ఈ చీరకీ ఓ లెక్కుంది!

ఫిబ్రవరి 1 వచ్చిందంటే... బడ్జెట్‌తో పాటు ఆ రోజు మన ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఏం చీర కడతారా అని ఎందరో ఆసక్తిగా చూస్తారంటే అతిశయోక్తి కాదేమో! ఆరోజు రానే వచ్చింది. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ సమర్పించడానికి వచ్చిన నిర్మలమ్మ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డునీ సొంతం చేసుకున్నారు.

Updated : 02 Feb 2024 08:49 IST

ఫిబ్రవరి 1 వచ్చిందంటే... బడ్జెట్‌తో పాటు ఆ రోజు మన ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఏం చీర కడతారా అని ఎందరో ఆసక్తిగా చూస్తారంటే అతిశయోక్తి కాదేమో! ఆరోజు రానే వచ్చింది. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ సమర్పించడానికి వచ్చిన నిర్మలమ్మ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డునీ సొంతం చేసుకున్నారు. నేత చీరలంటే మక్కువ చూపించే ఈమె ఈసారి రామనీలం- గోధుమ వర్ణం కాంబినేషన్‌లో, కాంతావర్క్‌ చేసిన టస్సర్‌ సిల్క్‌ చీరకట్టి అందరి చూపూ తనవైపు తిప్పుకొన్నారు. బెంగాలీ మహిళలు కట్టే సంప్రదాయ చీరల్లో ఇదొకటి. తూర్పు భారతదేశంలోని చేతి కుట్టుల్లో ఒకటి కాంతా ఎంబ్రాయిడరీ. శతాబ్దాల చరిత్ర కలిగిన దీన్ని టస్సర్‌ సిల్క్‌మీదే చేస్తారు. బెంగాల్‌తో పాటు ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో ఇవెంతో ప్రసిద్ధి. ఇక, ఈసారి నిర్మలమ్మ ఎంచుకున్న రామనీల వర్ణం ఆరోగ్యానికి ప్రతీక మాత్రమే కాదు... అధికారం, విశ్వాసం, స్థిరత్వం, ఐక్యతలకు సూచిక కూడా. అందుకే, అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠకు సంకేతంగా దీన్ని ధరించారట.

ఏంటి దీని ప్రత్యేకత: టస్సర్‌ సిల్క్‌ కూడా ఒక రకమైన పట్టు. తెల్లమద్ది, నల్లమద్ది, ఓక్‌ వంటి అడవి చెట్ల ఆకులను ఆహారంగా తీసుకుని పట్టు పురుగులు గూళ్లు అల్లుతాయి. వీటి నుంచి తీసిన దారాలతో తయారు చేసినదే టస్సర్‌ సిల్క్‌. తయారైన ప్రాంతాలను బట్టి దీని పేరు మారుతోంది. ఝార్ఖండ్‌లో కోసా సిల్క్‌గా, బిహార్‌లోని భాగల్‌పుర్‌లో ఉత్పత్తి అయినదాన్ని భాగల్‌పురి సిల్క్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మరెన్నో రకాలూ ఉన్నాయి. సహజ బంగారు వర్ణంలో మ్యాట్‌ ఫినిషింగ్‌తో కనిపించే ఈ పట్టుని సింథటిక్‌ దారాలతో కలిపి నేయడం కష్టం. అయితే, దీని టెక్స్చర్‌ ముతకగా ఉన్నా, కట్టుకున్నవారికి చల్లదనాన్నీ, సౌకర్యాన్నీ ఇస్తుంది. ఇక, బెంగాలీ ప్రాంత హస్తకళల్లో, జానపద కళారూపాల్లో కాంతావర్క్‌ది ప్రత్యేక స్థానం. శాంతినికేతన్‌కి సమీపంలోని బీర్బూమ్‌ జిల్లాల్లో ఈ ఎంబ్రాయిడరీ పుట్టింది. పాతచీరలు, ధోతీలను బొంతలు, దుప్పట్లుగా మార్చేందుకు మొదట్లో ఎక్కువగా వాడేవారట. పువ్వులూ, మనుషుల రూపాలతో పాటు పౌరాణిక గాథలూ ఈ కుట్టులో అందంగా ఒదిగిపోతాయి. ఇప్పుడిది కొత్త సొబగులద్దుకుని చీరలతో పాటు ఆధునిక వస్త్రాలూ, యాక్సెసరీలూ, గృహాలంకరణ ఉత్పత్తులపైనా కనువిందు చేస్తోంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే భిన్నత్వంలో ఏకత్వం ప్రతిఫలించేలా కాంతావర్క్‌ చేసిన టస్సర్‌ చీరను ఎంచుకున్నారట మన నిర్మలమ్మ. బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్