హక్కులడిగితే.. నవ్వారు!

‘బయటే కాలకృత్యాలు తీర్చుకోండి.. కావాలంటే వెంట ప్లాస్టిక్‌ కవర్‌ తెచ్చుకోండి...’ ఇది యాజమాన్యం మాట. పనిచేసే చోట స్త్రీల పట్ల ఇంత అమానుషమా అంటూ పోరాటం మొదలుపెట్టింది విజి. ఫలితంగా స్త్రీలకు కనీస హక్కులు దొరికాయి.

Updated : 06 Dec 2023 03:43 IST

‘బయటే కాలకృత్యాలు తీర్చుకోండి.. కావాలంటే వెంట ప్లాస్టిక్‌ కవర్‌ తెచ్చుకోండి...’ ఇది యాజమాన్యం మాట. పనిచేసే చోట స్త్రీల పట్ల ఇంత అమానుషమా అంటూ పోరాటం మొదలుపెట్టింది విజి. ఫలితంగా స్త్రీలకు కనీస హక్కులు దొరికాయి. ఆ మార్పే ఆమెను బీబీసీ 100 మంది స్ఫూర్తిదాయక మహిళల జాబితాలోకి ఎక్కేలా చేసింది..

‘మాది కేరళలోని కొజికోడ్‌. నాన్న డ్రైవర్‌. అమ్మ ఇళ్లల్లో పనులు చేసేది. నాన్న సంపాదన ఆయన జల్సాలకే సరిపోయేది. ఇల్లు గడవడానికి అమ్మ ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేది. అలాంటి అమ్మను నాన్న చావబాదేవాడు. అదిచూసి నాకు చాలా బాధేసేది. ఆ పరిస్థితే నాన్నపై ఎదురుతిరిగేలా చేసింది. ఆయన తీరు నాలో పోరాడే గుణాన్ని అలవరిచింది. పాఠశాల చదువు పూర్తవగానే స్థానిక నక్సలైట్‌ నాయకునితో కలిసి మహిళా హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశాను. మేమంతా కలిసి కొజికోడ్‌లో టైలరింగ్‌ యూనిట్‌ని ప్రారంభించాం. దాన్ని చూసి అందరూ విమర్శించారు. ఆర్థిక కారణాల వల్ల కొంత మంది మహిళలు వెనక్కి తగ్గినా నేను మాత్రం కొనసాగా’నంటారు విజి పలితోడి.

అవమానించారు..

‘పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం 1998లో ప్రారంభమైన ‘కుడుంబశ్రీ’ ద్వారా మహిళలు ఉపాధి బాటపట్టారు, నైపుణ్యాలు సాధించారు. ముఖ్యంగా దుస్తుల రంగంలో వీళ్లకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కానీ తక్కువ జీతం ఇచ్చి, ఎక్కువ గంటలు పని చేయించుకొనేవారు. కొన్ని వందల మంది స్త్రీలు రోజుకి 12గంటలు పని చేసినా కనీసం వాళ్లకి మరుగుదొడ్డి వసతి కూడా ఉండేది కాదు. రుతుక్రమంలో మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. వాష్‌రూమ్‌లు కావాలని యజమానులను అడిగితే నవ్వారు.‘మీరు చేసే పనికి అవి కూడా కావాలా? రేపటి నుంచి మీకు పని లేదు. ఒకవేళ వస్తే బయటే కాలకృత్యాలు తీర్చుకోండి. లేదా ప్లాస్టిక్‌ కవరు తెచ్చుకుని పని ముగించుకోండి’ అంటూ అవమానించారు. దీంతో చాలా మంది మహిళలు జననేంద్రియ సమస్యల బారిన పడ్డారు’ అంటున్నారు విజి.

షాపే కార్యాలయంగా..

ఈ సమస్యల పరిష్కారం కోసం 2009లో పెంకూట్టు(మహిళలు ఒకరికొకరు)సంస్థని ప్రారంభించారు విజి. ‘కార్మిక సంఘాలు మా అవసరాలను గుర్తించడానికి నిరాకరించాయి. దాంతో నా టైలరింగ్‌ షాపునే కార్యాలయంగా మార్చుకుని మా హక్కుల కోసం పోరాడేవాళ్లం. అప్పుడు కూడా మమ్మల్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎడతెగని నిరసనలు, సమ్మెల తర్వాత ప్రభుత్వం 2018లో కేరళ షాప్స్‌ అండ్‌ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ని సవరించింది. మహిళా కార్మికులకి టాయిలెట్‌ సౌకర్యాన్ని తప్పనిసరి చేసింది. కొజికోడ్‌లో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించింది. ప్రస్తుతం మహిళలకు సమాన వేతనాలు, జాబ్‌ సెక్యూరిటీ కోసం పోరాడుతున్నాం’ అనే విజి పోరాట పటిమను చూసి వింగ్స్‌ సంస్థ తనకు ఇంటిని బహుమతిగా ఇచ్చింది. బీబీసీ విడుదల చేసిన ‘100మంది స్ఫూర్తిదాయక మహిళ’ జాబితాలో ఒకరిగా నిలిచారు విజి. ఆ తర్వాత ఆమె అందుకున్న పురస్కారాలెన్నో.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్