మాకెదురైన ఇబ్బందే... వందల కోట్ల వ్యాపారమైంది!

పెద్ద చదువు, ఉన్నత ఉద్యోగం చాలు... అనుకోలేదామె. ఆంత్రప్రెన్యూర్‌ అవ్వాలని కలలు కన్నారు. వ్యాపార నేపథ్యం లేకపోయినా నిరూపించుకోవడమే కాదు... రూ.వందల కోట్ల ఆడియో బ్రాండ్‌ని నెలకొల్పారు.

Updated : 30 Jan 2024 07:14 IST

పెద్ద చదువు, ఉన్నత ఉద్యోగం చాలు... అనుకోలేదామె. ఆంత్రప్రెన్యూర్‌ అవ్వాలని కలలు కన్నారు. వ్యాపార నేపథ్యం లేకపోయినా నిరూపించుకోవడమే కాదు... రూ.వందల కోట్ల ఆడియో బ్రాండ్‌ని నెలకొల్పారు. తోటి మహిళలకు ఉపాధినీ చూపిస్తూ... అంతర్జాతీయ ప్రమాణాలున్న సంస్థగా తీర్చిదిద్దారు... మిధుల దేవభక్తుని. ఆ ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

వ్యాపారవేత్త అవ్వాలి... ఎనిమిదో తరగతిలో ఏర్పరచుకున్న కల ఇది. అలాగని మాదేమీ వ్యాపార నేపథ్యమున్న కుటుంబం కాదు. మాది విజయవాడ. నాన్న విద్యాసాగర్‌, అమ్మ అన్నపూర్ణ ఇద్దరూ ఉద్యోగులే. కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌, ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక అమెరికాలో అయిదేళ్లు ఉద్యోగం చేశా. మావారు విశ్వనాథ్‌ అక్కడే పరిచయమయ్యారు. ఇద్దరినీ కలిపిందీ వ్యాపారంపై ఆసక్తే. కానీ ఏం చేయాలన్నదే త్వరగా తట్టలేదు. ఓసారి భారత్‌కి వచ్చినపుడు ఛార్జింగ్‌ కేబుల్‌ కోసం చాలా వెదికామంటే నమ్ముతారా? ఒక్కటీ సరిగా లేదు. పైగా విదేశీ సంస్థలదే హవా. అవేమో మనకి నప్పేలా లేవు. ఆ ఇబ్బందే మా వ్యాపార ఆలోచనకు స్పష్టత తెచ్చింది. ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చి భారత్‌కి వచ్చేశాం. మా ఆలోచన విని ఇంట్లోవాళ్లు ‘మంచి ఉద్యోగం మాని, ఈ సాహసం అవసరమా’ అన్నా... చివరకు కాదనలేకపోయారు. ఇక మేమూ పరిశోధన మొదలుపెట్టాం. మనకు దొరికే ఛార్జింగ్‌ కేబుల్స్‌ అన్నీ పక్కదేశాల్లో తయారైనవే. ఇక బ్రాండెడ్‌వేమో ఖర్చెక్కువ. మన అభిరుచులు, సంస్కృతే కాదు, వాతావరణ పరిస్థితులూ భిన్నమే. మనకు ప్లగ్‌ పాయింట్లు గోడకే ఉంటాయి. మార్కెట్లో దొరికే కేబుల్సేమో చిన్నవి, పిన్‌లూ వేరుగా ఉంటాయి. అంతేకాదు, మనదగ్గర ఓల్టేజ్‌లో తేడాలెక్కువ. అందుకే ఛార్జింగ్‌ సరిగా కాకపోవడం, త్వరగా పాడవడం వంటి సమస్యలని గుర్తించాం. ఇవన్నీ తట్టుకునేలా ఎక్కువ కంట్రోలర్స్‌తో మామూలు దానికంటే రెట్టింపు పొడవులో కేబుల్స్‌, ఛార్జర్లను ప్రవేశపెట్టాం. దీనికోసం ఆరునెలలు చైనా వెళ్లి, డిజైన్‌ చేయించుకున్నాం. అలా 2016లో మా ఇద్దరి పేర్లమీదుగా ‘మివి’ ప్రారంభమైంది. 2020లో హైదరాబాద్‌లో తయారీనీ మొదలుపెట్టాం. దేశంలో ఈ కేటగిరీలో మాన్యుఫాక్చరింగ్‌ చేస్తోన్న తొలి సంస్థ మాదే. అమ్మకాలేమో ఈ-కామర్స్‌లో!

