శక్తిని చాటారు!

ఏడుగురు పిల్లల తల్లి... నాలుగు పదుల వరకూ రాజకీయాల గురించి పట్టించుకోని ఉర్సులా ఫోర్బ్స్‌.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నెం.1 స్థానంలో నిలిచారు.

Updated : 10 Dec 2023 05:26 IST

ఏడుగురు పిల్లల తల్లి... నాలుగు పదుల వరకూ రాజకీయాల గురించి పట్టించుకోని ఉర్సులా ఫోర్బ్స్‌.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నెం.1 స్థానంలో నిలిచారు. ఆమె మాత్రమేనా? నష్టాల్లో ఉన్న సెయిల్‌ సంస్థని ముందుకు నడిపించిన సోమా మండల్‌... దేశాన్ని ఆర్థిక ప్రగతివైపు నడిపిస్తున్న నిర్మలా సీతారామన్‌.. సేవాపథంలోనూ ముందడుగు వేస్తున్న రోషిణి నాడార్‌ వంటివారూ ఈ జాబితాలో ఉన్నారు...

అయిదోసారి చోటు..

సంపన్న కుటుంబంలో పుట్టకపోయినా తలచుకుంటే ఉన్నత స్థానానికి చేరొచ్చు అనడానికి నిర్మలా సీతారామన్‌ చక్కని ఉదాహరణ. తమిళనాడుకు చెందిన మధ్యతరగతి కుటుంబం ఈవిడది. ఆర్థికశాస్త్రంపై ఆసక్తితో ఎకనామిక్స్‌లో ఎంఫిల్‌ చేశారు. దిల్లీలో చదువుతున్నప్పుడే సహాధ్యాయి పరకాల ప్రభాకర్‌ని పెళ్లాడి తెలుగింటి కోడలయ్యారు. లండన్‌లో ఓ డెకార్‌ సంస్థలో సేల్స్‌పర్సన్‌గా కెరియర్‌ ప్రారంభించిన ఆవిడ తర్వాత బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ల్లో కీలక పదవులు నిర్వర్తించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రతినిధిగా, ఎంపీగా సేవలందించారు. 2017లో రక్షణశాఖ మంత్రి అయ్యి ఆ హోదాను అందుకున్న రెండో మహిళగా నిలిచారు. 2019 నుంచి కేంద్ర ఆర్థికశాఖతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. తొలి పూర్తికాల మహిళా ఆర్థికశాఖ మంత్రి కూడా. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళ అనిపించుకోవడం అంత సులువేం కాదు. అలాంటిది భారతీయ రాజకీయాలతోపాటు ఎకనామిక్‌ పాలసీల రూపకల్పన, జీడీపీ తదితర అంశాల్లో తనదైన ముద్ర వేసి, శక్తిమంతమైన మహిళగా ఎదిగారు. వరుసగా అయిదుసార్లు ఫోర్బ్స్‌ జాబితాకెక్కారు. ఈ ఏడాది ఫార్చ్యూన్‌ విడుదల చేసిన దేశంలోనే శక్తిమంతమైన మహిళల జాబితాలోనూ చోటు సాధించారు నిర్మల.


మనసున్న మారాణి..

తండ్రి శివ్‌ నాడార్‌ పేరున్న వ్యాపారవేత్త. అయినా రోషిణి మాత్రం ఆర్భాటాలకు తావిచ్చేవారు కాదు. నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసిన ఈవిడ అమెరికాలో కొన్నాళ్లు వార్తా సంస్థల్లో పనిచేశారు. తర్వాత నాన్న ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ టెక్‌లో అడుగుపెట్టి, వివిధ హోదాల్లో పనిచేశారు. 2020లో ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు చేపట్టిన రోషిణి అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. దేశంలో పబ్లిక్‌ లిస్టెడ్‌ ఐటీ సంస్థను నడిపిస్తున్న తొలి మహిళ. ఈ ఏడాది దేశంలో ఫోర్బ్స్‌ శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలు. మూగజీవుల కోసం ట్రస్ట్‌ నిర్వహిస్తోన్న రోషిణి.. శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌కి ట్రస్టీ కూడా. దేశంలో ఫోర్బ్స్‌ అత్యంత సంపన్న, శక్తిమంతమైన మహిళల జాబితాల్లోనూ చోటు దక్కించుకున్నారు.


