మంత్రులకు కానుకగా ఇస్తారు!

అమ్మ చేతి రుచిని ఎవరైనా మర్చిపోతారా? అసాధ్యం కదా! ఆమె కూడా అంతే... అమ్మ, అమ్మమ్మ తయారు చేసిన పచ్చళ్ల రుచిని నలుగురికీ చూపించాలనుకున్నారు.  ఆ ప్రయత్నమే ఇప్పుడు 20 దేశాలకు పచ్చళ్లను ఎగుమతులు చేసేలా చేసింది. 

Updated : 14 Dec 2023 02:23 IST

అమ్మ చేతి రుచిని ఎవరైనా మర్చిపోతారా? అసాధ్యం కదా! ఆమె కూడా అంతే... అమ్మ, అమ్మమ్మ తయారు చేసిన పచ్చళ్ల రుచిని నలుగురికీ చూపించాలనుకున్నారు.  ఆ ప్రయత్నమే ఇప్పుడు 20 దేశాలకు పచ్చళ్లను ఎగుమతులు చేసేలా చేసింది.  విశాఖపట్నానికి చెందిన లలితాదేవి తన విజయాన్ని మనతో పంచుకున్నారిలా...

లుగురికీ వండిపెట్టడం... వాళ్లు బాగుందని మెచ్చుకుంటే సంతోషపడటమే నా బలహీనతలు. మా అమ్మ, అమ్మమ్మ పచ్చళ్లు బాగా చేసేవారు. వాళ్లని చూసి నేనూ నేర్చుకుని అంతే బాగా చేసేదాన్ని. నాకొచ్చిన వంటనే వ్యాపార సూత్రంగా మార్చుకోవడానికో కారణం ఉంది. మా సొంతూరు భీమవరం. మావారు సాంబశివరావు యోగా నిపుణులు. అయిదేళ్ల క్రితం విశాఖ వచ్చాం. అప్పట్లో యోగాశ్రమం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అది సాధ్యపడలేదు. సరే.. కుటుంబ పోషణకు ఏదైనా చేయాలనుకున్నాం. అప్పుడే ఇంట్లో పచ్చళ్లకీ, మార్కెట్లో వాటికీ రుచిలో తేడా కనిపించింది. భీమవరంలో ఉన్నప్పుడు ఎవరికైనా కావాలంటే చేసివ్వడం అలవాటే. దాంతో మనమే సొంతంగా పచ్చళ్లు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మొదట్లో చిన్నగా 10 రకాల శాకాహార, 4 రకాల మాంసాహార పచ్చళ్లతో మొదలుపెట్టాం. అమ్మకాలు బాగుండటంతో.. దుకాణం ప్రారంభించాం. అద్దెతో కలిపి రూ.3 లక్షలతో మా వ్యాపారం ప్రారంభమైంది. మా ఊరి పేరునే బ్రాండ్‌ పేరుగా మార్చుకున్నాం. నేను తయారీపై దృష్టి పెడితే మావారు దుకాణం, ఆర్డర్లు చూసుకునేవారు.

అదే వ్యాపారసూత్రం.. 

నేను చదువుకున్నది తక్కువే. పెద్దగా వ్యాపార సూత్రాలు తెలియవు. తెలిసిందల్లా ఒక్కటే... ఇంట్లో మేం వండుకున్నట్టుగా వినియోగదారులకీ అందించాలని. ముడి సరకు తీసుకోవడం నుంచి ఆర్డర్‌ పంపేవరకు చాలా శ్రద్ధగా పనిచేస్తాం. నాన్‌వెజ్‌ పచ్చళ్ల విషయంలో ఒక్క నిమిషం ఏమరుపాటుగా ఉన్నా ముక్క రంగు మారిపోతుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇక శాకాహార పచ్చళ్ల కోసం కూరగాయల్ని పొలాల వద్దకు వెళ్లి, నేరుగా రైతుల నుంచే కొంటాం. చేపలు, రొయ్యలను భీమవరం నుంచి తెప్పిస్తాం. టేబుల్‌ సాల్ట్‌ని కాకుండా ఉప్పుపొడిని వాడతాం. మసాలాల్ని ఏరోజుకారోజే తయారుచేస్తాం. మునక్కాడ, వెల్లుల్లి, పుట్టగొడుగులు, అల్లం, కొత్తిమీర, ఉసిరి, క్యారెట్‌, దొండ, కాకరకాయ, కరివేపాకు వంటి శాకాహార పచ్చళ్లు.. నాటుకోడి, నెత్తళ్లు, కొరమీను, వంజరం, కోనెం, ట్యూనా, మటన్‌, కీమా వంటి మాంసాహార పచ్చళ్లూ తయారుచేస్తున్నాం. పులిహోర, మామిడి పులిహోర వంటి రెడీ టు మిక్స్‌లూ అందిస్తున్నాం. ప్రత్యేక సందర్భాల్లో సున్నుండలు, పూతరేకులు తదితర పిండి వంటలూ చేస్తాం. ప్రస్తుతం యాభై రకాల శాకాహార, 20 రకాల మాంసాహార పచ్చళ్లు తయారుచేస్తున్నాం. వాటితోపాటు పొడులు, మసాలాలు, రెడీటుమిక్స్‌లతో కలిపి మొత్తం 150 రకాల ఉత్పత్తులు తయారుచేస్తూ.. రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ సాధిస్తున్నాం.


20 దేశాలకు..

మాకో అబ్బాయి, అమ్మాయి. బాబు వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. పాప చదువుకుంటోంది. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 10 మంది మహిళలు ఇక్కడ పని చేస్తున్నారు. అన్ని రకాలు కలిపి రోజుకి 500 కిలోల వరకు పచ్చళ్లు తయారుచేస్తాం. నాన్‌వెజ్‌వి మూడు నెలల వరకూ నిల్వ ఉంటే.. వెజ్‌వి ఏడాదికి పైగా ఉంటాయి. వెబ్‌సైట్‌ నుంచీ విక్రయాలు చేస్తున్నాం. అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, చైనా, సింగపూర్‌, మలేసియా, దుబాయి తదితర 20 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. స్థానిక నాయకులు దిల్లీలో మంత్రులు, ఇతర నేతలను కలవడానికి వెళ్లేటప్పుడు మా ఉత్పత్తులు తీసుకెళ్తుంటారు.

 కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్