో పుషప్స్‌ తీశారు నేహా గులాటీ. దానికో సందేశాన్ని జోడించి.. కోట్ల మందిని ఆకర్షించారు.

నేహా బాంగియా గులాటీది దిల్లీ. పన్నెండేళ్ల క్రితం పీసీఓఎస్‌ బారిన పడ్డారు. దాన్నుంచి బయట పడటానికి వ్యాయామంపై దృష్టిపెట్టిన ఆవిడ తర్వాత కోర్సులు చేశారు. ఆరేళ్లుగా సర్టిఫైడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, యోగా గురు, న్యూట్రిషన్‌ కోచ్‌గా శిక్షణనిస్తున్నారు. చాలామంది అమ్మాయిలకు అందాన్ని కాపాడుకోవాలంటూ జాగ్రత్తలు చెబుతారే కానీ.. అనారోగ్య సమస్యల్నీ చర్చించాలన్న ధైర్యం ఇవ్వకపోవడం గమనించారామె. అందుకే మహిళల సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను బ్లాగ్‌, సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడం మొదలుపెట్టారు. భర్త ధీరజ్‌ గులాటీ ఫైర్‌ఫైటర్‌ పైలట్‌. ఆయన్ని కలవడానికని తాజాగా కశ్మీరు వెళ్లారు. కనుచూపు మేర మంచు. కాలు పెడితే మోకాలి వరకూ దిగబడిపోతోంది.

అయినా అలవాటు కొద్దీ వ్యాయామం చేయాలనుకున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి మందమైన వస్త్రాలు, టోపీతో సిద్ధమై మరీ పుషప్స్‌ మొదలుపెట్టారు. అది చూసిన ఓ సైనికుడు ‘ఓ అమ్మాయి ఇలాంటి ప్రదేశంలో పుషప్స్‌కి ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. నేనూ మీతో కలిసి ప్రయత్నించొచ్చా’ అని అడిగారు. ఆమెతో పోటీపడి పుషప్స్‌ తీశారు. ఈ వీడియోను తన ఇన్‌స్టా ఖాతా ‘దట్‌ ఫిట్‌ మమ్‌’లో పోస్ట్‌ చేశారు నేహా. ‘మైనస్‌ 16 డిగ్రీల చలి. అక్కడ కొద్దిసేపు ఉండటానికే కష్టపడతాం. అలాంటిది సైనికులు మన భద్రత కోసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నెలల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సేవలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగల’మంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్‌ అవ్వడమే కాదు.. వారం రోజుల్లో కోటి మందికిపైగా వీక్షించారు. ఈమె ప్రయత్నాన్ని కొందరు కొనియాడుతోంటే.. సైనికుల సేవలకు సెల్యూట్‌ చేస్తున్నారు మరికొందరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్