నిలిచి గెలిచిన సిరిమాలక్ష్ములు!

సిరులు పండించాలంటే లక్ష్మీకటాక్షం ఉండాలి... విద్వత్తు పొందాలంటే సరస్వతీ కరుణ కావాలి... విజయంకోసం భద్రకాళిలా పోరాడాలి... ఈ మూడింటినీ అందిపుచ్చుకుని... ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో... సంస్థలని ముందుకు నడిపించి... సంపదల్ని రెట్టింపు చేసి... ఫోర్బ్స్‌ తాజా జాబితాకెక్కిన సంపన్న మహిళల్లో కొందరు...

Updated : 02 Feb 2024 07:21 IST

సిరులు పండించాలంటే లక్ష్మీకటాక్షం ఉండాలి... విద్వత్తు పొందాలంటే సరస్వతీ కరుణ కావాలి... విజయంకోసం భద్రకాళిలా పోరాడాలి... ఈ మూడింటినీ అందిపుచ్చుకుని... ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో... సంస్థలని ముందుకు నడిపించి... సంపదల్ని రెట్టింపు చేసి... ఫోర్బ్స్‌ తాజా జాబితాకెక్కిన సంపన్న మహిళల్లో కొందరు...


వెనక కాదు... తోడుగా!

రోహికా ఛాగ్లా అంటే ఎవరీమె అనిపించొచ్చు. కానీ టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ భార్య అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. ముంబయిలో... న్యాయవాదుల కుటుంబంలో పుట్టారీమె. న్యాయవిద్య చదివినా, పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికే రోహిక మొగ్గు చూపారని చాలామంది అనుకుంటారు. కానీ భర్త మాటు భార్యలానే మిగిలిపోలేదావిడ. ‘నీ ఈ నిర్ణయం తప్పు అని ధైర్యంగా నా మొహానే చెబుతుంది మా ఆవిడ. నేనేది చేయాలనుకున్నా తను తోడు ఉందన్న ధైర్యం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది’ అని పలు సందర్భాల్లో సైరస్‌ చెప్పారంటే ఆవిడ పాత్రేంటో అర్థం చేసుకోవచ్చు. ఛైర్మన్‌ పదవి నుంచి ఆయన్ని తొలగించినప్పుడూ, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చేసిన న్యాయపోరాటంలోనూ సైరస్‌ వెన్నంటే ఉన్నారామె. అందుకే ఆయన కూడా ‘రోహిక స్థానం నా వెనక కాదు, నా పక్కన. నిజానికి తనే నా ధైర్యం’ అనేవారు. సైరస్‌ మరణానంతరం ఆయన ఆస్తిలో ప్రధాన వాటాదారు అయ్యారు రోహిక. తాజాగా ‘ఫోర్బ్స్‌’ దేశీ మహిళా బిలియనీర్ల జాబితాలో 8.7 బిలియన్‌ డాలర్ల సంపద (సుమారు రూ.72వేల కోట్లు)తో రెండో స్థానంలో నిలిచారీమె. రోహిక పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డైరెక్టర్‌ కూడా. పర్యటన నిమిత్తం ఓ గిరిజన గ్రామానికి వెళ్లిన ఆమె అక్కడి విద్యా విధానానికి ముగ్ధులయ్యారు. కానీ కనీస సౌకర్యాలు లేకపోవడం చూసి బాధపడ్డారు. దానికి వసతులు కల్పించారు. ఆ తర్వాత మారుమూల ప్రాంతాల పాఠశాలలకు సౌకర్యాలు, ఆంగ్లవిద్య పరిచయం, అక్కడి పిల్లలకు పోషకాహారం అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇన్ని చేస్తున్నా, తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు 52 ఏళ్ల రోహిక.


లేడీ ఝున్‌ఝున్‌వాలా...

ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా. ‘బిగ్‌బుల్‌’, ‘ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌’ అని పిలుచుకునే రాకేష్‌ గురించి తెలిసినంతగా రేఖ ఝున్‌ఝున్‌వాలా గురించి చాలామందికి తెలియదు. కారణం కెరియర్‌... కుటుంబం... రెండింట్లో దేనికి ప్రాధాన్యం అనుకున్నప్పుడు కుటుంబానికే ఓటు వేశారు రేఖ. రెండేళ్ల క్రితం రాకేష్‌ మరణించినప్పుడు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆయన నుంచి వారసత్వంగా అందిన పోర్ట్‌ఫోలియోని లాభాల బాట పట్టించారు. ఆ ధైర్యమే ఆమెని రూ.65 వేల కోట్లతో దేశ సంపన్న మహిళల జాబితాలో మూడో స్థానంలో నిలిపింది. ఆరుగురు సంతానంలో రేఖ రెండో అమ్మాయి. తండ్రిది ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌. ముంబయి యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు. భర్తతో కలిసి రేర్‌(ఆర్‌ఏఆర్‌ఈ) అనే పెట్టుబడుల సంస్థని ప్రారంభించారు. ఆర్‌ఏ అంటే రాకేష్‌... ఆర్‌ఈ అంటే రేఖ. వాళ్లిద్దరూ మొదట్నుంచీ స్నేహితుల్లానే ఉండేవారు. పెళ్లైన 17 ఏళ్ల తర్వాత మొదటి సంతానం నిష్ఠ పుట్టినప్పుడు... ఆరునెలలు మంచానికే పరిమితం అయ్యారు. ఆ పాప పుట్టేంతవరకూ ఉమ్మడి కుటుంబంలోనే ఒదిగిపోయారు.  ఆ తర్వాతే ముంబయిలో సొంత ఇంటికి మారారు. భర్త మరణం తర్వాతా.. టైటాన్‌, టాటామోటార్స్‌ వంటి 29 సంస్థల్లో పెట్టుబడులు కొనసాగిస్తూ లాభాలు గడించారు. భర్త ప్రారంభించిన సేవా కార్యక్రమాలూ కొనసాగిస్తున్నారు.


