రూ. 26 జీతం నుంచి వందల కోట్ల దాకా!

‘జీవితం పాఠాలను నేర్పి, లక్ష్యాన్ని చూపిస్తే... కాలం ప్రతికూల పరిస్థితులతో పోరాడే శక్తినిస్తుంది’ అంటారు శ్రీధాసింగ్‌. ఒకప్పుడు ఇల్లు గడవడానికి రోజుకి రూ.26 రూపాయల కూలికి పనిచేసిన ఆమె... ఇప్పుడు రెండు ప్రముఖ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌లకు అధినేత్రి. వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన సంస్థల వ్యాపార సామ్రాజ్ఞి. ఆ స్ఫూర్తిదాయక ప్రయాణం మనమూ తెలుసుకుందామా!

Updated : 13 Jan 2024 12:24 IST

‘జీవితం పాఠాలను నేర్పి, లక్ష్యాన్ని చూపిస్తే... కాలం ప్రతికూల పరిస్థితులతో పోరాడే శక్తినిస్తుంది’ అంటారు శ్రీధాసింగ్‌. ఒకప్పుడు ఇల్లు గడవడానికి రోజుకి రూ.26 రూపాయల కూలికి పనిచేసిన ఆమె... ఇప్పుడు రెండు ప్రముఖ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌లకు అధినేత్రి. వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన సంస్థల వ్యాపార సామ్రాజ్ఞి. ఆ స్ఫూర్తిదాయక ప్రయాణం మనమూ తెలుసుకుందామా!

‘సమస్యలతో పోరాడటం, అనుకున్న లక్ష్యం కోసం ఎంతైనా కష్టపడటం వంటివి తనకు చిన్నతనంలోనే అలవడ్డా’యంటారు శ్రీధా సింగ్‌. సౌందర్య పరిరక్షణకోసం ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ రంగంలో అడుగుపెట్టి దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టిన శ్రీధది ఉత్తర్‌ప్రదేశ్‌లోని కరాందా గ్రామం. తండ్రి ఆర్మీలో పనిచేయడంతో ఆమె చదువు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కేంద్రీయ, ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో సాగింది. పటియాలాలోని పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఎంబీఏ పట్టాలను అందుకున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరో వైపు ఏడో తరగతిలో అడుగుపెట్టిన నాటి నుంచే కష్టాలతో సావాసం ప్రారంభించారామె. అప్పట్నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారాల్సి రావడంతో తోటి విద్యార్థులంతా హేళన చేస్తున్నా... కుంగిపోకుండా నెమ్మదిగా ఆంగ్లంపై పట్టు సాధించారు. మరో పక్క కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రి... తల్లిని నిత్యం బాధపెడుతుంటే తట్టుకోలేక ఎలాగైనా ఆవిడను ఆ నరకం నుంచి తప్పించాలని తపన పడేవారు. తమ జీవితాలు బాగుపడాలంటే తన తలరాతను తానే మార్చుకోవాలనుకున్నారు.

బర్గర్‌ షాపులో పనిచేస్తూ...

తమ్ముళ్లతో సహా తల్లినీ, తననీ ఇంటి నుంచి తండ్రి గెంటేసే నాటికి శ్రీధ వయసు పద్నాలుగేళ్లు. ఇల్లు గడవడం కోసం చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరారు. బర్గర్‌ షాపులో ఉద్యోగం. రోజుకి రూ.26 జీతం. అక్కడ పనిచేస్తోన్న తనని చూసి తోటివిద్యార్థి జోకులు వేయడంతో అక్కడ మానేశారు. దీంతో ఇల్లు గడవడం మరింత కష్టమైంది. మళ్లీ ప్రయత్నించి ఓ ఎన్‌జీవోలో నెలకు 4వేల రూపాయల జీతానికి కుదురుకున్నారు. ‘పంజాబ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాక కొన్ని కార్పొరేట్‌ ఉద్యోగాలు చేసినా...ఎన్నాళ్లిలా అనే భావనతో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా’ అంటారామె. తర్వాత స్నేహితుడు పరమ్‌ భార్గవతో పెళ్లయ్యాక శ్రీధ వ్యాపారంవైపు అడుగులు వేశారు. ఆ క్రమంలోనే వారు గుడ్‌గావ్‌కి మారాల్సి వచ్చింది. అక్కడ కాపురం పెట్టిన కొన్నాళ్లకే కాలుష్యం ఆమెను ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా ఒంటిపై దద్దుర్లకు కారణమయ్యింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి కొచ్చిలోని ఓ ఆయుర్వేదిక్‌ క్లినిక్‌లో పరిష్కారం లభించింది.

అందరికీ అందుబాటులో...

ఆయుర్వేదానికి పుట్టినిల్లు అయిన భారతదేశంలో ఈ తరహా చికిత్సలు, కాస్మెటిక్స్‌ అందరికీ ఎందుకు అందుబాటులో లేవన్న ఆలోచన ఆమెని ముందుకు నడిపించింది. కూడబెట్టుకున్న సొమ్ముని పెట్టుబడిగా పెట్టి ‘ఖాదీ ఎసెన్షియల్స్‌’ పేరుతో సహజ సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అదే సమయంలో కొవిడ్‌ విజృంభించింది. దీంతో ఈ తరహా ఉత్పత్తులకు ప్రాధాన్యంతో పాటూ.. వీరి వ్యాపారమూ పెరిగింది. ప్రాచీన ఆయుర్వేద వైద్యం, సౌందర్య చికిత్సలను మార్కెట్‌ చేయాలన్న ఆలోచనతో ‘ది ఆయుర్వేద కంపెనీ’ పేరుతో మరో సంస్థను స్థాపించారామె. నటి కాజల్‌తో పాటు విప్రో కన్స్యూమర్‌ కేర్‌ వెంచర్స్‌, సిక్స్త్‌సెన్స్‌ వెంచర్స్‌, ట్రిఫెక్టా క్యాపిటల్‌, ఆల్టెరియా వంటి సంస్థలు సుమారుగా రూ. 115 కోట్లు పెట్టుబడిగా అందించాయి. దేశవ్యాప్తంగా 3000 స్టోర్లలో తమ ఉత్పత్తులు అమ్ముతూ ఆదాయాన్ని పొందుతున్నారు. శ్రీధ పలు ఔత్సాహిక సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతూ ఫోర్బ్స్‌ ప్రశంసలూ అందుకున్నారు.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్