లక్షలాది మహిళల కొత్త అవతార్‌!

పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు... కారణం ఏదైతేనేం కొందరు మహిళలు తమ కెరియర్‌కి బ్రేక్‌ ఇవ్వాల్సొస్తుంది. అన్నీ చక్కబడి తిరిగి ఉద్యోగంలో కుదురుకోవాలనుకున్నప్పుడే... అవకాశాలు దొరకవు.

Updated : 05 Dec 2023 07:11 IST

పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు... కారణం ఏదైతేనేం కొందరు మహిళలు తమ కెరియర్‌కి బ్రేక్‌ ఇవ్వాల్సొస్తుంది. అన్నీ చక్కబడి తిరిగి ఉద్యోగంలో కుదురుకోవాలనుకున్నప్పుడే... అవకాశాలు దొరకవు. ఇలాంటి పరిస్థితుల్లో అతివలకు ఉపాధి చూపిస్తూ అండగా నిలబడుతోంది చెన్నైకి చెందిన ‘అవతార్‌’ సంస్థ. దీనిద్వారా గత పద్దెనిమిదేళ్లుగా లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించారా సంస్థ ఛైర్మన్‌ సౌందర్య రాజేశ్‌. ఆమె ప్రయాణం సాగిందిలా...

సౌందర్య పుదుచ్చేరిలో పుట్టిపెరిగారు. తండ్రి పారిశ్రామిక వేత్త కావడంతో వాళ్లింట్లో తరచూ కంపెనీ సమావేశాలు జరిగేవి. దాని వల్లేనేమో చిన్న వయసులోనే మేనేజ్‌మెంట్‌ మెలకువల్ని ఒంటపట్టించుకున్నారామె. తన కెరియర్‌నీ అందులోనే వెతుక్కుని ఎంబీఏ చేశారు. చదువయ్యాక బ్యాంకు మేనేజర్‌గా పనిచేసి పదోన్నతులెన్నో అందుకున్నారు. అయితే.. తర్వాత పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఏళ్లు గడిచినా స్వశక్తితో బతకాలన్న ఆకాంక్ష తగ్గకపోవడంతో పిల్లలు పెద్దయ్యాక తిరిగి కెరియర్‌లో అడుగుపెట్టాలనుకున్నారామె. ఆ ప్రయత్నంలోనే 1995లో ఓ టెలికాం సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లారు. ప్రతిభ ఉన్నా..ఉద్యోగంలో విరామం వచ్చిందన్న ఒక్క కారణంతో వెనక్కి పంపించేశారు. ఆ సంఘటన సౌందర్యని తీవ్రంగా బాధించింది. తర్వాత కూడా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అప్పుడే ఈ పరిస్థితిలో మార్పు తేవాలి అనుకున్నారామె.

ఇబ్బందులెన్నో దాటి...

రోజులు గడిచినా ఉద్యోగం విషయంలో తాను ఎదుర్కొన్న అవమానాలను మాత్రం మరిచిపోలేదు. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ‘మహిళల వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో సవాళ్లు’ అనే అంశం మీద పీహెచ్‌డీ చేశారు. ఆపై 2000 సంవత్సరంలో మహిళలకు కెరియర్‌లో సెకండ్‌ ఛాన్స్‌ కల్పించాలని ‘అవతార్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతే క్షేత్రస్థాయిలో మహిళల సమస్యల్ని నేరుగా తెలుసుకోవడం, కంపెనీల్ని ఒప్పించి ఉద్యోగం ఇప్పించడంలో ఉండే సవాళ్లు, క్లిష్టత అర్థమయ్యాయామెకు. ‘అప్పటికి ఇది మన దేశంలో కొత్త అంశం... లోతైన అవగాహన కోసం ఇంగ్లండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులు చేశా. 2005 దాకా కేవలం ఆలోచనలు, ప్రణాళికలతోనే గడిపా. ఆ తర్వాతే ప్రత్యేక జాబ్‌పోర్టల్‌ను ప్రారంభించా. ఇందులో 1200మంది దరఖాస్తు చేసుకున్నారు. విరామం తీసుకోవడానికి వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కారణం. వారి అవసరాలు కూడా భిన్నంగా ఉండేవి. ఈ విషయాలను కార్పొరేట్‌ సంస్థలకు చెప్పి ఒప్పించడం పెద్ద సవాలే. అయినా పట్టు వదల్లేదు. చివరికి మూడు కంపెనీలు ముందుకు రావడంతో మొదటి దశలో 480 మందికి దారి చూపించగలిగా. మరి మిగతావాళ్ల సంగతి? ఎన్ని కంపెనీలు తిరగాలి? ఇదంతా చూశాక నేనే సొంతంగా ఉద్యోగ కల్పన ప్రాజెక్టును ప్రారంభించా’ అంటారు సౌందర్య.

ఆ జాబితా ఇస్తాం..

ఇందుకోసం మహిళల అవసరం, కంపెనీల్లో ఉండే అవకాశాలపై సర్వేలు నిర్వహించడం మొదలుపెట్టారామె. ఈ క్రమంలో ఆయా సంస్థలు స్త్రీల మనస్తత్వాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, వారికి అనువైన వాతావరణాన్ని తీసుకురాలేకపోవడం.. వంటి ఇబ్బందులెన్నో గమనించారు. వీటికి పరిష్కారంగా ఇటు మహిళలకు, అటు కంపెనీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్ని ప్రారంభించారు. క్రమంగా అవగాహన పెరిగింది. ప్రస్తుతం వివిధ నగరాల్లోని 300కు పైగా ప్రముఖ సంస్థలు వీరితో పనిచేస్తున్నాయి. సుమారు నాలుగు లక్షల మందికి ఉపాధి చూపించగలిగారు. అప్పట్నుంచి అవతార్‌ సంస్థ ఏటా దేశంలోని టాప్‌-100 ఉత్తమ కంపెనీల జాబితాను ఇవ్వడంతో పాటు, మహిళలకు అనుకూల నగరాలకు ర్యాంకులూ ఇస్తోంది. అంతేకాదు, ఈ అనుభవాలన్నింటితో సౌందర్య ‘ది 99 డే డైవర్సిటీ ఛాలెంజెస్‌’ పుస్తకం రాశారు. 2016 నుంచి ‘పుత్రి’ పేరుతో పేద బాలికలకు నైపుణ్యాలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ, నీతిఆయోగ్‌తో పాటు పలు సంస్థల నుంచి అవార్డులూ, రివార్డులూ అందుకున్నారు సౌందర్య.

 హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్