‘తొలి’ సంతకాలెన్నో!

అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో.. అరుదైన రంగంలోకి అడుగుపెట్టారు సోమ మండల్‌. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. అంతేనా.. అంచెలంచెలుగా ఎదుగుతూ సెయిల్‌ తొలి మహిళా ఛైర్‌పర్సన్‌ అయ్యారు. ఈవిడది భువనేశ్వర్‌. సోమ ఇంజినీరింగ్‌లో చేరతానన్నప్పుడు నాన్న రూపంలోనే అవరోధం ఎదురైంది. అయినా పట్టుబట్టి ఎన్‌ఐటీ రవుర్కెలా నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. టీచర్‌ కమ్మంటే కార్పొరేట్‌ ఉద్యోగి అవుతానన్నారు. ఎవరో ఒకరు అడుగు వేయకపోతే మార్గం ఏర్పడదని నమ్మిన ఈవిడ.. 1984లో అల్యూమినియం తయారీ సంస్థ నాల్కోలో ట్రైనీగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో మొదటి మహిళా డైరెక్టర్‌ అయ్యారు. 2017లో సెయిల్‌లో అడుగుపెట్టి తొలి మహిళా డైరెక్టర్‌ అయ్యారు. కొత్త మార్కెటింగ్‌ వ్యూహాలతో డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను పెంచి అమ్మకాలు పెరిగేలా చేశారు. నెక్స్‌, సెయిల్‌ సెక్యూర్‌ వంటి కొత్త బ్రాండ్‌లు ప్రారంభించి లాభాల్లో నడిపించి, ఛైర్‌పర్సన్‌ అయ్యారు. సెయిల్‌ చరిత్రలో తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించడమే కాదు.. వ్యాపారాన్ని రూ.1.03లక్షల కోట్లకు చేర్చారు. నష్టాల దిశగా సాగుతున్న సంస్థను లాభాలబాట పట్టించారు.


నంబర్‌ 1 స్థానంలో

నాలుగుపదుల వయసు వరకూ కుటుంబం, వృత్తిపరమైన బాధ్యతలకే పరిమితమైన ఉర్సులా ఓన్‌డెర్‌లెయాన్‌.. 65 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఎదిగారు. ఉర్సులా తండ్రి ఎర్నెస్ట్‌ జర్మన్‌ రాజకీయాల్లో కీలకంగా ఉన్నా.. తల్లి హైడీ ప్రోత్సాహంతో చదువుపైనే దృష్టిపెట్టారీమె. రోజ్‌ అనే మారు పేరుతో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టి... వైద్య విద్య పూర్తిచేశారు. అదే వృత్తిలో ఉన్న హెయికోని వివాహమాడి.. కొన్నాళ్లు అమెరికాలో ఉన్నారు. వీళ్లకి ఏడుగురు సంతానం. వాళ్లని పెంచడంలో క్షణం తీరిక ఉండేది కాదామెకు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. మెడిసిన్‌లో డాక్టరేట్‌ చేశారు. ఆ తర్వాత తండ్రి ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఏంజెలా మెర్కెల్స్‌ క్యాబినెట్‌లో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి కన్జర్వేటివ్‌ ఫెమినిజమ్‌ పేరుతో స్త్రీలకు మేలు చేసే అనేక చట్టాల్ని తీసుకొచ్చారు. పిల్లల పెంపకం బాధ్యత తల్లిది మాత్రమే కాదు తండ్రిది కూడా అంటూ పితృత్వ సెలవుల్నీ అందించారు. ఆ తర్వాత ఆరేళ్లు జర్మనీ రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి యూరోపియన్‌ కమిషన్‌కి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఉర్సులా. ఉక్రెయిన్‌కి మద్దతు ఇచ్చే విషయంలో.. కొవిడ్‌ని సమయంలో, పర్యావరణ రక్షణ ఒప్పందాల విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. కాబట్టే ఆమె శక్తివంతమైన మహిళగా ముందు వరుసలో నిలబడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్