విద్యుత్‌ పరికరాల తయారీతో...

వంటింట్లో కనిపించే మిక్సీలు, గ్రైండర్లు, రైస్‌ కుక్కర్ల దగ్గర్నుంచి... భారీ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ మోటార్ల తయారీ వరకూ హెవెల్స్‌ ఇండియా ముద్ర ప్రత్యేకం. 50 దేశాల్లో విస్తరించిన ఈ సంస్థను.. 50 ఏళ్లుగా వెనకుండి నడిపిస్తున్న డ్రైవింగ్‌ ఫోర్స్‌ పేరే వినోద్‌ రాయ్‌ గుప్తా. సుమారుగా రూ.35 వేల కోట్లతో దేశంలోనే నాలుగో సంపన్న మహిళ స్థానం దక్కించుకున్న వినోద్‌ రాయ్‌నీ.. హెవెల్స్‌ ప్రస్థానాన్నీ వేరుచేసి చూడలేం. ఆమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌. భర్త కీమత్‌ రాయ్‌గుప్తా పంజాబ్‌లో సాధారణ డ్రాయింగ్‌ టీచర్‌. ఉపాధి కోసం దిల్లీ వచ్చారీ దంపతులు. భర్త కీమత్‌.. ఓ చిన్న ఎలక్ట్రిక్‌ దుకాణంలో విద్యుత్‌ కేబుళ్లు అమ్మేవాడు. మూతపడ్డానికి సిద్ధంగా ఉన్న ఓ దుకాణాన్ని రూ. ఏడు లక్షలకు కొనుక్కుని లాభాల బాట పట్టించారీ దంపతులు. ఆ సంస్థే హెవెల్స్‌ ఇండియా. కేబుళ్లు, స్విచ్చుల తయారీతో మొదలుపెట్టి... ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు తయారుచేసుకుంటూ వెళ్తోన్న ఈ సంస్థకు చైనా ఉత్పత్తులు... విదేశీ సంస్థల నుంచి గట్టి పోటీ ప్రారంభమైంది. అదే సమయంలో కీమత్‌ గుండెపోటుతో మరణించారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొడుకు అనిల్‌ని సంస్థ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అంతవరకూ సంస్థకు అండగా నిలబడ్డారు. ఆవిష్కరణలు, పరిశోధనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 14 ఫ్యాక్టరీలు స్థాపించి 50 దేశాల్లో సంస్థ విస్తరించడానికి కారణమయ్యారు. 77 ఏళ్ల వయసులోనూ సంస్థను అదే జోష్‌తో నడుపుతూ ధైర్యలక్ష్మిలా నిలబడ్డారు.


మనసున్న మారాణి!

గోద్రెజ్‌ వ్యాపార సామ్రాజ్యంలో మూడో తరంలో పుట్టారు స్మితా గోద్రెజ్‌. సంపన్న కుటుంబంలో పుట్టినా పేదల మనసు తెలుసు. అందుకే కుటుంబ వ్యాపారంలో భాగమవుతూనే సేవాకార్యక్రమాలకూ చోటిచ్చారు. స్వస్థలం ముంబయి. ‘లా’లో డిగ్రీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. గోద్రెజ్‌ని విద్య, ఆరోగ్య రంగాల్లోనూ దూసుకెళ్లేలా చేసి, ‘టాప్‌ విమెన్‌ బిజినెస్‌ లీడర్‌’లలో ఒకరిగా నిలిచారు స్మిత. దేశంలో మహిళా బిలియనీర్లలో ఈమె ఒకరు. 3.3 బిలియన్లతో (సుమారు రూ.27.5 వేల కోట్లు) తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఆటలంటే ప్రాణం. యువతరాన్ని క్రీడల్లో ప్రోత్సహిస్తే బృందస్ఫూర్తి అలవడటమే కాదు, ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మిన స్మిత పేద ఔత్సాహికులు రాణించేలా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ప్రకృతి ప్రేమికురాలు. వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ ఇండియా సభ్యురాలిగా మొక్కలు నాటడం, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, వాటర్‌ కన్జర్వేషన్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. వివిధ విద్యాలయాల ట్రస్టీగా స్టెమ్‌ రంగాల దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం, గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి, వారిని వ్యాపార దిశగా ప్రోత్సహించడం లాంటివెన్నో చేస్తున్నారు. గోద్రెజ్‌ ట్రస్ట్‌కి ట్రస్టీ కూడా. 73ఏళ్ల స్మిత... ఎదగాలనే తాపత్రయంలో పడి మానసిక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దంటారు. దీని ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ అవగాహనా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్