సృజనాత్మక బోధనలో.. నెం.1 వీళ్లు!

లెక్కలంటే భయపడే పిల్లలే ఎక్కువ.. కానీ చెప్పాల్సిన విధంగా చెబితే లెక్కలంత సులభమైన సబ్జెక్ట్‌ మరొకటి లేదని నిరూపించారీ ఉపాధ్యాయినులు.

Updated : 06 Dec 2023 07:21 IST

లెక్కలంటే భయపడే పిల్లలే ఎక్కువ.. కానీ చెప్పాల్సిన విధంగా చెబితే లెక్కలంత సులభమైన సబ్జెక్ట్‌ మరొకటి లేదని నిరూపించారీ ఉపాధ్యాయినులు. విద్యామృత్‌ మహోత్సవ్‌ పోటీల్లో జాతీయస్థాయిలో ఆరులక్షల ప్రాజెక్టులతో పోటీపడి.. తమ సృజనతో ముందు వరుసలో  నిలబడి శభాష్‌ అనిపించుకున్నారు...

ఆ వాకిలి కూడా పాఠాలు చెబుతుంది..

ఆ బడి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా అంటే.. అక్కడ బెంచీలు, గేట్లు, వాకిలి, మొక్కలు వేటిని చూసినా, తాకినా లెక్కలు పక్కాగా వస్తాయి. అదెలా అంటారా? కడప జిల్లాలోని చాపాడు మండలం మొర్రాయిపల్లెలో ఉందీ ప్రాథమిక పాఠశాల. పిల్లలకు చెప్పే లెక్కలు వాళ్ల మనసులో శాశ్వతంగా నిలిచిపోయేలా చేయాలనుకున్నారు ఈ పాఠశాల టీచర్‌ మైనపురెడ్డి నాగలక్ష్మీదేవి. అందుకే ఇలా ప్రయోగం చేశారు. ఈ ఏడాది విద్యా అమృత్‌ మహోత్సవ్‌ ప్రాజెక్టులో భాగంగా నాగలక్ష్మీదేవి తయారు చేసిన బేసిక్‌ మ్యాథమాటిక్స్‌ పర్మనెంట్‌ టీఎల్‌ఎం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. టీఎల్‌ఎం అంటే టీచింగ్‌ లర్నింగ్‌ మెటీరియల్‌. పిల్లలకు పాఠాలను సులువుగా బోధించే విధానం ఇది. దేశ వ్యాప్తంగా 5.99 లక్షల ప్రాజెక్టులు వస్తే... నాగలక్ష్మీదేవి రూపొందించిన శాశ్వత టీఎల్‌ఎం నమూనా ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలూ అందుకుంది. ‘మా స్వగ్రామం వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఈడిగపేట. అమ్మానాన్నలు పెద్దగా చదవలేదు. నాన్న గౌరీశ్వరుడు టైలర్‌. మా సోషల్‌ టీచర్‌ గ్లాడిస్‌ పరిమళపై ఇష్టంతో ఈ వృత్తిలో అడుగుపెట్టా. 19ఏళ్లకే సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయురాలిగా నా కెరియర్‌ మొదలయ్యింది. చదువుకుంటూనే దూరవిద్యలో బీఏ, బీఈడీ పూర్తి చేశా. బదిలీపై మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాలకు వెళ్లాక లెక్కలంటే భయపడే పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. కానీ ఆ బోధనాభ్యాస సామగ్రి అంతా ఏడాది తిరిగేసరికి పాడయ్యేది. అలా కాకుండా ఉండటానికే శాశ్వత విధానం ఉంటే బాగుండునని అబాకస్‌లు, భిన్నాలు, ఆరోహణ, అవరోహణ క్రమాలు తేలిగ్గా వచ్చేలా గేట్లు, చప్టా దగ్గరే అమర్చాం. మొక్కలు పెంచేందుకు వేసిన పాదుల చుట్టూ వృత్తం, త్రిభుజం, దీర్ఘచతురస్రం రూపొందించాం. అవి చూసినా చాలు పిల్లలకు పాఠాలు రావాలన్నది నా లక్ష్యం. జాతీయ స్థాయిలో ఈ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నదే నా కల’ అంటున్నారు నాగలక్ష్మీదేవి.

డేగల శేఖర్‌, చాపాడు


లెక్కలంటే భయం పోగొట్టి...

‘టీఎల్‌ఎం పద్ధతిలో ఎంత కఠినమైన అంశాన్నైనా పిల్లలకు తేలిగ్గా, మనసులో నాటుకుపోయేలా చెప్పొచ్చు’ అంటారు కొల్లూరి వెంకట నాగలక్ష్మీ నరసమాంబ. రాజమహేంద్రవరంలోని సంతోష్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారీమె. నరసమాంబ రూపొందించిన కౌంటింగ్‌ అడిషన్‌ అండ్‌ సబ్‌ట్రాక్షన్‌ ప్రాజెక్ట్‌ ఈ పోటీల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎంత క్లిష్టమైన గణిత అంశాలనైనా ఈ పద్ధతిలో మనసులో నాటుకుపోయేలా చెప్పడం నరసమాంబ ప్రత్యేకం. ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా ఎక్కడి కెళ్లినా తన వినూత్న బోధనా విధానాలతో పిల్లల్ని ఆకట్టుకొనేవారామె. గతంలో సీతానగరం మండలం కూనవరం పాఠశాలలో ఆమె చేరేనాటికి 80 మంది విద్యార్థులుండేవారు. ఆ సంఖ్యను 320కి చేర్చారు. ఆ తర్వాత కోలమూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రూ.25 లక్షలు విరాళాలు సేకరించి, పాఠశాలని ఆధునికంగా రూపుదిద్దారు. లక్ష్మీస్‌ టీఎల్‌ఎం అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా తాను కొత్తగా తయారు చేసిన టీఎల్‌ఎం పద్ధతుల్ని విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. ఈ ఛానెల్‌కి లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. దాంతోపాటు ఏపీ టీఎల్‌ఎం ఫ్యాక్టరీ పేరుతో 300 మంది ఉపాధ్యాయులను వాట్సప్‌ బృందంగా ఏర్పరిచి వారి ఆలోచనలకు పదును పెడుతున్నారు. చిన్నతనంలో తాను కోల్పోయిన విద్యాబోధన ఇప్పుడున్న విద్యార్థులకు అందజేయడమే తన లక్ష్యం అంటున్నారు నరసమాంబ.

బి.అశోక్‌కుమార్‌, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్