కొత్తలో ఒకే వ్యక్తి వెంటవెంటనే రెండు కారు ఛార్జర్లు కొన్నారు. అప్పట్లో ప్రతిదీ నేనూ, మావారే చూసుకునేవాళ్లం. దీంతో ప్రొడక్ట్‌ పాడైందేమోనని కంగారుపడ్డాం. అప్పటికి రోజుకు 3, 4 ఆర్డర్లే వచ్చేవి మరి. ఫోన్‌చేస్తే ‘గతంలో కొన్నవేమీ పనిచేయలేదు. ఇది చాలా బాగా పనిచేస్తోందని మా ఆవిడ కోసం మరొకటి కొన్నా’ అన్నారు. అది విని ఎంత సంతోషించామో. ఇప్పడు మా వ్యాపారం రూ.300 కోట్లు. ‘దేశీ ఉత్పత్తి అంటే నమ్మలేకపోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు ఉపయోగిస్తున్నా’రన్న కామెంట్లే మాకు ఎక్కువ సంతృప్తినిస్తాయి. ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులున్నారు. కానీ తొలిరోజుల్లో ఈ తరహా సంస్థలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎక్కువ జీతాలు, బెనిఫిట్స్‌ ఇచ్చి తీసుకున్నాం. ఛార్జర్లు, కేబుళ్లతో మొదలై ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌, స్పీకర్లు, సౌండ్‌బార్‌, స్మార్ట్‌వాచ్‌ వంటి ఉత్పత్తులెన్నో తీసుకొచ్చాం. గత ఏడాది మాన్యుఫాక్చరర్‌ అవార్డు సహా ఎన్నో పురస్కారాలూ అందుకున్నా. అమెరికాకి యాపిల్‌, దక్షిణ కొరియాకు శాంసంగ్‌... అలా భారత్‌ అనగానే మివి గుర్తొచ్చేలా చేయాలన్నది నా కల. ఈ ఏడాది ఆఫ్‌లైన్‌ అమ్మకాలూ ప్రారంభించబోతున్నాం.


తక్కువ చేసుకోవద్దు

వ్యాపారమనే కాదు, ఏం చేయాలన్నా అమ్మాయిలకు ‘మీవల్ల కాదు’ అన్న మాట వినిపిస్తుంది. అంతెందుకు ‘మివి’ కోఫౌండర్‌ని అన్నప్పుడు చాలామంది పేరుకే అనుకునేవారు. కానీ మార్కెటింగ్‌ వ్యవహారాలన్నీ చూసుకునేది నేనే. అందుకోసం కొన్నేళ్లు పిల్లల్నీ వద్దనుకున్నా. వాదించడం నా నైజం కాదు. నా ప్రెజెంటేషన్‌, ఆలోచనలు విన్నాక అవతలివాళ్లే అభిప్రాయం మార్చుకునేవారు. మా సంస్థలో 80 శాతం ఉద్యోగులు మహిళలే! ఎలక్ట్రానిక్‌ వస్తువులను అమర్చడానికి చాలా ఓపిక కావాలి. అది మనలోనే ఎక్కువ. ఇప్పటివరకూ ఉత్పత్తి పరంగా ఏ కంప్లైంట్లూ లేవు. ఈ ఉదాహరణ చాలదా... మనపై మనకు నమ్మకం ఉంటే ఎలాంటి పనికైనా మనం అర్హులమే అని చెప్పడానికి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్