వీగన్‌ ఉత్పత్తులతో వందల కోట్లు..!

తోటి…కోడళ్లంటే ఒకరికొకరికి పడదనీ, రెండు కొప్పులూ కలవవనీ అనుకుంటుంటారు. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నం. ఒకరికి వచ్చిన ఆలోచనను మరొకరు ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెట్టారు. తమ ఇద్దరి పేర్లనూ కలగలిపి ‘కిమిరికా’ అనే బాడీకేర్‌ ఉత్పత్తుల తయారీ సంస్థకు శ్రీకారం చుట్టారు... వందల కోట్ల రూపాయల టర్నోవర్‌నీ అందుకుంటున్నారు.

Updated : 19 Jan 2024 07:02 IST

తోటి…కోడళ్లంటే ఒకరికొకరికి పడదనీ, రెండు కొప్పులూ కలవవనీ అనుకుంటుంటారు. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నం. ఒకరికి వచ్చిన ఆలోచనను మరొకరు ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెట్టారు. తమ ఇద్దరి పేర్లనూ కలగలిపి ‘కిమిరికా’ అనే బాడీకేర్‌ ఉత్పత్తుల తయారీ సంస్థకు శ్రీకారం చుట్టారు... వందల కోట్ల రూపాయల టర్నోవర్‌నీ అందుకుంటున్నారు. అదెలానో తెలుసుకుందామా..!

‘స్ఫూర్తి పొందడానికి ‘సూది మొన’ కూడా సాయపడుతుంది. అయితే అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పట్టుదల, ప్రణాళిక చాలా అవసరం’ అంటారు ఈ తోటికోడళ్లు. బ్యూటీ అండ్‌ బాడీకేర్‌ ఉత్పత్తుల తయారీ రంగంలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. వీరిద్దరిదీ మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌. వీరిలో కిమీ జైన్‌ ఎంబీఏ, రికా ఫార్మసీ పూర్తిచేశారు. అదే నగరానికి చెందిన అన్నాదమ్ములు మోహిత్‌, రజత్‌లతో పెళ్లవడంతో వీరు అక్కడే నివసిస్తున్నారు.

అలా మొదలైంది...

పెళ్లయిన కొత్తలో రికా... భర్త రజత్‌తో కలిసి ఓ హోటల్‌లో బస చేశారట. అప్పుడాగదిలో ఉంచిన టాయిలెట్రీ వస్తువులన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే అని గుర్తించారామె. ఇవే ఎందుకు? మొక్కల ఆధారిత (వీగన్‌)ఉత్పత్తుల తయారీతో తామూ ఈ వ్యాపారాన్ని చేయొచ్చన్న ఆలోచన రికా మదిలో మెదిలింది. దీన్ని భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులైన మోహిత్‌, కిమీజైన్‌లతోనూ పంచుకున్నారామె. అంతా కలిసి కొంత పరిశోధన చేశాక తమ ఆలోచన సరైనదేనన్న నిర్ణయానికి వచ్చి అక్కాచెల్లెళ్లిద్దరి పేర్లూ కలిసేలా ‘కిమిరికా’ పేరుతో కంపెనీ ప్రారంభించారు. దీనిద్వారా సహజ టాయిలెట్రీ (సబ్బులు, షాంపూలు, హెయిర్‌ కండిషనర్లు, టూత్‌ పేస్టులు, టాయ్‌లెట్‌ పేపర్లు) ఉత్పత్తులను తయారుచేసి వాటిని ప్రీమియం హోటళ్లకు సరఫరా చేయడం మొదలుపెట్టారు.

కాళ్లరిగేలా తిరిగాక...

సంస్థ ఏర్పాటుకి ప్రారంభ పెట్టుబడిగా ఇంటినీ, కొన్ని ఆస్తులనూ తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 700 చదరపు అడుగుల గదిలో, ఏడుగురు ఉద్యోగులతో పని ఆరంభించారు. ఏ పనైనా ఆచరణలోకి వచ్చాకే అందులోని లోతుపాట్లు తెలుస్తాయి. వీరికీ అంతే...అనుకున్నంత త్వరగా అవకాశాలేమీ వచ్చేయలేదు. ఇద్దరూ తమ భర్తలతో కలిసి అవకాశాల కోసం వివిధ హోటళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత మారియట్‌ గ్రూప్‌ హోటళ్లతో మొదటి ఒప్పందం జరిగింది. కొన్నాళ్లకే కెనడాకు చెందిన ‘హంటర్‌ ఎమినిటీస్‌’తో కలిసి ఉత్పత్తి ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడలేదు. వీరి సంస్థ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి ముందు వరకూ దేశంలో 95శాతం హోటళ్లు టాయిలెట్రీ ఉత్పత్తులను ప్రధానంగా చైనా నుంచి దిగుమతి చేసుకునేవి. కిమిరికా వచ్చాక ఇందులో 70శాతం మార్కెట్‌ని షేర్‌ చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం 70,000 చదరపు అడుగుల కార్యాలయంలో 400మంది  పనిచేస్తున్నారు. వీరిలో 80శాతం మంది మహిళలే కావడం విశేషం. బాత్‌, బాడీ ఉత్పత్తుల వ్యాపారం విజయవంతంగా సాగుతుండటంతో లగ్జరీ లైఫ్‌స్టైల్‌ ప్రొడక్ట్‌లైన స్కిన్‌కేర్‌ లోషన్లు, సీరమ్‌లు, జెల్స్‌, బొటానిక్‌ ఆయిల్స్‌... వంటివెన్నో రిటైల్‌ మార్కెట్‌లోకి తెచ్చారు. మొదటి ఆరు నెలల్లో 2500 మంది వినియోగదారులు మాత్రమే రావడంతో తమ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారు. అయితే, లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ అమ్మకాలు పెరగడంతో ఉత్సాహం వచ్చింది. దేశంలోని రిట్జ్‌కార్ల్‌టన్‌, హిల్టన్‌, హయత్‌, లీలా, మారియట్‌, ఐహెచ్‌జి... వంటివే కాకుండా గ్లోబల్‌ బ్రాండెడ్‌ హోటళ్లు అయిన స్టార్‌వుడ్‌, జుమేరా, సోఫిటెల్‌, పుల్‌మాన్‌.. వంటివీ వీరి ఖాతాదారులే. కియారా అద్వానీ వీరి ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 రిటైల్‌ అవుట్‌లెట్లు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, మార్చి 2023 నాటికి కిమిరికా హంటర్‌ ఇంటర్నేషనల్‌, కిమిరికా లైఫ్‌స్టైల్‌లు ఉమ్మడిగా ఏటా రూ.600 కోట్ల టర్నోవర్‌ని అందుకున్నాయి. ‘భవిష్యత్తులో మరిన్ని స్టోర్లు తెరవడమే మా లక్ష్యం’ అంటోన్న ఈ తోటి  కోడళ్లు... మరెందరికో స్ఫూర్తిదాయకమే కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్