మొదటి... స్ఫూర్తి!

చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచిపోయే అవకాశం ఒక్కరికే వస్తుంది. వీళ్లంతా అటువంటి ప్రత్యేకమైన వ్యక్తులే! తమ శక్తి, సామర్థ్యాలతో తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు...

Updated : 16 Dec 2023 04:06 IST

చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచిపోయే అవకాశం ఒక్కరికే వస్తుంది. వీళ్లంతా అటువంటి ప్రత్యేకమైన వ్యక్తులే! తమ శక్తి, సామర్థ్యాలతో తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు...


 సైగలతో న్యాయం..

కేరళలోని కొట్టాయంకు చెందిన సారా బధిరురాలు. తండ్రి చార్టర్డ్‌ అకౌంటెంట్‌. తల్లి గృహిణి. బెంగళూరు సెయింట్‌ జోసెఫ్‌ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. కర్ణాటక బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. సుప్రీం కోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగలభాషతో వాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సైన్‌ లాంగ్వేజ్‌లో వాదనలు జరగటం దేశంలో ఇదే మొదటిసారి. ఈమె వాదనను ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాత సౌరవ్‌ రాయ్‌ చౌదరి అనువదించారు. ‘ఈ విజయంతో నాలాంటి వారందరిలో స్ఫూర్తి నింపాలనే నా కల నెరవేరింది. ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింద’ని చెబుతోంది సారా.  


దుబాయ్‌ సిరిమంతురాలు..

చదువుతో తమ తలరాతను మార్చుకున్న వాళ్లెందరో.. ఆ కోవకే చెందుతారు జులేకా హాస్పిటల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జులేకా దౌడ్‌. ఈమెది నాగ్‌పుర్‌. పేద కుటుంబం. తండ్రి కూలీ. కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న జులేకా కష్టపడి చదివారు. నాగ్‌పుర్‌లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌, గైనకాలజీలో స్పెషలైజేషన్‌ పూర్తి చేశారు. 1964లో ప్రాక్టీస్‌ కోసం యూఏఈ వెళ్లిన.. తొలి భారత మహిళా వైద్యురాలిగా రికార్డుకెక్కారు. 1992లో జులేకా హాస్పిటల్‌ గ్రూప్‌ను ప్రారంభించి, అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసులను అందిస్తున్నారు. 10వేలకు పైగా ప్రసవాలు చేశారు. ఈమె కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో ‘ప్రవాసి భారతీయ సమ్మాన్‌’ అవార్డుతో సత్కరించింది. ‘ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ’లో చోటు దక్కించుకున్న 84ఏళ్ల జులేకా ప్రస్తుతం రూ.3632 కోట్ల రెవెన్యూతో దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు.


తండ్రి చూపిన బాటలో..

అమ్మాయిలు ఫలానా పనే చేయాలి.. అనే మూస ధోరణికి స్వస్తి చెబుతూ మన దేశంలోనే మొదటి మహిళా వోల్వో పైలట్‌గా రికార్డు సృష్టించింది సీమా ఠాకూర్‌. సీమా తండ్రి హిమాచల్‌ రాష్ట్ర రవాణా విభాగంలో పనిచేసేవారు. చిన్నప్పుడు ఆగి ఉన్న బస్‌లో నాన్న ఒళ్లో కూర్చుని స్టీరింగ్‌ను అటూ ఇటూ కదుపుతూ అల్లరి చేసేది సీమా. అలా డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఈమె.. నాన్న మరణాంతరం ఆయన స్థానంలోకి అడుగుపెట్టి.. హిమాచల్‌ రోడ్‌వేస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా నియమితురాలైంది. హిమాచల్‌లోని క్లిష్టమైన రహదారుల్లో డ్రైవింగ్‌ చేస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తోంది. రొహ్రూ నుంచి సిమ్లా మీదుగా దిల్లీకి 500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 గంటల్లో చేరుకుంది. దృఢ సంకల్పంతో అడుగులు వేస్తే మహిళలు ఏ రంగంలో అయినా రాణించగలరని నిరూపిస్తోంది సీమ. 


ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దూసుకొచ్చి...

మగవాళ్లకి మాత్రమే సాధ్యమనుకున్న రంగంలో మూడు దశాబ్దాల క్రితమే అడుగుపెట్టి.. ఆసియాలోనే మొదటి మహిళా రైలు డ్రైవర్‌గా గుర్తింపు పొందారు మహారాష్ట్రకు చెందిన సురేఖాయాదవ్‌. తల్లి సోనాబాయి, తండ్రి భోస్లే. కరాడ్‌లోని గవర్నమెంటు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన సురేఖ..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కి మొట్ట మొదటి లోకో పైలట్‌గా ఎంపికై మరోసారి చరిత్ర సృష్టించారు.


ఫైర్‌ ఫైటర్‌గా..

దిశది గోవాలోని పెర్నెం. చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టం. ఆ మక్కువతోనే యూనిఫాం ధరించి, దేశ సేవకు అంకితమయ్యే ఉద్యోగమే చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో అగ్నిమాపక సేవలందించే ‘ఏరోడ్రోమ్‌ రెస్క్యూ ఫైర్‌ ఫైటింగ్‌ యూనిట్‌’ కు ఎంపికై గోవాలోనే తొలి మహిళా ఫైర్‌ఫైటర్‌గా ఘనత సాధించింది. ఇటీవలే మరో మెట్టెక్కి ‘క్రాష్‌ ఫైర్‌ టెండర్‌ ఆపరేటర్‌’గా సర్టిఫికేషన్‌ పొందిన దిశ..ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఫైర్‌ఫైటర్‌గా చరిత్రకెక్కింది.


గోల్‌ కొట్టింది...

ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌ దక్కించుకుని, భారత మొట్టమొదటి మహిళా గోల్ఫర్‌గా చరిత్ర సృష్టించింది అదితి అశోక్‌. నాన్న అశోక్‌ గోల్ఫ్‌ క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తితో ఐదున్నరేళ్ల వయసులోనే క్రీడల్లోకి అడుగుపెట్టిన అదితి.. కొన్నాళ్లకే.. బెంగళూరు గోల్ఫ్‌ క్లబ్‌, కర్ణాటక గోల్ఫ్‌ అసోసియేషన్‌ తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొంది. 2015 వరకు అమెచ్యూర్‌ గోల్ఫర్‌గా రాణించిన ఈమె..ఏషియన్‌ యూత్‌ గేమ్స్‌, యూత్‌ ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు..ఈ మూడింటిలో పాల్గొన్న తొలి, ఏకైక భారత గోల్ఫ్‌ క్రీడాకారిణిగా నిలిచింది. 2016లో జరిగిన లేడీస్‌ యూరోపియన్‌ టూర్‌లో విజయం సాధించి..ఈ ఘనత అందుకున్న తొలి గోల్ఫ్‌ క్రీడాకారిణిగా నిలిచింది. 2017లో మహిళల ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ (ఎల్‌పీజీఏ) ప్లేయర్‌గా అర్హత పొందిన మొదటి ఇండియన్‌గానూ రికార్డులకెక్కింది అదితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్